శ్రీకాకుళం అర్బన్: శ్రీకాకుళంలోని కోడి రామ్మూర్తి స్టేడియాన్ని అత్యుత్తమ క్రీడా మైదానంగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర కార్మిక, ఉపాధి, క్రీడలు, యువజన సర్వీసుల శాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చెప్పారు. రాష్ట్ర మంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టాక తొలిసారిగా శుక్రవారం జిల్లాకు విచ్చేసిన ఆయన, ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు క్యాంపు కార్యాలయం వద్ద నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. కేఆర్ స్టేడియం ప్రస్తుతం అధ్వాన స్థితిలో ఉందని, దీనిపై సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి తగిన చర్యలు చేపడతామన్నారు. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి కృషి చేస్తామన్నారు. యువత కోసం నైపుణ్యాల మెరుగు కార్యక్రమాలను గ్రామస్థాయిలో ఏర్పాటు చేస్తామన్నారు. పరిశ్రమల్లో యాజమాన్యం, కార్మిక సంఘాల మధ్య సత్సంబంధాలు నెలకొనేలా కృషి చేస్తామని చెప్పారు.
దీనివల్ల పరిశ్రమలు ప్రగతి బాటలో నడుస్తాయన్నా రు. పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లా అధికార యంత్రాంగం సమర్ధంగా పనిచేసేలా చూసి ప్రజలకు చక్కని సేవలు అం దేలా చర్యలు చేపడతామన్నారు. సరిగా పని చేయని అధికారులపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తామన్నారు. రానున్న ఆరేడు నెలల్లో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలనలో మార్పు వస్తుందన్నారు. అవినీతిని అంతమొందించి ప్రజలకు మేలు కలిగేలా కృషి చేస్తామన్నారు. జిల్లా అభివృద్ధిపై ఈ నెల 15న అధికారులతో సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. ఎంపీ రామ్మోహన్‌నాయుడు మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తామన్నారు.
తొలుత జాతీయ రహదారిపై ఉన్న సింహద్వారం వద్ద అచ్చెన్నాయుడుకు పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి. అక్కడ ఉన్న దివంగత ఎర్రన్నాయుడు విగ్రహానికి, డే అండ్ నైట్ కూడలి వద్ద ఉన్న ఆచార్య ఎన్‌జీ రంగా, సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహాలకు, అంబేద్కర్ కూడలిలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి అచ్చెన్నాయుడు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో శ్రీకాకుళం, ఆమదాలవలస, ఇచ్ఛాపురం, నరసన్నపేట ఎమ్మెల్యేలు గుండ లక్ష్మీదేవి, కూన రవికుమార్, బెందాళం అశోక్, బగ్గు రమణమూర్తి, మాజీ స్పీకర్ కె.ప్రతిభాభారతి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు చౌదరి బాబ్జి, పార్టీ నాయకులు జామి భీమశంకర్, బోయిన గోవిందరాజులు, కొర్ను నాగార్జున ప్రతాప్, పి.వి.రమణ, గుమ్మా నాగరాజు, పాలిశెట్టి మల్లిబాబు, డీవీఎస్ ప్రకాష్, అంబటి లక్ష్మీరాజ్యం, మాదారపు వెంకటేష్, ఎస్.వి.రమణ మాదిగ, ముద్దాడ కృష్ణమూర్తినాయుడు తదితరులు పాల్గొన్నారు.
అత్యుత్తమ క్రీడా మైదానంగా కేఆర్ స్టేడియం
Published Sat, Jun 14 2014 3:14 AM | Last Updated on Sat, Sep 2 2017 8:45 AM
Advertisement
Advertisement