అందనంత అద్దెలు | Increased rents with reopening of educational institutions | Sakshi
Sakshi News home page

అందనంత అద్దెలు

Jun 21 2024 5:41 AM | Updated on Jun 21 2024 5:41 AM

Increased rents with reopening of educational institutions

విద్యా సంస్థల పునఃప్రారంభంతో పెరిగిన కిరాయిలు

ఏడాదిలో 20–25 శాతం పెరిగిన గృహాల రెంట్లు

ఆఫీసులకు చేరువలోని ఐటీ ప్రాంతాల్లో డిమాండ్‌

ఆధునిక వసతులుండే అపార్ట్‌మెంట్లలో అద్దెలకు గిరాకీ.. 3–4 నెలల అడ్వాన్స్, మెయింటెనెన్స్‌లతో అద్దెదారులపై భారం

సాక్షి, హైదరాబాద్‌: ‘‘ఇందుమతి మాదాపూర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో అద్దెకుంటోంది. 2 బీహెచ్‌కే ఫ్లాట్‌కు రూ.15 వేలతో మొదలై.. ఏటా 10 శాతం పెరుగుదలతో గత ఐదేళ్లలో కిరాయి రూ.22,500కు చేరింది. మెయింటెనెన్స్‌ చార్జీలు అదనం. అయితే ఇటీవలే ఇంటి యజమాని ఆమెకు ఫోన్‌ చేసి ఈ నెల నుంచి రూ.5 వేలు రెంట్‌ అదనంగా పెంచుతున్నట్లు చెప్పాడు. ఇష్టముంటే ఉండండి.. లేకపోతే ఖాళీ చేయండంటూ హుకుం జారీ చేశాడు. ఇప్పటికప్పుడు వేరే ఇల్లు వెతుక్కోవడం, షిఫ్టింగ్‌ అంటే వ్యయ ప్రయాసలతో కూడుకున్న పని. వీటికి తోడు స్థానికంగా ఓ ప్రముఖ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో చదువుతున్న తన పిల్లల చదువుకు ఆటంకం కలుగుతుంది. దీంతో చేసేదేం లేక అదనపు అద్దెకు అయిష్టంగానే ఒప్పుకుంది.’’

ఇది ఇందుమతి ఒక్కరికే కాదు నగరంలోని చాలా మంది పరిస్థితి ఇదే. విద్యా సంస్థలు, కార్యాలయాలు పునఃప్రారంభం కావడంతో నగరంలో అద్దెలకు డిమాండ్‌ బాగా పెరిగింది. ఒక ప్రాంతానికో లేదా కాలనీకో ఇది పరిమితం కాలేదు. కాస్త పేరున్న ప్రతి ప్రాంతంలోనూ ఇదే పరిస్థితి ఉంది.

స్కూళ్లు, ఆఫీసులున్న చోట హాట్‌కేక్‌లు..
పేరున్న విద్యాసంస్థలు, ఆసుపత్రులకు చేరువలో ఉన్న ప్రాంతాల్లో గృహాలకు డిమాండ్‌ విపరీతంగా ఉంది. కరోనా సమయంలో ఐటీ ఉద్యోగులకు వర్క్‌ ఫ్రం హోమ్‌ ఉండటంతో చాలా మంది సొంతూర్లకు వెళ్లిపోయారు. దీంతో నగరంలో చాలా వరకు టులెట్‌ బోర్డులు కనిపించేవి కానీ, కరోనా ప్రభావం నుంచి పూర్తిగా కోలుకున్న కంపెనీలు ఉద్యోగులను తిరిగి ఆఫీసులకు రప్పించాయి. దీంతో ఆఫీసులకు చేరువలో ఉన్న ప్రాంతాలలో అపార్ట్‌మెంట్లు, గేటెడ్‌ కమ్యూనిటీలు, ఇండిపెండెంట్‌ హౌస్‌లలో కిరాయిలు హాట్‌కేక్‌లా మారాయి.

అమీర్‌పేట, ఎస్‌ఆర్‌ నగర్, మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, మణికొండ, కూకట్‌పల్లి, ఉప్పల్, ఎల్బీనగర్, కొంపల్లి వంటి ప్రాంతాల్లో అద్దెలు గణనీయంగా పెరిగాయి. కరోనా తర్వాత ఇంటి అద్దెలు కొన్ని చోట్ల రెట్టింపయ్యాయి. గచ్చిబౌలి, కొండాపూర్, మియాపూర్, కూకట్‌పల్లి వంటి ప్రాంతాల్లో అద్దెలు ఆరు నెలల కాలంలో 15 శాతానికి పైగానే పెరిగాయి. బేగంపేట, ప్రకాశ్‌ నగర్, సోమాజిగూడ, పంజగుట్ట, బోయిన్‌పల్లి, మారేడుపల్లి, అల్వాల్‌ ప్రాంతాల్లో 20–25 శాతం అద్దెలు పెరిగాయి.

నడ్డివిరుస్తున్న అద్దెలు..
హైదరాబాద్‌లో ఇంటి అద్దెలు కిరాయిదారుల నడ్డి విరుస్తున్నాయి. తమ జీతాలు తప్ప అన్నీ పెరుగుతున్నాయంటూ నిట్టూర్చే సగటు జీవి.. పెరిగిన ఈ అద్దెలను భరించలేక నగర శివార్లకు తరలి వెళ్తుండటంతో అక్కడ కూడా అద్దెలు భారీగానే పెరుగుతున్నాయి. అనరాక్‌ సంస్థ ఇటీవల విడుదల చేసిన ఓ అధ్యయనం ప్రకారం హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో అద్దెలు గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం తొలి మూడు నెలల కాలంలోనే 10–15 శాతం పైగానే పెరిగాయి. గతంలో రూ.10–15 వేలకు నగరం నడి మధ్యలో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఫ్లాట్‌లు అద్దెకు లభించేవి. కానీ, ఇప్పుడు రూ.20–25 వేలకు పైగా ఖర్చు చేస్తే కానీ దొరకని పరిస్థితి.

అడ్వాన్స్‌లు, మెయింటెనెన్స్‌ల భారం కూడా..
ఇంటిని అద్దెకు ఇవ్వాలంటే 3–4 నెలలు అడ్వాన్స్‌ను ఇంటి యజమానులు వసూలు చేస్తున్నారు. పైగా ఫ్లాట్‌ అద్దెతో పాటు ప్రతి నెలా మెయింటెనెన్స్‌ వ్యయం కూడా అద్దెదారుల పైనే పడుతుంది. 2 బీహెచ్‌కే అపార్ట్‌మెంట్‌ అద్దె రూ.25 వేలు ఉండగా.. నిర్వహణ ఖర్చు రూ.2 నుంచి రూ.5 వేలు చెల్లించాల్సి ఉంటుంది.

అద్దె చట్టం ఏం చెబుతోందంటే..
అద్దెదారుడు, యజమాని మధ్య నిబంధనలు.. షరతులతో కూడిన రెంటల్‌ అగ్రిమెంట్‌ రాసుకోవాలి. దీన్ని సంబంధిత జిల్లా రెంట్‌ అథారిటీకి సమర్పించాలి.

ఓనర్‌ నాన్‌ కమర్షియల్‌ బిల్డింగ్‌ లేదా ఇళ్లకు సంవత్సరానికి 8 నుంచి 10 శాతానికి మించి అద్దె పెంచకూడదు. అది కూడా 3 నెలల ముందే కిరాయిదారునికి నోటీసు అందించాలి.

కిరాయిదారులు, యజమానుల వివాదాలను పరిష్కరించడానికి ప్రతి జిల్లాలో ప్రత్యేక అద్దె అధికారులు, కోర్టు, ట్రిబ్యు నల్‌లను ఏర్పాటు చేయాలి.

అద్దెదారుడు ప్రాపర్టీకి సంబంధించి నకిలీ పత్రాలను సృష్టించి బ్యాంకులో తనఖా పెట్టడం, రుణాలు తీసుకోవడం వంటి అక్రమాలకు పాల్పడకూడదు.

ఒకవేళ అద్దెదారుడు ఇంటిని ఖాళీ చేయాలని భావిస్తే యజమానికి మూడు నెలల ముందు తెలపాలి.

కిరాయిదారుడు ఇంటి లోపల విద్యుత్‌ వైర్లు, బోరు, నల్లా, టైల్స్, బాత్‌రూమ్, శాని టేషన్‌ వంటి వాటికి నష్టం కలిగించకూడదు. రిపేర్లకు సంబంధించి అయ్యే ఖర్చును యజమానే భరించాలి.

కరోనా తర్వాత నుంచి..
కరోనా కాలంలో నివాస అద్దెలు దీర్ఘకాలం పాటు నిలిచిపోయాయి. ఆఫీసుల పునఃప్రారంభం తర్వాత నుంచి అద్దెలకు డిమాండ్‌ పెరిగింది. హైదరాబాద్,బెంగళూరు, పుణే, ముంబై వంటి ప్రధాన నగరాల్లో కిరాయిలు గణనీయంగా పెరుగుతున్నాయి. కేంద్రం, రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వాలు తీసుకునే విధానపరమైన నిర్ణయాలతో రానున్న రోజుల్లో నగరాలు అభివృద్ధి చెందడం ఖాయం. దీంతో సమీప భవిష్యత్తులో నివాసాలకు మరింత డిమాండ్‌ ఏర్పడుతుంది. – అనూజ్‌ పూరీ,చైర్మన్, అనరాక్‌ గ్రూప్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement