
హెల్మెట్ ఉంటేనే రిజిస్ట్రేషన్
సాక్షి, హైదరాబాద్ : వాహనం రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఏ ఆఫీసుకు వెళ్తున్నారా.. అయితే హెల్మెట్ తప్పనిసరిగా ధరించాల్సిందే. రహదారి భద్రతా ఉద్యమంలో భాగంగా రవాణాశాఖ హెల్మెట్‌పై విస్తృత అవగాహన కల్పించేందుకు ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇకపై హెల్మెట్‌లు ధరించి వచ్చిన వారికి మాత్రమే వాహనాల రిజిస్ట్రేషన్‌లు, డ్రైవింగ్ లెసైన్స్‌లు వంటి పౌరసేవలను అందజేస్తారు. ఈ మేరకు ఖైరతాబాద్‌లోని ప్రధాన కార్యాలయంతో పాటు గ్రేటర్ హైదరాబాద్‌లోని అన్ని ఆర్టీఏ కార్యాలయాల వద్ద బ్యానర్లు ఏర్పాటు చేశారు.
రాష్ట్రంలో గత సంవత్సరం జరిగిన ప్రమాదాల్లో దాదాపు 1,212 మంది హెల్మెట్ ధరించకపోవడం వల్లనే చనిపోయినట్లు ఆర్టీఏ గుర్తించింది. దీంతో హెల్మెట్ నిబంధనను తప్పనిసరి చేశారు. ఆర్టీఏ కార్యాలయాలకు వచ్చే వారిలో హెల్మెట్ ధరించిన వారికి మాత్రమేసేవలు లభించేలా చర్యలు తీసుకుంటున్నట్లు హైదరాబాద్ ఇంచార్జి సం యుక్త రవాణా కమిషనర్ రమేష్ ‘సాక్షి’తో చెప్పారు.