శిరస్త్రాణం.. శిరోధార్యం!
♦ జులై 1 నుంచి హెల్మెట్ తప్పనిసరి
♦ హెల్మెట్ లేకపోవడంతో ప్రాణాలు కోల్పోయిన సంఘటనలెన్నో..
శిరస్త్రాణం నిబంధన అమలుకు ఇంకా పది రోజులు మాత్రమే గడువు మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో వాహనదారుల్లో ఈ నిబంధనపై ఉన్న అవగాహన ఎంత.. అసలు ఎంతమంది స్వచ్ఛందంగా శిరస్త్రాణం ధరిస్తున్నారు అని ఆరా తీస్తే ప్రతి వంద మందిలో కేవలం ఐదుమంది మాత్రమే హెల్మెట్ ధరిస్తున్నారని స్పష్టమవుతోంది. ప్రమాదాలు జరిగిన సమయంలో హెల్మెట్ ప్రాణాలు నిలుపుతుందని తెలిసినా చాలా మంది హెల్మెట్ ధరించేందుకు ఆసక్తి కనబర్చడం లేదు.
కడప అర్బన్ : మనిషి దైనందిన జీవితంలో రోజురోజుకు వేగం పెరుగుతోంది. ప్రజలు తమ అవసరాల రీత్యా కార్లు, ద్విచక్ర వాహనాలను వాడాల్సి వస్తోంది. ఈ క్రమంలో హెల్మెట్, సీటు బెల్ట్ లాంటి వాటిని ధరించకుండా ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా జరిగిన ప్రమాదాలలో ఎక్కువగా ద్విచక్ర వాహనాల్లో ప్రయాణించిన వారు.. అందులోనూ ప్రత్యేకించి హెల్మెట్ వాడని వారే మృత్యువాతపడ్డారు. తీవ్రంగా గాయపడిన ప్పటికీ హెల్మెట్ ధరించడం
శిరస్త్రాణం.. శిరోధార్యం!
వల్ల ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నవారు కూడా ఉన్నారు. ప్రతి ఒక్కరూ రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిబంధనల మేరకు జులై 1 నుంచి తప్పనిసరిగా హెల్మెట్, సీటు బెల్ట్‌ను వాడాల్సిందే. లేకపోతే జరిమానాలు, శిక్షలు తప్పవు.
హెల్మెట్ ధరించడం వల్ల..
హెల్మెట్ పూర్వకాలంలో యుద్ధాలతోపాటు ప్రస్తుత కాలంలో కర్మాగారాలలో అధికారులు, కార్మికులు సైతం తలకు రక్షణగా వాడుతున్నారు. దీనివల్ల ఏ ప్రమాదం సంభవించినప్పటికీ తలకు దెబ్బ తగలకుండా ప్రాణాపాయం నుంచి కూడా తప్పించుకోవచ్చు. సింగరేణి లాంటి బొగ్గు గనుల్లోనూ, ఐఓసీ లాంటి కర్మాగారాలు, సిమెంటు ఫ్యాక్టరీల్లో, విధుల్లో ఉంటే ట్రాఫిక్ కానిస్టేబుల్, అగ్నిమాపకశాఖ వారు హెల్మెట్ ధరిస్తూ ఉంటారు.
అలాగే మోటారు వాహనాల చట్టం ప్రకారం ప్రతి వాహనదారుడు హెల్మెట్ ధరించడం వల్ల ప్రాణాపాయం నుంచి తప్పించుకోవడంతోపాటు చట్టాన్ని గౌరవించిన వారవుతారు. ఒకవేళ హెల్మెట్ ధరించకపోతే సెక్షన్ 177 ప్రకారం ఎంవీ యాక్టు వారిపై ప్రయోగించి గతంలో రూ. 100 జరిమాన విధించేవారు. ఆ చట్టంలో మార్పు తీసుకొచ్చిన ప్రభుత్వం హెల్మెట్ ధరించకపోతే రూ. 500 జరిమాన, మరలా అదే నిబంధన పాటించక పట్టుబడితే కేసులు కూడా నమోదు చేయవచ్చని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. వాహనం నడిపే వారితో పాటు వెనుక కూర్చున్న వారు కూడా హెల్మెట్ ధరించడం వల్ల ప్రయోజనం ఉంటుంది.
హెల్మెట్ ధరించకపోవడం వల్ల కోల్పోయిన ప్రాణాలు
- కడప నగరంలోని ట్రాఫిక్ పోలీసుస్టేషన్ పరిధిలో ఈ ఏడాది జరిగిన ప్రమాదాల్లో హెల్మెట్ ధరించకపోవడం వల్ల చాలామంది విలువైన ప్రాణాలు కోల్పోయారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
- కడప నగరంలోని తాలూకా కానిస్టేబుల్ మద్దూరు లక్ష్మిరెడ్డి (పీసీ నెం. 1994) మే 5వ తేది రాత్రి విధి నిర్వహణలో భాగంగా మోటారు సైకిల్‌పై వెళుతుండగా మరియాపురం సమీపంలో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని ప్రాణాలు కోల్పోయారు.
- పబ్బాపురం వంతెన సమీపంలో మార్చి 9న రాంబాబు తన భార్య రాధ మోటారు సైకిల్‌పై వెళుతూ రోడ్డు ప్రక్కన నిలబడి ఉండగా రాయచోటి వైపు నుంచి కారు వేగంగా వచ్చి ఢీకొనడంతో మృతి చెందారు.
- అదేనెల 17వ తేదీ షేక్ అన్వర్‌బాషా (17) అనే యువకుడు ద్విచక్ర వాహనంలో రాజంపేట నుంచి అలంఖాన్‌పల్లెకు వచ్చి తిరిగి వెళుతుండగా ఆలంఖాన్‌పల్లె వద్ద పాల లారీ ీకొనడంతో మృతి చెందాడు.
- ఈనెల 16వ తేదీన రామచంద్రయ్య కాలనీకి చెందిన షేక్ బాషా అలియాస్ మహబూబ్‌పీర్ (45) తన ఇంటి నుంచి టీవీఎస్‌లో వస్తుండగా లగేజీ ఆటో వచ్చి ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి మృతి చెందాడు.
- కడప డీటీసీలో శిక్షణ కోసం తన మోటారు బైక్‌లో బయలుదేరిన మైదుకూరు ఎస్‌ఐ మోహన్ మూడు నెలల క్రితం ఖాజీపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఆ సమయంలో ఆయన హెల్మెట్ ధరించడం వల్ల ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.
వ్యక్తిగత భద్రత కోసం హెల్మెట్ తప్పనిసరి
వ్యక్తిగత భద్రత కోసం ప్రతి ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ ధరించాల్సిందే. జులై 1 నుంచి ఈ నిబంధన అమలులోకి వస్తుంది. ఎవరు హెల్మెట్ ధరించకపోయినా, సీటు బెల్ట్ ధరించకపోయినా ఒక్కొక్కరికి రూ. 500 చొప్పున జరిమాన విధిస్తాం. రెండవసారి పట్టుబడితే శిక్షార్హులవుతారు.
- భక్తవత్సలం, ట్రాఫిక్ డీఎస్పీ, కడప.
జులై 1 నుంచి ఖచ్చితంగా హెల్మెట్, సీటు బెల్ట్ ధరించాలి
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ హెల్మెట్, సీటు బెల్ట్ ధరించాల్సిందే. ఆ నిబంధన పాటించకపోతే పోలీసులు, ఎంవీఐ అధికారులు తనిఖీలు చేసినపుడు అన్ని రికార్డులతోపాటు హెల్మెట్‌ను చూస్తారు. అలా హెల్మెట్ ధరించకపోతే రూ. 500 నుంచి రూ. 1000 జరిమాన విధించే అవకాశముంది.
- మల్లెపల్లె బసిరెడ్డి, డీటీసీ, కడప