అక్కడ క్రికెట్ ఆడితే జన్మధన్యం!
మైదానం: విశాలమైన మైదానంలో చల్లటి గాలిని ఆస్వాదించడానికి మించిన ఆనందాన్ని దాదాపు ఇంక దేన్నుంచి కూడా పొందడం సాధ్యం కాదు. అలాంటి మైదానం ఒంటి స్తంభం మేడలా గాలిలో ఉంటే... ఆ ప్లేసులో మీరుంటే ఆ అనుభూతి ఎలా ఉంటుందో వర్ణనకు అందదు. చిత్రం ఏంటంటే... అది ప్రపంచంలో అతిఎత్తయిన క్రీడా మైదానం. అది మన దేశంలో!
హిమాలయాల సానువుల్లో ఉన్న రాష్ర్టం హిమాచల్‌ప్రదేశ్. సైబీరియా శీతల గాలుల నుంచి భారతదేశానికి అడ్డుగోడలా నిలిచిన ఈ పర్వతాలు కేవలం రక్షణకే కాదు, ఎన్నో అందాలకు నిలయాలు. ఈ పర్వత శ్రేణుల సమీపంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాకు సమీపంలో ఉంది చెయిల్ క్రికెట్ స్టేడియం. జీవితంలో అక్కడ ఒక్కసారి క్రికెట్ ఆడితే క్రికెట్ అభిమానులకు అది ఎన్నటికీ మరవని అనుభూతి. సముద్ర మట్టానికి 2444 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ క్రికెట్ మైదానం ప్రపంచంలోనే అతిఎత్తులో ఉన్న మైదానంగా రికార్డులకు ఎక్కింది.
ఇది సహజంగా ఏర్పడిన మైదానం ఏమీ కాదు.. నూటపదేళ్ల క్రితం అంటే 1893లో నిర్మించారు. మహరాజా పాటియాలా భూపీందర్ సింగ్ దీనిని నిర్మించారు. చెయిల్ ప్రాంతాన్ని తన వేసవి రాజధాని చేసుకుని పాలించే ఈ రాజు అక్కడ సాయంత్రాలు సరదాగా క్రీడలు ఆడుకోవడానికి ఈ మైదానం నిర్మించుకున్నారు. తన వారితో అతను ఇక్కడ ఫ్రెండ్లీ మ్యాచ్‌లు ఆడుకునేవాడట. మైదానంలో ఆడి రాజు అలసిపోయినపుడు సేద దీరడానికి అరుగుతో కూడిన ఒక మంచి చెట్టును పెంచారు. అదిప్పటికీ ఉంది. వందేళ్ల ఆ చెట్టులో ఒక ట్రీ హౌస్‌ను కూడా నిర్మించారు.
ఇది ఏర్పాటుచేసిన ప్రదేశమే చాలా చిత్రంగా ఉంటుంది. ఒక ఎత్తయిన గుమ్మటంలా ఉన్న పర్వత ప్రాంతం మీద దీనిని నిర్మించారు. ఈ మైదానం అడవుల్లో ఒక దీవిలా ఉంటుంది. మైదానం చుట్టూ అటవీ ప్రాంతం ఉండటం వల్ల 365 రోజులు 24 గంటలు అక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. ఇది కేవలం ఒక మైదానమే కాదు.. ఆయన ఇక్కడ అవసరమైన సదుపాయాలన్నీ ఏర్పాటుచేసుకున్నారు. అత్యద్భుతమైన శిల్పకళకు చిరునామాగా నిలిచే చెయిల్ ప్యాలెస్ ఇప్పటికీ చెక్కుచెదరలేదు. ఇది ఒక అద్భుతమైన పర్యాటక ప్రదేశంగా వెలుగొందుతూ విశేషంగా పర్యాటకులను ఆకర్షిస్తోంది. స్వాతంత్య్రానంతరం రాజరికం అంతరించాక ఈ మైదానం అక్కడి మిలట్రీ స్కూలుకు ఇచ్చేశారు. అయితే, ఇంత అద్భుతమైన ప్రాంతం మిలిట్రీ స్కూలు ఆధీనంలో ఉండటం వల్ల దీనిని సందర్శించుకునే అవకాశాన్ని పర్యాటకులు మిస్సవుతున్నారు.
ఈ అసంతృప్తిని రాష్ర్ట ప్రభుత్వం గుర్తించింది. ఎంతో విశేషమైన ఈ మైదానాన్ని, ప్రపంచంలో ఎత్తయినదిగా విశిష్టత సంపాదించుకున్న దీనిని ఇలా స్కూలుకు పరిమితం చేస్తే ఏం బాగుంటుందన్న వాదనతో ఏకీభవించిన ప్రభుత్వం దీనిని అభివృద్ధి చేసి ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు జరిగేలా చూడాలని భావిస్తోంది. చెయిల్ హెరిటేజ్ ఫౌండేషన్ మద్దతుతో ఈ చర్యలు రెండేళ్ల క్రితమే మొదలయ్యాయి. అతి త్వరలో ఇక్కడ ప్రతి ఒక్కరూ సరదాగా ఒక్కసారైనా క్రికెట్ ఆడే అవకాశం రావచ్చు.
కొన్ని కారణాల వల్ల పెద్ద మ్యాచ్‌లు ఆడే అవకాశం ఇక్కడ లేకపోయినా కొన్ని ఫ్రెండ్లీ మ్యాచ్‌లు ఆడే అవకాశం కల్పించడానికి కేంద్ర-రాష్ర్ట ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే ఇంటర్‌స్కూల్, ఇంటర్‌కాలేజీ, ఇంటర్ డిస్ట్రిక్ట్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ఈ ఏడాది చివరకు పర్యాటకులు కూడా సరదాగా క్రికెట్ ఆడే అవకాశం రానుంది. గుడ్ న్యూస్ కదా!