క్రికెట్‌ గ్రౌండ్స్‌.. ఫర్‌ రెంట్‌!.. అద్దె కట్టు.. బ్యాట్‌ పట్టు.. | Sports grounds for rent on the outskirts of city: Telangana | Sakshi
Sakshi News home page

క్రికెట్‌ గ్రౌండ్స్‌.. ఫర్‌ రెంట్‌!.. అద్దె కట్టు.. బ్యాట్‌ పట్టు..

Published Mon, Jul 8 2024 5:56 AM | Last Updated on Mon, Jul 8 2024 5:56 AM

Sports grounds for rent on the outskirts of city: Telangana

నగర శివార్లలోఅద్దెకు క్రీడా మైదానాలు

పొలాలు, భూములను గ్రౌండ్‌లుగా మారుస్తున్న యజమానులు

మ్యాచ్‌కు, రోజుకు ఇంత అంటూ చార్జీ వసూలు

అటు క్రీడాకారులకు వెసులుబాటు.. ఇటు ఓనర్లకు ఆదాయం

 మ్యాచ్‌కు రూ.5 వేల నుంచిరూ.10 వేల వరకు వసూలు

 క్రికెట్‌ హబ్‌గా మొయినాబాద్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం,శంకర్‌పల్లి మండలాలు

ఫుట్‌బాల్, వాలీబాల్‌ వంటి ఇతర క్రీడా పోటీల నిర్వహణకూ వినియోగం

మన దగ్గర క్రికెట్‌ అంటే ఉండే క్రేజే వేరు. చిన్నప్పుడు గల్లీల్లో క్రికెట్‌ ఆడినా.. కాస్త పట్టు చిక్కినవారు, దానిపై మక్కువ ఉన్నవారు, ప్రొఫెషనల్‌గా తీసుకునేవారు మాత్రం విశాలమైన గ్రౌండ్‌ల కోసం వెతుకుతుంటారు. ఈ క్రమంలోనే నగర శివార్లలో అద్దె మైదానాలు వెలిశాయి. ఔటర్‌ రింగ్‌రోడ్డుకు అటూ ఇటూ భూములున్నవారు ఖాళీగా ఉన్న తమ భూములను క్రికెట్‌ మైదానాలుగా మార్చేసి అద్దెకు ఇస్తున్నారు. మ్యాచ్‌కు ఇంత అని లేకుంటే రోజుకు ఇంత అని వసూలు చేస్తున్నారు. అటు క్రీడాకారుల అవసరాన్ని తీర్చుతూనే, ఇటు ఆదాయాన్ని కూడా పొందుతున్నారు. ఇలా నగరంలో, శివార్లలో వందలకొద్దీ గ్రౌండ్లు ఏర్పాటయ్యాయి. అందులో ఒక్క మొయినాబాద్‌ మండలం పరిధిలోనే 60కిపైగా మైదానాలు ఉండటం గమనార్హం.

రోజురోజుకూ విస్తరిస్తున్న విశ్వనగరం హైదరాబాద్‌లో క్రికెట్‌ అంటే మోజు ఎక్కువ. ఆ ఆటను చూసేవారే కాదు.. ఆడేవారి సంఖ్య కూడా బాగా పెరిగిపోతోంది. సిటీలో గచ్చిబౌలి, ఉస్మానియా యూనివర్సిటీ, యూసఫ్‌గూడ, ఎల్బీ స్టేడియం, సరూర్‌నగర్‌లలో స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లు ఉన్నా.. అవి క్రీడాకారుల అవసరాలకు సరిపోవడం లేదు. మరోవైపు క్రీడాకారుల్లోని ప్రతిభను గుర్తించి, వెలికి తీసేందుకు వివిధ సంఘాలు, అసోసియేషన్లు ఏదో ఒక పేరుతో తరచూ క్రీడాపోటీలు నిర్వహిస్తున్నాయి.

దీంతో గ్రౌండ్ల కోసం డిమాండ్‌ మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో అటు క్రీడాకారులకు అందుబాటులో ఉండేలా, తామూ కొంత ఆదాయం పొందేలా.. నగర శివార్లలో భూములున్నవారు తమ భూములను క్రీడా మైదానాలు మారుస్తున్నారు. భూములను చదును చేసి, చుట్లూ ఎత్తయిన ప్రహరీలు లేదా ఇనుప కంచెలు ఏర్పాటు చేస్తున్నారు. చుట్టూ చెట్లను, మైదానమంతా పచ్చనిగడ్డిని పెంచుతున్నారు. ఇతర మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్క క్రికెట్‌ అనేగాకుండా వాలీబాల్, ఫుట్‌బాల్, టెన్నిస్‌ వంటి ఇతర పోటీలకు కూడా ఈ గ్రౌండ్లను అద్దెకు ఇస్తున్నారు.

శివార్లలో సాగు చేయలేక..
సిటీ శివారు ప్రాంతాల్లో భూగర్భ జలాలు తక్కువగా ఉండటం, వానలు సరిగా పడకపోవడం వంటి పరిస్థితుల్లో రైతులు పంటలు సాగు చేయడం లేదు. ఈ ప్రాంతాల్లో కూలీలు దొరకడం కూడా కష్టంగా మారింది. సాగు చేసినా.. ఖర్చులు రెట్టింపు అవుతున్న పరిస్థితి. దీనితో ఖాళీగా ఉన్న పొలాలను మైదానాలుగా మారుస్తున్నారు. ఒకేచోట నాలుగైదు ఎకరాల భూమి ఉన్నవారు ఓపెన్‌ స్టేడియాలుగా మారుస్తుండగా.. అర ఎకరం, ఎకరం భూమి ఉన్న వారు నెట్‌ స్టేడియాలు ఏర్పాటు చేస్తున్నారు. 

వాటిని క్రీడా మైదానాల నిర్వాహకులకు లీజుకు ఇస్తున్నారు. ముఖ్యంగా నగరానికి చేరువలో ఉన్న మొయినాబాద్‌ మండలం క్రీడా హబ్‌గా మారుతోంది. ఈ ఒక్క మండలంలోనే సుమారు 65 క్రికెట్‌ గ్రౌండ్లు ఉన్నాయి. ఇబ్రహీంపట్నం మండలంలో ఆరు, శంషాబాద్‌ మండలంలో ఐదు, హయత్‌నగర్‌ మండలంలో మూడు మైదానాలు ఏర్పాటయ్యాయి.

ఉద్యోగ, వ్యాపార వర్గాలూ..
రాజకీయ, సినీ ప్రముఖులు, వ్యాపారులు, ఉద్యోగులు.. సిటీ శివార్లలో భారీగా భూములు కొనుగోలు చేశారు. వారిలో కొందరు గేటెడ్‌ కమ్యూనిటీలు, విల్లాలు ఏర్పాటు చేస్తే.. మరికొందరు భూములను ఖాళీగా ఉంచడం ఇష్టం లేక క్రీడా మైదానాలుగా మారుస్తున్నారు. కొనుగోలు చేసిన భూములకు రక్షణగా ఉండటంతోపాటు అద్దె ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నారు. కొన్ని ఇంజనీరింగ్‌ కాలేజీల యాజమాన్యాలు కూడా విద్యార్థులను ఆకర్షించేందుకు క్రీడా మైదానాలు ఏర్పాటు చేస్తున్నాయి. వారాంతాల్లో వాటిని అద్దెకు కూడా ఇస్తున్నాయి.

ఏర్పాట్లను బట్టి అద్దెలు..
ఈ గ్రౌండ్లలో వీక్షకులు కూర్చునేందుకు వీలుగా కుర్చీలు, మరుగుదొడ్లు, విద్యుత్, సౌండ్‌ వ్యవస్థలు, భారీ స్క్రీన్లు, ఎల్‌ఈడీ లైట్లు, ఇతర మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ సదుపాయాలను బట్టి, డిమాండ్‌ను బట్టి అద్దెలు వసూలు చేస్తున్నారు. గ్రౌండ్ల బుకింగ్‌ కోసం కొందరు నిర్వాహకులు ఆన్‌లైన్‌ బుకింగ్‌ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చారు. పెద్ద గ్రౌండ్లు అయితే ఒక్కో మ్యాచ్‌కు రూ.5000 నుంచి రూ.10 వేల వరకు  చార్జీ చేస్తున్నారు. నెట్, ఫెన్సింగ్‌తో ఉండే చిన్న గ్రౌండ్లకు గంటకు రూ.500 నుంచి రూ.1000 వరకు చార్జీ చేస్తున్నారు. శని, ఆదివారాలు, ఇతర సెలవు రోజుల్లో కాస్త ఎక్కువగా వసూలు చేస్తున్నారు.

క్రికెట్‌పై ఇష్టంతో
చిన్నప్పటి నుంచీ క్రికెట్‌ అంటే ఎంతో ఇష్టం. అందుకే క్రికెట్‌ ఆడేందుకు ఎంత దూరమైనా వెళ్తుంటా. హైదరాబాద్‌ నగరంలో క్రికెట్‌ మైదానాలు అందుబాటులో లేవు. ఎక్కడైనా పార్కుల్లో ఉన్నా క్రికెట్‌ ఆడేందుకు ఇబ్బందిగా ఉంటుంది. దాంతో ప్రతిరోజు క్రికెట్‌ ఆడేందుకు సిటీ బయటి ప్రాంతాలకు వెళ్తున్నాను. క్రీడాకారులందరం డబ్బులు పోగేసుకుని మైదానాన్ని అద్దెకు తీసుకుంటాం. - సయ్యద్‌ అర్షద్, క్రీడాకారుడు

ఆన్‌లైన్‌ ద్వారా అద్దెకు..
క్రీడాకారులకు అందుబాటులో ఉండేలా క్రికెట్‌ మైదానాలు ఏర్పాటు చేశాం. ఎవరైనా ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకోవచ్చు. చాలా వరకు క్రీడాకారులు ట్వంటీ ట్వంటీ మ్యాచ్‌లు ఆడుతుంటారు. సాధారణ రోజుల్లో మ్యాచ్‌కు రూ.2 వేల నుంచి రూ.4 వేలు.. శని, ఆదివారాల్లో అయితే మ్యాచ్‌కు రూ.5 వేల నుంచి రూ.7 వేల వరకు అద్దె వసూలు చేస్తాం. గ్రౌండ్‌ నిర్వహణకే చాలా వరకు ఖర్చవుతుంది. మౌలిక సదుపాయాలు, డిమాండ్‌ను బట్టి చార్జీలలో మార్పులు ఉంటాయి.– రాజేందర్‌రెడ్డి, క్రికెట్‌ మైదానం నిర్వాహకుడు, మొయినాబాద్‌

క్రికెట్‌ గ్రౌండ్‌లు ఉన్నగ్రామాల వివరాలివీ..

గ్రామం    గ్రౌండ్లు
బాకారం    15
అజీజ్‌నగర్‌    12
ఎనికేపల్లి    12
చిలుకూరు    6
నజీబ్‌నగర్‌    4
అమ్డాపూర్‌    3
నాగిరెడ్డిగూడ    3
హిమాయత్‌నగర్‌    3
కనకమామిడి    3
రెడ్డిపల్లి    3
తుర్కయాంజాల్‌    2
కొంగరకలాన్‌    2
మోత్కుపల్లి    1
శ్రీరాంనగర్‌    1
బొంగుళూరు    1
ఇబ్రహీంపట్నం    1
నాదర్‌గుల్‌    1 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement