Helmet Regulations
-
చైన్ స్నాచింగ్ జరుగుతోందని హెల్మెట్ వద్దా?
-
చైన్ స్నాచింగ్ జరుగుతోందని హెల్మెట్ వద్దా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్‌లో హెల్మెట్ వాడకాన్ని ఎందుకు తప్పనిసరి చేయడం లేదో తెలుసా... గొలుసు దొంగతనాల (చైన్ స్నాచింగ్) కారణంగా!? చైన్ స్నాచింగ్‌కు, హెల్మెట్లకు సంబంధమేమిటని అంటారా... దొంగలు హెల్మెట్లు పెట్టుకుని బైక్‌లపై దూసుకువస్తూ గొలుసులు లాక్కెళుతున్నారు, అందుకే ద్విచక్రవాహనదారులు హెల్మె ట్లు ధరించాలన్న నిబంధనను కచ్చితంగా అమలు చేయడం లేదు! ఇది ఎవరో చెప్పింది కాదు.. సాక్షాత్తు హైకోర్టుకు పోలీసులు పరోక్షం గా వెల్లడించిన వివరణ ఇది. ఈ కారణం హాస్యాస్పదంగా ఉందంటూ... హైకోర్టు ధర్మాసనం విస్తుపోయింది. లక్ష మందిలో ఒకరో ఇద్దరో దొంగతనం చేస్తే.. అసలు హెల్మెట్ నిబంధననే అమలు చేయబోమంటే ఎలాగని ప్రశ్నించింది. హెల్మెట్ తప్పనిసరి నిబంధనను సక్రమంగా అమలు చేయని అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. మొత్తంగా చూస్తే తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ హెల్మెట్ నిబంధన సక్రమంగా అమలవుతున్న దాఖలాలు కనిపించడం లేదని పేర్కొంది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ... విచారణను జనవరి 21కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలె, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. చర్యలు తీసుకుంటున్నాం: ప్రభుత్వం హెల్మెట్ ధారణకు సంబంధించి మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 129ని అమలు చేసే విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని... ఆ నిబంధనను కచ్చితంగా అమలు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని రంగారెడ్డి జిల్లాకు చెందిన ఉడతనేని రామారావు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ధర్మాసనం సోమవారం కూడా విచారణ జరిపింది. హెల్మెట్ ధరించని వారిని ఆపి, జరి మానాలు విధిస్తున్న సందర్భాలు తమకు హైదరాబాద్‌లో ఎక్కడా కనిపించడం లేదని ఈ సం దర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది. దీనికి తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎ.సంజీవ్‌కుమార్ సమాధానమిస్తూ.. హెల్మెట్ ధరించని వారికి జరిమానా విధిస్తున్నామని, అదే పనిగా ఉల్లంఘనకు పాల్పడితే లెసైన్స్ రద్దుకు చర్యలు తీసుకుంటున్నామని కోర్టుకు చెప్పారు. కేంద్ర మోటారు వాహనాల చట్టం ప్రకారం హెల్మెట్ ధరించని వారికి రూ. 300 కంటే ఎక్కువగా జరిమానా విధించడానికి వీల్లేదని తెలిపారు. దీనిపై స్పందించిన ధర్మాస నం... అలా వసూలు చేస్తున్న జరిమానా సొమ్మంతా ఎక్కడకు వెళుతోందని ప్రశ్నిం చగా.. ఆ సొమ్ము రవాణాశాఖకు జమవుతోం దని సంజీవ్ చెప్పారు. దీనిపై అఫిడవిట్ దాఖలు చేయాలని రవాణాశాఖను ధర్మాసనం ఆదేశించింది. చైన్ స్నాచింగ్‌లు పెరిగిపోయాయి.. అనంతరం ప్రభుత్వ న్యాయవాది వాదనలను కొనసాగిస్తూ... జంట నగరాల్లో గొలుసు దొంగతనాలు పెరిగిపోతున్నాయని, హెల్మెట్ ధరించి గొలుసు దొంగతనాలు చేస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. గత శుక్ర, శనివారాల్లో నాలుగు చోట్ల ఇలా దొంగతనాలు జరిగాయని చెప్పారు. ఈ వివరణపై ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ‘‘పోలీసుల తరఫున మీరు చెబుతున్న ఈ కారణం హాస్యాస్పదంగా ఉంది. లక్షల మందిలో ఒకరిద్దరు హెల్మెట్ ధరించి దొంగతనాలు చేస్తున్నారంటూ హెల్మెట్ నిబంధనను అమలు చేయకపోతే ఎలా... మీ ఉద్దేశం ప్రకారం హెల్మెట్ వచ్చినప్పటి నుంచే గొలుసు దొంగతనాలు జరుగుతున్నాయా.. అసలు పోలీసులు చెబుతున్న ఈ కారణంతో మీరు ఏకీభవిస్తారా..?..’’ అని న్యాయవాదిని ప్రశ్నించింది. ఈ కారణంతో తానూ ఏకీభవించనని సం జీవ్ పేర్కొనగా... మరి గొలుసు దొంగతనాలను ఎందుకు ప్రస్తావించారని ప్రశ్నించింది. హెల్మెట్ నిబంధనను కఠినంగా అమలు చేయ ని అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని.. దీనికి సంబంధించి ఇప్పటివరకు ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశిం చింది. అనంతరం ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ స్పందన కోరగా... తమ రాష్ట్రంలో నవంబర్ 1 నుంచి హెల్మెట్ నిబంధనను అమలు చేస్తున్నామని ఏపీ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది డి.రమేష్ వివరించారు. దీంతో ధర్మాసనం విచారణను వచ్చే నెల 21కి వాయిదా వేసింది. -
హెల్మెట్ రగడ
సాక్షి, చెన్నై : హెల్మెట్ తప్పనిసరి వ్యవహారం బుధవారం హైకోర్టు పరిసరాల్లో రగడకు దారి తీసింది. హెల్మెట్ విషయంలో మదురై న్యాయవాదులపై కోర్టు ధిక్కార కేసు వివాదానికి దారి తీసింది. ఏకంగా బస్సుల్లో తరలివచ్చిన న్యాయవాదులు హైకోర్టు ముట్టడికి యత్నించారు. ఎన్ఎస్సీ బోస్ రోడ్డులో రాస్తారోకోకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. త్వరలో అవినీతి న్యాయమూర్తుల వివరాల్ని గవర్నర్‌కు అందిస్తామని న్యాయవాద సంఘాల నాయకులు హెచ్చరించడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో ద్విచక్ర వాహనాదారులకు హెల్మెట్ తప్పనిసరి చేస్తూ హైకోర్టు న్యాయమూర్తి కృపాకరణ్ రెండు నెలల క్రితం తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో హెల్మెట్లు తప్పనిసరి అయ్యాయి. హెల్మెట్ల ధరలు ఆకాశాన్ని అంటి , ఇప్పుడిప్పుడే దిగి వచ్చాయి. అదే సమయంలో హెల్మెట్ వాడకం వ్యవహారంలో పలు పిటిషన్లు కోర్టుల్లో విచారణలో ఉన్నాయి. ఈసమయంలో న్యాయవాదులకు తమకు మినహాయింపు ఇవ్వాలని, అలాగే హెల్మెట్ తప్పనిసరి చేస్తూ విధించిన కొన్ని నిబంధనల్ని సడలించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేస్తూ వస్తున్నారు. మద్రాసు హైకోర్టు, మదురై ధర్మాసనంలో ఉన్న న్యాయవాదులు ఏకంగా పోరు బాట పట్టారు. వీరి ఆందోళనలతో విధులకు ఆటంకాలు నెల కొంటూ వస్తున్నాయి. దీంతో ఆలస్యంగా స్పందించిన మద్రాసు హైకోర్టు అక్కడి న్యాయవాదుల తీరును తీవ్రంగా ఖండించింది. అలాగే, అక్కడి న్యాయవాద సంఘం నాయకులు ధర్మరాజ్, రామస్వామిలతో పాటు ఐదుగురిపై కే సు నమోదుకు ఆదేశిస్తూ, విచారణను సుమోటోగా స్వీకరించింది. దీనిపై న్యాయవాదుల్లో ఆగ్రహం పెల్లుబిక్కాయి. వీరికి మద్దతుగా కొన్ని చోట్ల న్యాయవాదులు కదిలారు. హైకోర్టు ముట్టడి : తమ మీద కోర్టు ధిక్కార కేసు నమోదు కావడంతో మదురైలోని న్యాయవాదుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. బుధవారం ఈ కేసు విచారణకు రావడంతో హైకోర్టును ముట్టడించి తమ నిరసన తెలియజేయడానికి సిద్ధమయ్యారు. మదురై నుంచి మూడు బస్సుల్లో రెండు వందల మందికి పైగా న్యాయవాదులు చెన్నైకు బయలు దేరిన సమాచారంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. హైకోర్టు పరిసరాల్లోని అన్ని మార్గాల్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. భద్రతను కట్టుదిట్టం చేశారు. ఉదయం నుంచి హైకోర్టులోకి వచ్చే ప్రతి ఒక్కర్నీ తనిఖీల అనంతరం అనుమతించారు. హెల్మెట్ రగడ : మదురై నుంచి ప్రైవేటు ట్రావెల్స్‌ల్లో వచ్చిన న్యాయవాదులు ఆ బస్సులతో నేరుగా హైకోర్టులోని ఆవిన్ గేట్ వద్దకు చేరుకుని లోనికి చొరబడ్డారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకునేందుకు శ్రమించాల్సి వచ్చింది. చివరకు న్యాయవాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎన్ఎస్సీ బోసు రోడ్డులో రాస్తారోకోకు దిగడంతో వాహనాల రాక పోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. గత అనుభవాల దృష్ట్యా, న్యాయవాదులతో వివాదానికి వెళ్లకుండా వారిని బుజ్జగించేందుకు పోలీసులు తీవ్రంగానే శ్రమించాల్సి వచ్చింది. అదే సమయంలో న్యాయవాదుల తీరుపై కోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయడంతో కాస్త వెనక్కి తగ్గక తప్పలేదు. దీంతో న్యాయవాదులు బార్ కౌన్సిల్ వైపుగా కదిలారు. ఈసందర్భంగా మదురై న్యాయవాద సంఘం నేత రామస్వామి మీడియాతో మాట్లాడుతూ, తాము పారిశ్రామికవేత్తల్ని బెదిరించి ప్రైవేటు బస్సుల ద్వారా ఇక్కడికి వచ్చామని న్యాయ వర్గాలు ఆరోపించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అవినీతి న్యాయమూర్తులు ఎందరో ఉన్నారని, వారి గురించి తామెప్పుడైనా నోరు విప్పామా..? అని ప్రశ్నించారు. త్వరలో రాష్ర్ట గవర్నర్‌ను కలవబోతున్నామని, ఇక్కడున్న అవినీతి న్యాయమూర్తుల వివరాల్ని అందజేసి చర్యకు డిమాండ్చేయబోతున్నామంటూ న్యాయ విభాగంలో అవినీతిని ఎత్తి చూపుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. మధ్యాహ్నం కోర్టు ధిక్కార కేసు న్యాయమూర్తులు సీటీ సెల్వన్, తమిళ్‌వానన్ నేతృత్వంలోని బెంచ్ ముందుకు విచారణకు రావడంతో ఎలాంటి ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యగా హైకోర్టు పరిసరాల్లో భారీ భద్రతా ఏర్పాట్లును పోలీసు యంత్రాంగం చేసింది. ఇక, కోర్టు పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్ ఆదేశాలు జారీ చేయక తప్పలేదు. -
సురక్షిత ప్రయాణానికి హెల్మెట్ తప్పనిసరి
నగరంపాలెం(గుంటూరు) : ద్విచక్రవాహనంపై సురక్షితంగా ప్రయాణం చేయాలంటే హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని జిల్లా ఉప రవాణా కమిషనరు రాజారత్నం అన్నారు. రవాణాశాఖ ఆధ్యర్యంలో ద్విచక్రవాహనదారులకు హెల్మెట్ వాడకం పై నిర్వహించిన అవగాహన ర్యాలీని మంగళవారం ఆయన జెండా ఊపి ప్రారంభించారు. వాహనప్రమాదంలో మరణిస్తున్న వారిలో ద్విచక్ర వాహనంపై హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్నవారే 80 శాతం ఉన్నారన్నారు. రవాణా కమిషనరు ఆదేశానుసారం నవంబరు మెదటి తేదీ నుంచి ద్విచక్రవాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నరు. రవాణా శాఖ వాహనదారుల భద్రత కోసం రూపొందించిన నిబంధనలు నిర్లక్ష్యంగా పాటించకపోతే వారి ప్రాణాలకే ప్రమాదం జరిగే అవకాశం ఉందన్నారు. ట్రాఫిక్ డీఎస్పీ కండె శ్రీనివాసులు మాట్లాడుతూ జరిమానాలకు భయపడి కాకుండా ప్రమాదాల బారిన పడకుండా ఉండేదుకు హెల్మెట్ వాడాలన్నారు. ప్రాంతీయ రవాణా శాఖ అధికారి రామస్వామి, మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్లు ఉమామహేశ్వరరావు, సుధాకరరెడ్డి తదితరులు వంద వాహనాలతో నగరంలో ర్యాలీ నిర్వహించారు. -
ఇంకాస్త టైముంది
♦ హెల్మెట్‌పై మొదటి రోజు స్పందన శూన్యం ♦ ఈనెల 4 తరువాత వాహనంతోపాటు హెల్మెట్ కొనాల్సిందే ♦ అంతకుముందు కొన్న వాహనాలకు సడలింపు సాక్షి, సిటీబ్యూరో : ద్విచక్రవాహనాలు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే హెల్మెట్ తప్పనిసరి అనే నిబంధన మొదటి రోజే తుస్సుమంది. నగరంలోనే ఏ ఆర్టీఏ కార్యాలయంలోనూ ఈ నిబంధన అమలు కాలేదు. హెల్మెట్ లేకపోయినప్పటికీ రవాణా అధికారులు వాహనాలను రిజిస్ట్రేషన్లు చేశారు. నిబంధన అమల్లోకి వచ్చిన రోజు కంటే ముందే వాహనాలు కొనుగోలు చేసి ఉండడంతో అధికారులు సడలింపునిచ్చారు. మరోవైపు హెల్మెట్‌పై వాహనదారుల్లో మొదట విస్తృత స్థాయిలో అవగాహన కల్పించడమే తమ లక్ష్యమని, ఆ తరువాత క్రమంగా తనిఖీలు నిర్వహించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ సంయుక్త రవాణా కమిషనర్ టి.రఘునాథ్ ‘సాక్షి’తో చెప్పారు. నిబంధన అమల్లోకి వచ్చిన సెప్టెంబర్ 4 నుంచి కొనుగోలు చేసే వాహనాలకు తప్పనిసరిగా వాహనాల ఇన్వాయిస్తో పాటు హెల్మెట్ బిల్లు కూడా ఉండాల్సిందేనన్నారు. గ్రేటర్‌లోని ఖైరతాబాద్, మెహదీపట్నం, బహదూర్‌పురా, సికింద్రాబాద్, మలక్‌పేట్, ఉప్పల్, అత్తాపూర్,మేడ్చెల్, ఇబ్రహీంపట్నం, కూకట్పల్లి,తదితర కార్యాలయాల్లో ప్రతి రోజూ వెయ్యికి పైగా ద్విచక్ర వాహనాలు రిజిస్ట్రేషన్ అవుతాయి. కొనుగోలు చేసిన తరువాత నెల లోపు ఎప్పుడైనా రిజిస్ట్రేషన్ చేసుకొనే వెసులుబాటు ఉండడంతో వాహనదారులు కొనుగోలు చేసిన రోజునే రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఏ వద్దకు వెళ్లరు. చాలా మంది వాహనాలు కొనుగోలు చేసిన 15 రోజుల నుంచి 30 రోజుల మధ్య మంచి ముహూర్తం చూసుకొని రిజిస్ట్రేషన్ కోసం వస్తారు. అలా హెల్మెట్ నిబంధన అమల్లోకి వచ్చిన తేదీ కంటే ముందే కొనుగోలు చేసిన వాహనాలు కావడంతో ఆర్టీఏ అధికారులు హెల్మెట్లు లేకపోయినా రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పించారు. విస్తృత ప్రచారం మరోవైపు హెల్మెట్ అమలుపై మొదటి దశలో విస్తృతమైన ప్రచారం చేపట్టేందుకు హైదరాబాద్ ఆర్టీఏ సన్నాహాలు చేపట్టింది. నగరంలోని అన్ని షోరూమ్‌లలో బ్యానర్లు, కరపత్రాల ద్వారా అవగాహన కల్పించనున్నట్లు జేటీసీ రఘునాథ్ చెప్పారు. నగరంలో ప్రచార కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వివరించారు. -
నేటి నుంచి హెల్మెట్ తప్పనిసరి
హెల్మెట్ ధరించకున్నా, సీటు బెల్ట్ పెట్టకపోయినా విధించే జరిమానా రూ. 2000 ఒంగోలు క్రైం : బైకులు నడిపే వారంతా శనివారం నుంచి తప్పకుండా హెల్మెట్ ధరించాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఎవరికీ మినహాయింపు లేదని, బైకులు నడిపే వారంతా (పోలీసులు, విలేకరులతో సహా) హెల్మెట్ ధరించాలని పోలీసు అధికారులు చెబుతున్నారు. హెల్మెట్ ధరిస్తే ప్రమాద తీవ్రత తక్కువగా ఉంటుందని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. హెల్మెట్లు లేక చాలామంది ప్రాణాలు పోగుట్టుకున్న సందర్భాలు ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. హెల్మెట్ ఉంటే గాయాలతో బయటపడవచ్చు. ప్రాణాలు కాపాడుకోవచ్చు. భారం అనుకోకుండా తప్పనిసరిగా హెల్మెట్ కొనుగోలు చేసుకుంటే సురక్షితంగా ప్రయాణం చేయవచ్చు. వాస్తవానికి జూన్ ఒకటో తేదీ నుంచి హెల్మెట్ ధరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే హెల్మెట్లు చాలినన్ని అందుబాటులో లేకపోవటంతో పాటు నాణ్యమైనవి లేవన్న కారణంగా ప్రభుత్వం నెల గడువు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. భారం అనుకోవద్దు : జి.శ్రీనివాసరావు, డీఎస్పీ, ఒంగోలు హెల్మెట్ల కొనుగోలు భారం అనుకోవద్దు. అసౌకర్యం అంతకన్నా అనుకోవద్దు. ట్రాఫిక్ రోజు రోజుకూ పెరిగేకొద్దీ ప్రమాదాలూ అంతే స్థాయిలో జరుగుతున్నాయి. రోడ్డు భద్రతపై జాగ్రత్తలు తీసుకుంటున్నా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. హెల్మెట్లు ధరిస్తే ప్రమాద తీవ్రత తక్కువగా ఉంటుంది. భారం, అసౌకర్యం అనుకోకుండా ప్రజలు తప్పనిసరిగా హెల్మెట్లు కొనుగోలు చేసి వాటిని పెట్టుకునే వాహనాలు నడపాలి. ఇంటి వద్ద మన కోసం కుటుంబ సభ్యులు ఎదురు చూస్తుంటారని గుర్తించుకోవాలి. కారులో డ్రైవర్‌తో సహా అంతా సీటు బెల్ట్ ధరించాల్సిందే చీమకుర్తి : ద్విచక్ర వాహనాలు నడిపే వారు హెల్మెట్లు ఎలా ధరిస్తున్నారో కారులో డ్రైవర్‌తో సహా అంతా సీటు బెల్ట్‌లు ధరించాల్సిందేనని ఎస్సై సుబ్బరాజు తెలిపారు. హెల్మెట్ లేకున్నా, సీటు బెల్ట్ ధరించకున్నా ఒక్కొక్కరికి రూ.2 వేల అపరాధ రుసుం విధిస్తామని హెచ్చరించారు. సామాన్య ప్రజలతో పాటు పోలీసులు కూడా తప్పనిసరిగా ెహ ల్మెట్లు ధరించాలన్నారు. మైక్ ద్వారా ప్రచారం ఒంగోలు క్రైం : మైక్ ద్వారా ద్విచక్ర వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు శుక్రవారం అవగాహన కల్పించారు. మొదటి నుంచి హెల్మెట్ వాడకంపై చెబుతూనే ఉన్నామని, ప్రజలు అర్థం చేసుకొని పోలీసులకు సహకరించాలని ట్రాఫిక్ డీఎస్పీ జె.రాంబాబు కోరారు. జాగ్రత్తలివిగో.. ►స్టాప్ గడ్డంపై ఉంచేందుకు అనువుగా ఉండే హెల్మెట్ చూసుకోవాలి ►ధరించినప్పుడు స్టాప్ తీసుకునేందుకు, పెట్టుకునేందుకు మన వేళ్లు లోపలికి వెళ్లే విధంగా హెల్మెట్ ఉండాలి. ►ధరించినప్పుడు బిగుతుగా ఉండకూడదు. లోపల తల అటూ, ఇటూ తిరిగే విధంగా చూసుకోవాలి ►బుగ్గలు ఒత్తిడికి గురికాకుండా ఉండాలి. ►వెనక్కు, ముందుకు వంగినప్పుడు పడిపోకూడదు, ఊడకూడదు. హెల్మెట్ ఇలా ఉండాలి ►హెల్మెట్లలో చాలా రకాలున్నాయి. నాణ్యతతో పాటు తేలికగా ఉండే వాటిని ఎంచుకోవాలి. ►తలకు సరిపడే విధంగా హెల్మెట్ ఉండేలా కొలతలు చూసుకొవాలి. ►మీరు ఎంచుకున్న హెల్మెట్ తల, మెడ, గడ్డం కింది భాగం వరకూ రక్షణ ఇవ్వాలి. ►సగం ఉన్నవి, చిన్నవిగా ఉండేవి ధరించకూడదు. ►తలకు హెల్మెట్ ఉన్నప్పుడు వెనుక వచ్చే వాహనాల హారన్ వినపడేలా ఉండాలి. ►డాట్ (డీఓటీ) డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్‌పోర్టేషన్ స్టిక్కర్స్ ఉన్న హెల్మెట్లనే ధరించాలి. ►హెల్మెట్ ధరించి వాహనం నడిపేటప్పుడు వెనుక వచ్చే వాహనాలు కనపడే విధంగా సైడు అద్దాలు అమర్చుకోవాలి. -
హెల్మెట్ ఉంటేనే రిజిస్ట్రేషన్
సాక్షి, హైదరాబాద్ : వాహనం రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఏ ఆఫీసుకు వెళ్తున్నారా.. అయితే హెల్మెట్ తప్పనిసరిగా ధరించాల్సిందే. రహదారి భద్రతా ఉద్యమంలో భాగంగా రవాణాశాఖ హెల్మెట్‌పై విస్తృత అవగాహన కల్పించేందుకు ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇకపై హెల్మెట్లు ధరించి వచ్చిన వారికి మాత్రమే వాహనాల రిజిస్ట్రేషన్లు, డ్రైవింగ్ లెసైన్స్‌లు వంటి పౌరసేవలను అందజేస్తారు. ఈ మేరకు ఖైరతాబాద్‌లోని ప్రధాన కార్యాలయంతో పాటు గ్రేటర్ హైదరాబాద్‌లోని అన్ని ఆర్టీఏ కార్యాలయాల వద్ద బ్యానర్లు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో గత సంవత్సరం జరిగిన ప్రమాదాల్లో దాదాపు 1,212 మంది హెల్మెట్ ధరించకపోవడం వల్లనే చనిపోయినట్లు ఆర్టీఏ గుర్తించింది. దీంతో హెల్మెట్ నిబంధనను తప్పనిసరి చేశారు. ఆర్టీఏ కార్యాలయాలకు వచ్చే వారిలో హెల్మెట్ ధరించిన వారికి మాత్రమేసేవలు లభించేలా చర్యలు తీసుకుంటున్నట్లు హైదరాబాద్ ఇంచార్జి సం యుక్త రవాణా కమిషనర్ రమేష్ ‘సాక్షి’తో చెప్పారు. -
శిరస్త్రాణం.. శిరోధార్యం!
♦ జులై 1 నుంచి హెల్మెట్ తప్పనిసరి ♦ హెల్మెట్ లేకపోవడంతో ప్రాణాలు కోల్పోయిన సంఘటనలెన్నో.. శిరస్త్రాణం నిబంధన అమలుకు ఇంకా పది రోజులు మాత్రమే గడువు మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో వాహనదారుల్లో ఈ నిబంధనపై ఉన్న అవగాహన ఎంత.. అసలు ఎంతమంది స్వచ్ఛందంగా శిరస్త్రాణం ధరిస్తున్నారు అని ఆరా తీస్తే ప్రతి వంద మందిలో కేవలం ఐదుమంది మాత్రమే హెల్మెట్ ధరిస్తున్నారని స్పష్టమవుతోంది. ప్రమాదాలు జరిగిన సమయంలో హెల్మెట్ ప్రాణాలు నిలుపుతుందని తెలిసినా చాలా మంది హెల్మెట్ ధరించేందుకు ఆసక్తి కనబర్చడం లేదు. కడప అర్బన్ : మనిషి దైనందిన జీవితంలో రోజురోజుకు వేగం పెరుగుతోంది. ప్రజలు తమ అవసరాల రీత్యా కార్లు, ద్విచక్ర వాహనాలను వాడాల్సి వస్తోంది. ఈ క్రమంలో హెల్మెట్, సీటు బెల్ట్ లాంటి వాటిని ధరించకుండా ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా జరిగిన ప్రమాదాలలో ఎక్కువగా ద్విచక్ర వాహనాల్లో ప్రయాణించిన వారు.. అందులోనూ ప్రత్యేకించి హెల్మెట్ వాడని వారే మృత్యువాతపడ్డారు. తీవ్రంగా గాయపడిన ప్పటికీ హెల్మెట్ ధరించడం శిరస్త్రాణం.. శిరోధార్యం! వల్ల ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నవారు కూడా ఉన్నారు. ప్రతి ఒక్కరూ రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిబంధనల మేరకు జులై 1 నుంచి తప్పనిసరిగా హెల్మెట్, సీటు బెల్ట్‌ను వాడాల్సిందే. లేకపోతే జరిమానాలు, శిక్షలు తప్పవు. హెల్మెట్ ధరించడం వల్ల.. హెల్మెట్ పూర్వకాలంలో యుద్ధాలతోపాటు ప్రస్తుత కాలంలో కర్మాగారాలలో అధికారులు, కార్మికులు సైతం తలకు రక్షణగా వాడుతున్నారు. దీనివల్ల ఏ ప్రమాదం సంభవించినప్పటికీ తలకు దెబ్బ తగలకుండా ప్రాణాపాయం నుంచి కూడా తప్పించుకోవచ్చు. సింగరేణి లాంటి బొగ్గు గనుల్లోనూ, ఐఓసీ లాంటి కర్మాగారాలు, సిమెంటు ఫ్యాక్టరీల్లో, విధుల్లో ఉంటే ట్రాఫిక్ కానిస్టేబుల్, అగ్నిమాపకశాఖ వారు హెల్మెట్ ధరిస్తూ ఉంటారు. అలాగే మోటారు వాహనాల చట్టం ప్రకారం ప్రతి వాహనదారుడు హెల్మెట్ ధరించడం వల్ల ప్రాణాపాయం నుంచి తప్పించుకోవడంతోపాటు చట్టాన్ని గౌరవించిన వారవుతారు. ఒకవేళ హెల్మెట్ ధరించకపోతే సెక్షన్ 177 ప్రకారం ఎంవీ యాక్టు వారిపై ప్రయోగించి గతంలో రూ. 100 జరిమాన విధించేవారు. ఆ చట్టంలో మార్పు తీసుకొచ్చిన ప్రభుత్వం హెల్మెట్ ధరించకపోతే రూ. 500 జరిమాన, మరలా అదే నిబంధన పాటించక పట్టుబడితే కేసులు కూడా నమోదు చేయవచ్చని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. వాహనం నడిపే వారితో పాటు వెనుక కూర్చున్న వారు కూడా హెల్మెట్ ధరించడం వల్ల ప్రయోజనం ఉంటుంది. హెల్మెట్ ధరించకపోవడం వల్ల కోల్పోయిన ప్రాణాలు - కడప నగరంలోని ట్రాఫిక్ పోలీసుస్టేషన్ పరిధిలో ఈ ఏడాది జరిగిన ప్రమాదాల్లో హెల్మెట్ ధరించకపోవడం వల్ల చాలామంది విలువైన ప్రాణాలు కోల్పోయారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. - కడప నగరంలోని తాలూకా కానిస్టేబుల్ మద్దూరు లక్ష్మిరెడ్డి (పీసీ నెం. 1994) మే 5వ తేది రాత్రి విధి నిర్వహణలో భాగంగా మోటారు సైకిల్‌పై వెళుతుండగా మరియాపురం సమీపంలో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని ప్రాణాలు కోల్పోయారు. - పబ్బాపురం వంతెన సమీపంలో మార్చి 9న రాంబాబు తన భార్య రాధ మోటారు సైకిల్‌పై వెళుతూ రోడ్డు ప్రక్కన నిలబడి ఉండగా రాయచోటి వైపు నుంచి కారు వేగంగా వచ్చి ఢీకొనడంతో మృతి చెందారు. - అదేనెల 17వ తేదీ షేక్ అన్వర్‌బాషా (17) అనే యువకుడు ద్విచక్ర వాహనంలో రాజంపేట నుంచి అలంఖాన్‌పల్లెకు వచ్చి తిరిగి వెళుతుండగా ఆలంఖాన్‌పల్లె వద్ద పాల లారీ ీకొనడంతో మృతి చెందాడు. - ఈనెల 16వ తేదీన రామచంద్రయ్య కాలనీకి చెందిన షేక్ బాషా అలియాస్ మహబూబ్‌పీర్ (45) తన ఇంటి నుంచి టీవీఎస్‌లో వస్తుండగా లగేజీ ఆటో వచ్చి ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. - కడప డీటీసీలో శిక్షణ కోసం తన మోటారు బైక్‌లో బయలుదేరిన మైదుకూరు ఎస్ఐ మోహన్ మూడు నెలల క్రితం ఖాజీపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఆ సమయంలో ఆయన హెల్మెట్ ధరించడం వల్ల ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. వ్యక్తిగత భద్రత కోసం హెల్మెట్ తప్పనిసరి వ్యక్తిగత భద్రత కోసం ప్రతి ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ ధరించాల్సిందే. జులై 1 నుంచి ఈ నిబంధన అమలులోకి వస్తుంది. ఎవరు హెల్మెట్ ధరించకపోయినా, సీటు బెల్ట్ ధరించకపోయినా ఒక్కొక్కరికి రూ. 500 చొప్పున జరిమాన విధిస్తాం. రెండవసారి పట్టుబడితే శిక్షార్హులవుతారు. - భక్తవత్సలం, ట్రాఫిక్ డీఎస్పీ, కడప. జులై 1 నుంచి ఖచ్చితంగా హెల్మెట్, సీటు బెల్ట్ ధరించాలి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ హెల్మెట్, సీటు బెల్ట్ ధరించాల్సిందే. ఆ నిబంధన పాటించకపోతే పోలీసులు, ఎంవీఐ అధికారులు తనిఖీలు చేసినపుడు అన్ని రికార్డులతోపాటు హెల్మెట్‌ను చూస్తారు. అలా హెల్మెట్ ధరించకపోతే రూ. 500 నుంచి రూ. 1000 జరిమాన విధించే అవకాశముంది. - మల్లెపల్లె బసిరెడ్డి, డీటీసీ, కడప