చైన్ స్నాచింగ్ జరుగుతోందని హెల్మెట్ వద్దా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్‌లో హెల్మెట్ వాడకాన్ని ఎందుకు తప్పనిసరి చేయడం లేదో తెలుసా... గొలుసు దొంగతనాల (చైన్ స్నాచింగ్) కారణంగా!? చైన్ స్నాచింగ్‌కు, హెల్మెట్లకు సంబంధమేమిటని అంటారా... దొంగలు హెల్మెట్లు పెట్టుకుని బైక్‌లపై దూసుకువస్తూ గొలుసులు లాక్కెళుతున్నారు, అందుకే ద్విచక్రవాహనదారులు హెల్మె ట్లు ధరించాలన్న నిబంధనను కచ్చితంగా అమలు చేయడం లేదు! ఇది ఎవరో చెప్పింది కాదు.. సాక్షాత్తు హైకోర్టుకు పోలీసులు పరోక్షం గా వెల్లడించిన వివరణ ఇది. ఈ కారణం హాస్యాస్పదంగా ఉందంటూ... హైకోర్టు ధర్మాసనం విస్తుపోయింది.
లక్ష మందిలో ఒకరో ఇద్దరో దొంగతనం చేస్తే.. అసలు హెల్మెట్ నిబంధననే అమలు చేయబోమంటే ఎలాగని ప్రశ్నించింది. హెల్మెట్ తప్పనిసరి నిబంధనను సక్రమంగా అమలు చేయని అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. మొత్తంగా చూస్తే తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ హెల్మెట్ నిబంధన సక్రమంగా అమలవుతున్న దాఖలాలు కనిపించడం లేదని పేర్కొంది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ... విచారణను జనవరి 21కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలె, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
చర్యలు తీసుకుంటున్నాం: ప్రభుత్వం
హెల్మెట్ ధారణకు సంబంధించి మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 129ని అమలు చేసే విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని... ఆ నిబంధనను కచ్చితంగా అమలు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని రంగారెడ్డి జిల్లాకు చెందిన ఉడతనేని రామారావు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ధర్మాసనం సోమవారం కూడా విచారణ జరిపింది. హెల్మెట్ ధరించని వారిని ఆపి, జరి మానాలు విధిస్తున్న సందర్భాలు తమకు హైదరాబాద్‌లో ఎక్కడా కనిపించడం లేదని ఈ సం దర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది. దీనికి తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎ.సంజీవ్‌కుమార్ సమాధానమిస్తూ.. హెల్మెట్ ధరించని వారికి జరిమానా విధిస్తున్నామని, అదే పనిగా ఉల్లంఘనకు పాల్పడితే లెసైన్స్ రద్దుకు చర్యలు తీసుకుంటున్నామని కోర్టుకు చెప్పారు. కేంద్ర మోటారు వాహనాల చట్టం ప్రకారం హెల్మెట్ ధరించని వారికి రూ. 300 కంటే ఎక్కువగా జరిమానా విధించడానికి వీల్లేదని తెలిపారు. దీనిపై స్పందించిన ధర్మాస నం... అలా వసూలు చేస్తున్న జరిమానా సొమ్మంతా ఎక్కడకు వెళుతోందని ప్రశ్నిం చగా.. ఆ సొమ్ము రవాణాశాఖకు జమవుతోం దని సంజీవ్ చెప్పారు. దీనిపై అఫిడవిట్ దాఖలు చేయాలని రవాణాశాఖను ధర్మాసనం ఆదేశించింది.
చైన్ స్నాచింగ్‌లు పెరిగిపోయాయి..
అనంతరం ప్రభుత్వ న్యాయవాది వాదనలను కొనసాగిస్తూ... జంట నగరాల్లో గొలుసు దొంగతనాలు పెరిగిపోతున్నాయని, హెల్మెట్ ధరించి గొలుసు దొంగతనాలు చేస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. గత శుక్ర, శనివారాల్లో నాలుగు చోట్ల ఇలా దొంగతనాలు జరిగాయని చెప్పారు. ఈ వివరణపై ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ‘‘పోలీసుల తరఫున మీరు చెబుతున్న ఈ కారణం హాస్యాస్పదంగా ఉంది. లక్షల మందిలో ఒకరిద్దరు హెల్మెట్ ధరించి దొంగతనాలు చేస్తున్నారంటూ హెల్మెట్ నిబంధనను అమలు చేయకపోతే ఎలా... మీ ఉద్దేశం ప్రకారం హెల్మెట్ వచ్చినప్పటి నుంచే గొలుసు దొంగతనాలు జరుగుతున్నాయా.. అసలు పోలీసులు చెబుతున్న ఈ కారణంతో మీరు ఏకీభవిస్తారా..?..’’ అని న్యాయవాదిని ప్రశ్నించింది.
ఈ కారణంతో తానూ ఏకీభవించనని సం జీవ్ పేర్కొనగా... మరి గొలుసు దొంగతనాలను ఎందుకు ప్రస్తావించారని ప్రశ్నించింది. హెల్మెట్ నిబంధనను కఠినంగా అమలు చేయ ని అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని.. దీనికి సంబంధించి ఇప్పటివరకు ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశిం చింది. అనంతరం ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ స్పందన కోరగా... తమ రాష్ట్రంలో నవంబర్ 1 నుంచి హెల్మెట్ నిబంధనను అమలు చేస్తున్నామని ఏపీ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది డి.రమేష్ వివరించారు. దీంతో ధర్మాసనం విచారణను వచ్చే నెల 21కి వాయిదా వేసింది.