Sports ground
-
క్రికెట్ గ్రౌండ్స్.. ఫర్ రెంట్!.. అద్దె కట్టు.. బ్యాట్ పట్టు..
మన దగ్గర క్రికెట్ అంటే ఉండే క్రేజే వేరు. చిన్నప్పుడు గల్లీల్లో క్రికెట్ ఆడినా.. కాస్త పట్టు చిక్కినవారు, దానిపై మక్కువ ఉన్నవారు, ప్రొఫెషనల్‌గా తీసుకునేవారు మాత్రం విశాలమైన గ్రౌండ్ల కోసం వెతుకుతుంటారు. ఈ క్రమంలోనే నగర శివార్లలో అద్దె మైదానాలు వెలిశాయి. ఔటర్ రింగ్‌రోడ్డుకు అటూ ఇటూ భూములున్నవారు ఖాళీగా ఉన్న తమ భూములను క్రికెట్ మైదానాలుగా మార్చేసి అద్దెకు ఇస్తున్నారు. మ్యాచ్‌కు ఇంత అని లేకుంటే రోజుకు ఇంత అని వసూలు చేస్తున్నారు. అటు క్రీడాకారుల అవసరాన్ని తీర్చుతూనే, ఇటు ఆదాయాన్ని కూడా పొందుతున్నారు. ఇలా నగరంలో, శివార్లలో వందలకొద్దీ గ్రౌండ్లు ఏర్పాటయ్యాయి. అందులో ఒక్క మొయినాబాద్ మండలం పరిధిలోనే 60కిపైగా మైదానాలు ఉండటం గమనార్హం.రోజురోజుకూ విస్తరిస్తున్న విశ్వనగరం హైదరాబాద్‌లో క్రికెట్ అంటే మోజు ఎక్కువ. ఆ ఆటను చూసేవారే కాదు.. ఆడేవారి సంఖ్య కూడా బాగా పెరిగిపోతోంది. సిటీలో గచ్చిబౌలి, ఉస్మానియా యూనివర్సిటీ, యూసఫ్‌గూడ, ఎల్బీ స్టేడియం, సరూర్‌నగర్‌లలో స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు ఉన్నా.. అవి క్రీడాకారుల అవసరాలకు సరిపోవడం లేదు. మరోవైపు క్రీడాకారుల్లోని ప్రతిభను గుర్తించి, వెలికి తీసేందుకు వివిధ సంఘాలు, అసోసియేషన్లు ఏదో ఒక పేరుతో తరచూ క్రీడాపోటీలు నిర్వహిస్తున్నాయి.దీంతో గ్రౌండ్ల కోసం డిమాండ్ మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో అటు క్రీడాకారులకు అందుబాటులో ఉండేలా, తామూ కొంత ఆదాయం పొందేలా.. నగర శివార్లలో భూములున్నవారు తమ భూములను క్రీడా మైదానాలు మారుస్తున్నారు. భూములను చదును చేసి, చుట్లూ ఎత్తయిన ప్రహరీలు లేదా ఇనుప కంచెలు ఏర్పాటు చేస్తున్నారు. చుట్టూ చెట్లను, మైదానమంతా పచ్చనిగడ్డిని పెంచుతున్నారు. ఇతర మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్క క్రికెట్ అనేగాకుండా వాలీబాల్, ఫుట్‌బాల్, టెన్నిస్ వంటి ఇతర పోటీలకు కూడా ఈ గ్రౌండ్లను అద్దెకు ఇస్తున్నారు.శివార్లలో సాగు చేయలేక..సిటీ శివారు ప్రాంతాల్లో భూగర్భ జలాలు తక్కువగా ఉండటం, వానలు సరిగా పడకపోవడం వంటి పరిస్థితుల్లో రైతులు పంటలు సాగు చేయడం లేదు. ఈ ప్రాంతాల్లో కూలీలు దొరకడం కూడా కష్టంగా మారింది. సాగు చేసినా.. ఖర్చులు రెట్టింపు అవుతున్న పరిస్థితి. దీనితో ఖాళీగా ఉన్న పొలాలను మైదానాలుగా మారుస్తున్నారు. ఒకేచోట నాలుగైదు ఎకరాల భూమి ఉన్నవారు ఓపెన్ స్టేడియాలుగా మారుస్తుండగా.. అర ఎకరం, ఎకరం భూమి ఉన్న వారు నెట్ స్టేడియాలు ఏర్పాటు చేస్తున్నారు. వాటిని క్రీడా మైదానాల నిర్వాహకులకు లీజుకు ఇస్తున్నారు. ముఖ్యంగా నగరానికి చేరువలో ఉన్న మొయినాబాద్ మండలం క్రీడా హబ్‌గా మారుతోంది. ఈ ఒక్క మండలంలోనే సుమారు 65 క్రికెట్ గ్రౌండ్లు ఉన్నాయి. ఇబ్రహీంపట్నం మండలంలో ఆరు, శంషాబాద్ మండలంలో ఐదు, హయత్‌నగర్ మండలంలో మూడు మైదానాలు ఏర్పాటయ్యాయి.ఉద్యోగ, వ్యాపార వర్గాలూ..రాజకీయ, సినీ ప్రముఖులు, వ్యాపారులు, ఉద్యోగులు.. సిటీ శివార్లలో భారీగా భూములు కొనుగోలు చేశారు. వారిలో కొందరు గేటెడ్ కమ్యూనిటీలు, విల్లాలు ఏర్పాటు చేస్తే.. మరికొందరు భూములను ఖాళీగా ఉంచడం ఇష్టం లేక క్రీడా మైదానాలుగా మారుస్తున్నారు. కొనుగోలు చేసిన భూములకు రక్షణగా ఉండటంతోపాటు అద్దె ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నారు. కొన్ని ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలు కూడా విద్యార్థులను ఆకర్షించేందుకు క్రీడా మైదానాలు ఏర్పాటు చేస్తున్నాయి. వారాంతాల్లో వాటిని అద్దెకు కూడా ఇస్తున్నాయి.ఏర్పాట్లను బట్టి అద్దెలు..ఈ గ్రౌండ్లలో వీక్షకులు కూర్చునేందుకు వీలుగా కుర్చీలు, మరుగుదొడ్లు, విద్యుత్, సౌండ్ వ్యవస్థలు, భారీ స్క్రీన్లు, ఎల్ఈడీ లైట్లు, ఇతర మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ సదుపాయాలను బట్టి, డిమాండ్‌ను బట్టి అద్దెలు వసూలు చేస్తున్నారు. గ్రౌండ్ల బుకింగ్ కోసం కొందరు నిర్వాహకులు ఆన్లైన్ బుకింగ్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చారు. పెద్ద గ్రౌండ్లు అయితే ఒక్కో మ్యాచ్‌కు రూ.5000 నుంచి రూ.10 వేల వరకు చార్జీ చేస్తున్నారు. నెట్, ఫెన్సింగ్‌తో ఉండే చిన్న గ్రౌండ్లకు గంటకు రూ.500 నుంచి రూ.1000 వరకు చార్జీ చేస్తున్నారు. శని, ఆదివారాలు, ఇతర సెలవు రోజుల్లో కాస్త ఎక్కువగా వసూలు చేస్తున్నారు.క్రికెట్‌పై ఇష్టంతోచిన్నప్పటి నుంచీ క్రికెట్ అంటే ఎంతో ఇష్టం. అందుకే క్రికెట్ ఆడేందుకు ఎంత దూరమైనా వెళ్తుంటా. హైదరాబాద్ నగరంలో క్రికెట్ మైదానాలు అందుబాటులో లేవు. ఎక్కడైనా పార్కుల్లో ఉన్నా క్రికెట్ ఆడేందుకు ఇబ్బందిగా ఉంటుంది. దాంతో ప్రతిరోజు క్రికెట్ ఆడేందుకు సిటీ బయటి ప్రాంతాలకు వెళ్తున్నాను. క్రీడాకారులందరం డబ్బులు పోగేసుకుని మైదానాన్ని అద్దెకు తీసుకుంటాం. - సయ్యద్ అర్షద్, క్రీడాకారుడుఆన్లైన్ ద్వారా అద్దెకు..క్రీడాకారులకు అందుబాటులో ఉండేలా క్రికెట్ మైదానాలు ఏర్పాటు చేశాం. ఎవరైనా ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. చాలా వరకు క్రీడాకారులు ట్వంటీ ట్వంటీ మ్యాచ్‌లు ఆడుతుంటారు. సాధారణ రోజుల్లో మ్యాచ్‌కు రూ.2 వేల నుంచి రూ.4 వేలు.. శని, ఆదివారాల్లో అయితే మ్యాచ్‌కు రూ.5 వేల నుంచి రూ.7 వేల వరకు అద్దె వసూలు చేస్తాం. గ్రౌండ్ నిర్వహణకే చాలా వరకు ఖర్చవుతుంది. మౌలిక సదుపాయాలు, డిమాండ్‌ను బట్టి చార్జీలలో మార్పులు ఉంటాయి.– రాజేందర్‌రెడ్డి, క్రికెట్ మైదానం నిర్వాహకుడు, మొయినాబాద్క్రికెట్ గ్రౌండ్లు ఉన్నగ్రామాల వివరాలివీ..గ్రామం గ్రౌండ్లుబాకారం 15అజీజ్‌నగర్ 12ఎనికేపల్లి 12చిలుకూరు 6నజీబ్‌నగర్ 4అమ్డాపూర్ 3నాగిరెడ్డిగూడ 3హిమాయత్‌నగర్ 3కనకమామిడి 3రెడ్డిపల్లి 3తుర్కయాంజాల్ 2కొంగరకలాన్ 2మోత్కుపల్లి 1శ్రీరాంనగర్ 1బొంగుళూరు 1ఇబ్రహీంపట్నం 1నాదర్గుల్ 1 -
ఎన్ఎండీసీ క్రికెట్ ట్రోఫీ ఫైనల్‌కు సింగరేణి జట్టు
నాంపల్లి: ఎనిమిది ప్రభుత్వ రంగ సంస్థలు తలపడుతున్న ప్రతిష్టాత్మక ఎన్ఎండీసీ క్రికెట్ టోర్న్ లో సింగరేణి కాలరీస్ జట్టు అద్భుతమైన ఆట తీరు ప్రదర్శించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. హైదరాబాద్‌లోని విజయ్ ఆనంద్ క్రీడా మైదానంలో ఆదివారం జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో సింగరేణి జట్టు హిందుస్తాన్ ఏరో నాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) జట్టుతో తలపడింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హెచ్ఏఎల్ జట్టు నిర్ణత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 108 పరుగులు మాత్రమే చేయగలిగింది. హెచ్ఏఎల్ జట్టు ఓపెనర్ సందీప్‌కుమార్ అత్యధికంగా 48 పరుగులు చేశాడు. సింగరేణి జట్టు బౌలర్లు జగదీష్ (2 వికెట్లు), మహేష్ (2 వికెట్లు), హరికిషన్ (ఒక వికెట్)లు కట్టుదిట్టమైన బౌలింగ్ చేసి హెచ్ఏఎల్ జట్టును తక్కువ స్కోర్‌కు పరిమితమ్యేలా చేయడంలో సఫలమయ్యారు. ఆ తర్వాత 109 పరుగుల లక్ష్య సాధనతో బరిలోకి దిగిన సింగరేణి జట్టు ఓపెనర్లు శశికాంత్, డేవిడ్, రిచర్డ్స్ దూకుడుగా బ్యాటింగ్ చేశారు. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడటమే కాకుండా తొలి వికెట్‌కు కేవలం 9 ఓవర్లలో 76 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. 47 పరుగుల వద్ద డేవిడ్ రిచర్డ్స్ అవుట్ అయ్యాక.. జట్టు కెపె్టన్ శశికాంత్ నిలకడగా ఆడుతూ జట్టుకు విజయాన్ని అందించారు. డేవిడ్ రిచర్డ్స్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. ఈ టోరీ్నలో సింగరేణి జట్టు లీగ్ దశలో తాను ఆడిన ఈసీఐఎల్, మిథాని, ఎన్ఆర్ఎస్ఈ జట్లను ఓడించి ఓటమి లేని జట్టుగా నిలిచింది. ఆగస్టు 6న ఆదివారం ఫైనల్ మ్యాచ్ భెల్‌తో తలపడనుంది. -
అధికార ఆట..!
జిల్లాలోని క్రీడా మైదానాలు క్రీడాకారులు ఆడుకునేందుకా లేక హెలీక్యాప్టర్ల ల్యాండింగ్ కోసమా అన్న చందంగా తయారయ్యాయి. ఇప్పటికే నగరంలో మూడు శాశ్వత హెలీప్యాడ్లు ఉండగా.. తాజాగా మరో హెలీప్యాడ్‌ను ఏర్పాటు చేస్తున్నారు.. అది కూడా నగరం నడిబొడ్డున ఉన్న ఏకైక డీఎస్ఏ క్రీడామైదానంలో. దీంతో క్రీడాకారులు ఉన్న మైదానాలన్నీ హెలీప్యాడ్ల నిర్మాణానికే వినియోగిస్తే ఇక తాము ఎక్కడ ఆడుకోవాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కడప స్పోర్ట్స్: ముఖ్యమంత్రి పర్యటనతో జిల్లాకు కలిగే ప్రయోజనం సంగతి ఏమో కాని.. క్రీడాకారులకు మాత్రం నష్టపోతూనే ఉన్నారు. గతంలో స్టేడియంలో ఏర్పాటు చేసిన ఓ సభ కోసం మైదానం చుట్టూ ఉన్న ప్రహరీలను కూల్చారు. తర్వాత ఏడాదికి గాని మళ్లీ ఆ గోడల స్థానంలో గేట్లు ఏర్పాటు చేయలేకపోయారు. తరచూ క్రీడల అభివృద్ధికి కృషిచేస్తామంటూ గొప్పలు చెప్పుకునే పాలకులు.. ఉన్న మైదానాలను నాశనం చేస్తుండటం పట్ల క్రీడాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా నగరంలోని డీఎస్ఏ మైదానంలో శాశ్వత హెలీప్యాడ్ ఏర్పాటు చేస్తుండడంతో ఏమి చేయాలో క్రీడాకారులకు పాలుపోవడం లేదు. ఏదైనా కష్టం వస్తే.. జిల్లాలో ఉన్నతాధికారులకు చెప్పుకుంటారు.. వారి ఆదేశాల మేరకే మైదానంలో శాశ్వత హెలీప్యాడ్ ఏర్పాటు చేస్తుండడంతో తమ బాధను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదంటూ క్రీడాకారులు ఆవేదన చెందుతున్నారు. మరో మైదానం బలి జిల్లా కేంద్రమైన కడప నగరంలో ఉన్న మైదా నాలు రెండే రెండు.. ఒకటి డీఎస్ఏ క్రీడామైదానం.. మరొకటి ఆర్ట్స్ కళాశాల మైదానం. రెండు సంవత్సరాల క్రితం క్రీడాకారులు వ్యతిరేకించినప్పటికీ ఆర్ట్స్ కళాశాల మైదానం మధ్యలో శాశ్వత హెలీప్యాడ్‌ను ఏర్పాటు చేశారు. దీంతో పాటు 10 సంవత్సరాల క్రితం రిమ్స్‌లో కూడా శాశ్వత హెలీప్యాడ్ ఏర్పాటు చేశారు. దీంతో పాటు నగర శివారులోని డీటీసీలో కూడా హెలీప్యాడ్ ఉంది. పైగా అందుబాటులో విమానాశ్రయం కూడా ఉంది. ఇన్ని హెలీప్యాడ్లు ఉండగా మళ్లీ మరో హెలీప్యాడ్ నిర్మాణం చేపట్టడం ఏంటని నగర ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం నగరంలోని ప్రకాశం పంతులు జిల్లా క్రీడాప్రాథికారసంస్థ మైదానం (మున్సిపల్ స్టేడియం) మధ్యభాగంలో హాకీ కోర్టులో శాశ్వత హెలీప్యాడ్ నిర్మాణం కోసం పనులు ప్రారంభించారు. మంగళవారం ప్రారంభించిన పనులను చూస్తున్న క్రీడాకారులు ఇక్కడ తవ్వుతున్నారేంటని ప్రశ్నించడంతో ఇక్కడ శాశ్వత హెలీప్యాడ్ ఏర్పాటు చేస్తున్నామని పేర్కొనడంతో క్రీడాకారులు అవాక్కయ్యారు. ప్రతిరోజూ ఇక్కడ తాము సాధన చేస్తుంటామని.. త్వరలో ఇక్కడ అంతర్ జిల్లాల హాకీ టోర్నమెంట్ నిర్వహించనున్న నేపథ్యంలో ఇలా హెలీప్యాడ్ ఏర్పాటు చేస్తే తాము ఎక్కడ సాధన చేయాలంటూ జిల్లా క్రీడాప్రాథికార సంస్థ అధికారులను ప్రశ్నించారు. జిల్లా ఉన్నతాధికారుల నిర్ణయమని తామేమీ చేయలేమంటూ డీఎస్ఏ అధికారులు చేతులెత్తేశారు. దీంతో తమ బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని స్థితిలో క్రీడాకారులు ఉన్నారు. కలెక్టరేట్ వద్ద ఆందోళన.. డీఎస్ఏ మైదానంలోని హాకీ కోర్టులో శాశ్వత హెలీప్యాడ్ నిర్మాణాన్ని నిలిపివేయాలంటూ హాకీ క్రీడాకారులు మంగళవారం రాత్రి ఆందోళనకు దిగారు. నిర్మాణ పనులపై జిల్లా కలెక్టర్‌ను కలిసి విన్నవించేందుకు పలువురు క్రీడాకారులు కలెక్టరేట్‌కు చేరుకున్నారు. జిల్లా కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో కలెక్టరేట్ ముఖద్వారం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. హెలీప్యాడ్ నిర్మాణం నిలిపివేయాలంటూ నినాదాలు చేశారు. హాకీ కోర్టులో హెలీప్యాడ్ ఏర్పాటు వద్దు.. ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో నగరంలోని డీఎస్ఏ మైదానంలో హాకీ సాధన చేస్తుం టాం. అయితే మంగళవారం సాయంత్రం ఆడుకునేందుకు వస్తే ఇక్కడ గుంత తవ్వుతున్నారు. అదీ కోర్టు మధ్యలో తవ్వడంతో ఆడుకునేందుకు వీలులేకుండా పోతోంది. అధికారులు ఆలోచించి నిర్మాణ పనులు నిలిపివేయాలి. – అఖిల్, హాకీ క్రీడాకారుడు, కడప శాశ్వత నిర్మాణం వద్దు.. డీఎస్ఏ మైదానంలో శాశ్వత హెలీప్యాడ్ ఏర్పాటు చేస్తే క్రీడాకారులకు ఇబ్బందులు తప్పవు. బాగున్న మైదానాన్ని ఇలా హెలీప్యాడ్ కోసం వినియోగించడం సరికాదు. ఒకవేళ తప్పనిసరి అనుకుంటే తాత్కాలిక హెలీప్యాడ్ ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది. అధికారులు ఆలోచించి నిర్మాణ పనులు ఆపివేయాలి. – కుమార్‌బాబు, క్రీడాకారుడు, కడప -
పట్టపగలు దారుణం
అయ్యప్ప దీక్ష పూర్తి చేసి శబరిమల వెళ్లి వచ్చాడు.. ఇంట్లో దుర్గామాత పూజ చేసుకొని ఆటల పోటీలు చూసొద్దామని కాలేజీకి వెళ్లాడు.. పాత కక్షలో, క్షణి కావేశమో తెలీదు గానీ కొంతమంది యువకులు హఠాత్తుగా దాడి చేయడంతో దెబ్బలకు తాళలేక విలవిల్లాడిపోయాడు.. పట్టపగలు జనసమూహానికి చేరువలో జరిగిన ఈ దారుణ హత్య చోడవరంలో సంచలనం సృష్టించింది. రేస్ బైక్‌పై వచ్చారు.. తెల్లటి రేస్ బైక్‌పై వచ్చిన యువకులు కొట్టి చంపారని స్థానికులు చెప్పారు. గొడవ జరుగుతున్న సమయంలో అడ్డుకోడానికి ప్రయత్నించామని, అయితే తమకు వార్నిం గ్ ఇచ్చారని యువకులు తెలిపారు. వారి మధ్య గతంలో ఒకసారి గొడవ జరిగిందని, తాజా ఘటనలకు అదే కార ణమై ఉంటుందని చెప్పారు. ఈ ఘటనతో సిటిజన్ కాలనీ అంతా విషాదం అలముకుంది. ప్రసాద్ మంచివాడని, అం దరితో సరదాగా ఉంటాడని కాలనీవాసులు పేర్కొన్నారు. విశాఖపట్నం, చోడవరం టౌన్: ఆకతాయిలు.. జులాయిగా తిరుగుతూ అందరితో గొడవ పడుతుంటారు.. అందరూ చూస్తుండగానే నిర్భయంగా ఓ యువకుడిని చంపేశారు.. కాలేజీ మైదానంలో ఒకపక్క అంతర కళాశాలల క్రీడాపోటీలు జరుగుతుండగానే ఈ ఘటన జరిగింది. కొట్టి కొట్టి బైక్‌పై తీసుకొచ్చి రోడ్డుపై పడేసి వెళ్లిపోయారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ గాంధీ గ్రామం పంచాయతీ సిటిజన్ కాలనీకి చెందిన చిలకా దుర్గా ప్రసాద్ (22) ప్రాణాలు క్షణాల్లో గాల్లో కలిసిపోయాయి. భర్తను కోల్పోయి కొడుకుపైనే కోటి ఆశలు పెట్టుకున్న మృతుడి తల్లి పెడుతున్న రోదనలు చూపరులను సైతం కదిలిం చాయి. తల్లి ఫిర్యాదు మేరకు తొమ్మి ది మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రభుత్వ హైస్కూల్ ఆవరణలో ఆదివారం జిల్లా అంతర కళాశాలల క్రీడా పోటీలు జరుగుతున్నాయి. ఆ పోటీలు తిలకిస్తున్న దుర్గాప్రసాద్‌ను కొంతమంది యువకులు పక్కకు లాక్కెళ్లారు. ఆటలు చూస్తూ ఎవరి హడావుడిలో వారుం డగా.. ఏమైందో తెలీదు గానీ ఒక్కసారిగా వారు ప్రసాద్‌పై దాడి చేశారు. వెంటపడి మరీ కొట్టారు. తీవ్రగా యాలతో అపస్మారక స్థితిలో వున్న అతడిని బైక్‌పై రో డ్డుపైకి తీసుకొచ్చి పడేసి వెళ్లిపోయారు. స్థానికులు వెం టనే ప్రసాద్‌ని ఆటోలో చోడవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ప్రాణాలు పోయినట్టు సిబ్బంది ధ్రువీకరించారు. ఎస్సై మల్లేశ్వరరావు ఆస్పత్రి వద్దకు వచ్చి పరిశీలించారు. ప్రసాద్ మరణవార్త విన్న తల్లి ఈశ్వరమ్మ, చెల్లి విద్య ఆస్పత్రి వద్దకు వచ్చి కన్నీరుమున్నీరయ్యారు. దుర్గాప్రసాద్ సొంత గ్రామం వడ్డాది. తండ్రి మృతి చెందిన తరువాత పదే ళ్ల క్రితం గాంధీ గ్రామం వచ్చేశారు. ప్రసాద్ జీపు డ్రైవర్‌గా పనిచేసేవాడు. ఇటీవల ఒక కాంట్రాక్టర్ వద్ద పనికి కుదిరాడు. తల్లడిల్లిన తల్లి హృదయం : దుర్గాప్రసాద్ తండ్రి చనిపోయిన తరువాత తల్లి ఈశ్వర మ్మ తన కుమార్తెను, కుమారుడిని తీసుకొని గాంధీ గ్రామం వచ్చేసింది. చుట్టుపక్కల ఇళ్లలో పనిచేస్తూ పిల్లలను చదివిం చింది. దుర్గాప్రసాద్ పదో తరగతి చదివిన తరువాత చదువు మానేసి తల్లికి చేదోడుగా ఉంటూ జీపు డ్రైవింగ్ నేర్చుకొని చెల్లికి ఇటీవలే వివాహం చేశాడు. తల్లి ఈశ్వరమ్మ ఒక ప్రయివేటు పాఠశాలలో ఆయాగా పనిచేస్తోంది. ప్రసాద్ ఒక కాంట్రాక్టరు వద్ద పనిచేస్తున్నాడు. కుటుంబాన్ని పోషిస్తూ అండగా ఉంటాడనుకున్న కొడుకు హఠాత్తుగా హత్య కు గురవడంతో తాను అనాథగా మిగిలిపోయానని తల్లి ఈశ్వరమ్మ రోదిస్తోంది. తొమ్మిదిమందిపై కేసు : తన కొడుకుపై తొమ్మిదిమంది దాడి చేసినట్టు దుర్గాప్రసాద్ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పుల్లేటి నరేంద్ర అలియాస్ కేటు, ప్రభాకర్ తదితరులపై కేసు నమోదు చేశారు. మిగతా నిందితులలో మైనర్లు కూడా ఉన్నారు. డీఎస్పీ వెంకటరమణ వచ్చి మృతదేహాన్ని పరిశీలించారు. -
క్రీడా మైదానం తనిఖీ
అనంతపురం సెంట్రల్ : కళ్యాణదుర్గంలో జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్మించిన క్రీడా ప్రాంగణాన్ని గురువారం విజిలెన్స్ ఎస్పీ అనిల్‌బాబు పరిశీలించారు. రాష్ట్ర వ్యాప్త విచారణలో భాగంగా ఈ క్రీడా మైదానాన్ని పరిశీలించినట్లు ఎస్పీ తెలిపారు. క్రీడా ప్రాంగణం, చుట్టూ గోడలను ఇంజనీర్ల సహాయంతో తనిఖీ చేశారు. గ్రౌండుకుS ఏ రకమైన గ్రావెల్‌ని వాడారు, భవనాల కట్టడంలో పునాది పటిష్టత, గోడల మందం తదితర వాటిని పరిశీలించారు. సదరు క్రీడా మైదానాన్ని జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో హౌసింగ్‌బోర్డు అధికారులు నిర్మించి క్రీడా సంస్థకు అప్పగించడం జరిగిందన్నారు. పైకా గ్రాంట్స్ ద్వారా జిల్లాలో నార్పల, పెనుకొండ, రామగిరి, కళ్యాణదుర్గం ప్రాంతాల్లో ఇలాంటి నిర్మాణాలు చేపట్టడం జరిగిందని తెలిపారు. వీటి నిర్మాణ ంలో నాణ్యతా ప్రమాణాల గురించి తనిఖీలు చేయడం జరిగిందన్నారు. -
స్టీల్ దొంగిలించిన ఇద్దరు యువకులకు రిమాండ్
క్రీడా మైదానంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం నిల్వ ఉంచిన స్టీల్‌ను దొంగలించిన ఇద్దరు యువకులను శాలిబండ పోలీసులు అరెస్ట్ చేసి గురువారం రిమాండ్‌కు తరలించారు. ఇన్స్పెక్టర్ లింగయ్య తెలిపిన వివరాల ప్రకారం.....పూలబండ క్రీడా మైదానంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం నిల్వ ఉంచిన మూడు టన్నుల స్టీల్‌ను మేకలబండ ప్రాంతానికి చెందిన కృష్ణ (27), రఘు(21)లు ఈ నెల 4వ తేదీన దొంగిలించారు. 8వ తేదీన కాంట్రాక్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను గురువారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద నుంచి రూ.లక్ష విలువజేసే స్టీల్‌ను స్వాధీనం చేసుకున్నారు. -
అక్కడ క్రికెట్ ఆడితే జన్మధన్యం!
మైదానం: విశాలమైన మైదానంలో చల్లటి గాలిని ఆస్వాదించడానికి మించిన ఆనందాన్ని దాదాపు ఇంక దేన్నుంచి కూడా పొందడం సాధ్యం కాదు. అలాంటి మైదానం ఒంటి స్తంభం మేడలా గాలిలో ఉంటే... ఆ ప్లేసులో మీరుంటే ఆ అనుభూతి ఎలా ఉంటుందో వర్ణనకు అందదు. చిత్రం ఏంటంటే... అది ప్రపంచంలో అతిఎత్తయిన క్రీడా మైదానం. అది మన దేశంలో! హిమాలయాల సానువుల్లో ఉన్న రాష్ర్టం హిమాచల్‌ప్రదేశ్. సైబీరియా శీతల గాలుల నుంచి భారతదేశానికి అడ్డుగోడలా నిలిచిన ఈ పర్వతాలు కేవలం రక్షణకే కాదు, ఎన్నో అందాలకు నిలయాలు. ఈ పర్వత శ్రేణుల సమీపంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాకు సమీపంలో ఉంది చెయిల్ క్రికెట్ స్టేడియం. జీవితంలో అక్కడ ఒక్కసారి క్రికెట్ ఆడితే క్రికెట్ అభిమానులకు అది ఎన్నటికీ మరవని అనుభూతి. సముద్ర మట్టానికి 2444 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ క్రికెట్ మైదానం ప్రపంచంలోనే అతిఎత్తులో ఉన్న మైదానంగా రికార్డులకు ఎక్కింది. ఇది సహజంగా ఏర్పడిన మైదానం ఏమీ కాదు.. నూటపదేళ్ల క్రితం అంటే 1893లో నిర్మించారు. మహరాజా పాటియాలా భూపీందర్ సింగ్ దీనిని నిర్మించారు. చెయిల్ ప్రాంతాన్ని తన వేసవి రాజధాని చేసుకుని పాలించే ఈ రాజు అక్కడ సాయంత్రాలు సరదాగా క్రీడలు ఆడుకోవడానికి ఈ మైదానం నిర్మించుకున్నారు. తన వారితో అతను ఇక్కడ ఫ్రెండ్లీ మ్యాచ్‌లు ఆడుకునేవాడట. మైదానంలో ఆడి రాజు అలసిపోయినపుడు సేద దీరడానికి అరుగుతో కూడిన ఒక మంచి చెట్టును పెంచారు. అదిప్పటికీ ఉంది. వందేళ్ల ఆ చెట్టులో ఒక ట్రీ హౌస్‌ను కూడా నిర్మించారు. ఇది ఏర్పాటుచేసిన ప్రదేశమే చాలా చిత్రంగా ఉంటుంది. ఒక ఎత్తయిన గుమ్మటంలా ఉన్న పర్వత ప్రాంతం మీద దీనిని నిర్మించారు. ఈ మైదానం అడవుల్లో ఒక దీవిలా ఉంటుంది. మైదానం చుట్టూ అటవీ ప్రాంతం ఉండటం వల్ల 365 రోజులు 24 గంటలు అక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. ఇది కేవలం ఒక మైదానమే కాదు.. ఆయన ఇక్కడ అవసరమైన సదుపాయాలన్నీ ఏర్పాటుచేసుకున్నారు. అత్యద్భుతమైన శిల్పకళకు చిరునామాగా నిలిచే చెయిల్ ప్యాలెస్ ఇప్పటికీ చెక్కుచెదరలేదు. ఇది ఒక అద్భుతమైన పర్యాటక ప్రదేశంగా వెలుగొందుతూ విశేషంగా పర్యాటకులను ఆకర్షిస్తోంది. స్వాతంత్య్రానంతరం రాజరికం అంతరించాక ఈ మైదానం అక్కడి మిలట్రీ స్కూలుకు ఇచ్చేశారు. అయితే, ఇంత అద్భుతమైన ప్రాంతం మిలిట్రీ స్కూలు ఆధీనంలో ఉండటం వల్ల దీనిని సందర్శించుకునే అవకాశాన్ని పర్యాటకులు మిస్సవుతున్నారు. ఈ అసంతృప్తిని రాష్ర్ట ప్రభుత్వం గుర్తించింది. ఎంతో విశేషమైన ఈ మైదానాన్ని, ప్రపంచంలో ఎత్తయినదిగా విశిష్టత సంపాదించుకున్న దీనిని ఇలా స్కూలుకు పరిమితం చేస్తే ఏం బాగుంటుందన్న వాదనతో ఏకీభవించిన ప్రభుత్వం దీనిని అభివృద్ధి చేసి ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు జరిగేలా చూడాలని భావిస్తోంది. చెయిల్ హెరిటేజ్ ఫౌండేషన్ మద్దతుతో ఈ చర్యలు రెండేళ్ల క్రితమే మొదలయ్యాయి. అతి త్వరలో ఇక్కడ ప్రతి ఒక్కరూ సరదాగా ఒక్కసారైనా క్రికెట్ ఆడే అవకాశం రావచ్చు. కొన్ని కారణాల వల్ల పెద్ద మ్యాచ్‌లు ఆడే అవకాశం ఇక్కడ లేకపోయినా కొన్ని ఫ్రెండ్లీ మ్యాచ్‌లు ఆడే అవకాశం కల్పించడానికి కేంద్ర-రాష్ర్ట ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే ఇంటర్‌స్కూల్, ఇంటర్‌కాలేజీ, ఇంటర్ డిస్ట్రిక్ట్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ఈ ఏడాది చివరకు పర్యాటకులు కూడా సరదాగా క్రికెట్ ఆడే అవకాశం రానుంది. గుడ్ న్యూస్ కదా! -
అత్యుత్తమ క్రీడా మైదానంగా కేఆర్ స్టేడియం
శ్రీకాకుళం అర్బన్: శ్రీకాకుళంలోని కోడి రామ్మూర్తి స్టేడియాన్ని అత్యుత్తమ క్రీడా మైదానంగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర కార్మిక, ఉపాధి, క్రీడలు, యువజన సర్వీసుల శాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చెప్పారు. రాష్ట్ర మంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టాక తొలిసారిగా శుక్రవారం జిల్లాకు విచ్చేసిన ఆయన, ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు క్యాంపు కార్యాలయం వద్ద నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. కేఆర్ స్టేడియం ప్రస్తుతం అధ్వాన స్థితిలో ఉందని, దీనిపై సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి తగిన చర్యలు చేపడతామన్నారు. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి కృషి చేస్తామన్నారు. యువత కోసం నైపుణ్యాల మెరుగు కార్యక్రమాలను గ్రామస్థాయిలో ఏర్పాటు చేస్తామన్నారు. పరిశ్రమల్లో యాజమాన్యం, కార్మిక సంఘాల మధ్య సత్సంబంధాలు నెలకొనేలా కృషి చేస్తామని చెప్పారు. దీనివల్ల పరిశ్రమలు ప్రగతి బాటలో నడుస్తాయన్నా రు. పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లా అధికార యంత్రాంగం సమర్ధంగా పనిచేసేలా చూసి ప్రజలకు చక్కని సేవలు అం దేలా చర్యలు చేపడతామన్నారు. సరిగా పని చేయని అధికారులపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తామన్నారు. రానున్న ఆరేడు నెలల్లో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలనలో మార్పు వస్తుందన్నారు. అవినీతిని అంతమొందించి ప్రజలకు మేలు కలిగేలా కృషి చేస్తామన్నారు. జిల్లా అభివృద్ధిపై ఈ నెల 15న అధికారులతో సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. ఎంపీ రామ్మోహన్నాయుడు మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తామన్నారు. తొలుత జాతీయ రహదారిపై ఉన్న సింహద్వారం వద్ద అచ్చెన్నాయుడుకు పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి. అక్కడ ఉన్న దివంగత ఎర్రన్నాయుడు విగ్రహానికి, డే అండ్ నైట్ కూడలి వద్ద ఉన్న ఆచార్య ఎన్జీ రంగా, సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహాలకు, అంబేద్కర్ కూడలిలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి అచ్చెన్నాయుడు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో శ్రీకాకుళం, ఆమదాలవలస, ఇచ్ఛాపురం, నరసన్నపేట ఎమ్మెల్యేలు గుండ లక్ష్మీదేవి, కూన రవికుమార్, బెందాళం అశోక్, బగ్గు రమణమూర్తి, మాజీ స్పీకర్ కె.ప్రతిభాభారతి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు చౌదరి బాబ్జి, పార్టీ నాయకులు జామి భీమశంకర్, బోయిన గోవిందరాజులు, కొర్ను నాగార్జున ప్రతాప్, పి.వి.రమణ, గుమ్మా నాగరాజు, పాలిశెట్టి మల్లిబాబు, డీవీఎస్ ప్రకాష్, అంబటి లక్ష్మీరాజ్యం, మాదారపు వెంకటేష్, ఎస్.వి.రమణ మాదిగ, ముద్దాడ కృష్ణమూర్తినాయుడు తదితరులు పాల్గొన్నారు.