Chain snatchings
-
పోలీసులకే చుక్కలు చూపించారు
రణస్థలం:అత్తా అల్లుడు వెళ్తున్న బైక్‌ను సుమారు రెండు కిలోమీటర్ల మేర ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు వెంబడించి ఆమె మెడలోని బంగారు గొలుసు లాక్కుని పరారయ్యారు. ఈ విషయం తెలుసుకుని గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులను సైతం ముప్పుతిప్పలు పెట్టి చాకచక్యంగా తప్పించుకుపోయారు. సినీ ఫక్కీలో జరిగిన ఈ ఘటన మండలంలో కలకలం రేపింది. నిందితులు బైక్ వదిలి పరారయ్యారు. దానిపై నంబరు ప్లేటు లేకపోవడంతో గమనార్హం. జేఆర్‌పురం పోలీసుల వివరాలు ప్రకారం... మండలంలోని దేవరాపల్లి గ్రామం నుంచి రావాడ వెళ్లేందుకు బుధవారం సాయంత్రం చందక అప్పలనర్సమ్మ ఆమె అల్లుడు కరిమజ్జి శంకర్ తన ఇద్దరు చిన్నపిల్లలతోపాటు ద్విచక్రవాహనంపై బయలుదేరారు. ఈ క్రమంలో కమ్మసిగడాం కూడలి నుంచి రెండు కిలోమీటర్లు వరకు గుర్తుతెలియని వ్యక్తులు పల్సర్ 200సీసీపై వెంబడించారు. కొండములగాం శ్మశానవాటిక సమీపానికి రాగానే అప్పలనర్సమ్మ మెడలో నుంచి హఠాత్తుగా రెండు తులాల బంగారు చైన్ లాక్కుకొని ఉడాయించారు. వారు వెనుకనే వెంబడించి రణస్థలం జాతీయ రహదారిపై ఉన్న జేఆర్‌పురం పోలీసులకు శంకర్ సమాచారమిచ్చాడు. హుటాహుటిన హైవే పెట్రోలింగ్ వాహనంపై జాతీయ రహదారిపై పోలీసులు వెంబడించారు. అయితే దుండగులు వీరిని ముప్పుతిప్పలు పెట్టారు. రణస్థలంలోని రామతీర్థాలు కూడలి నుంచి కోష్ట జంక్షన్ మధ్య రెండుమార్లు అటూ ఇటూ చక్కర్లు కొట్టించి చాకచక్యంగా తప్పించుకుపోయారు. కడ వరకు వెంబడించిన పోలీసులకు చెమటలు పట్టించారు. చివరకు రణస్థలం దగ్గర కొత్త పెట్రోల్ బంకు ఎదురుగా ఉన్న సీతంపేట గ్రామ సమీపంలో తోటపల్లి కాలువ వద్ద ద్విచక్ర వాహనాన్ని వదిలేసి తోటల్లోకి పారిపోయారు. సుమారు ఐదు గంటలపాటు జేఆర్‌పురం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినా నిందితుల ఆచూకీ దొరకలేదు. అయితే బైక్ నడిపే విధానం, పరారైన తీరు చూస్తే చోరీల్లో ఆరితేరిన వారేనని, వాహనానికి నంబర్ ప్లేటు లేదని, దొంగిలించిన వాహనమై ఉంటుందని, ఛాసీ, ఇంజన్ నంబర్, బైక్ రూపురేఖలు విభిన్నంగా ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనపై రాత్రంతా రెక్కీ వేస్తామని తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వీ బాలకృష్ణ తెలిపారు. -
ప్రొద్దుటూరులో చైన్ స్నాచింగ్
ప్రొద్దుటూరు క్రైం : పట్టణంలోని మిట్టమడివీధిలో ఇందిరాదేవి అనే మహిళ మెడలో నుంచి ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు బంగారు గొలుసును లాక్కొని వెళ్లారు. వన్‌టౌన్ పోలీసుల కథనం మేరకు ఇందిరాదేవి దుకాణానికి వెళ్లి ఇంటికి వస్తుండగా గురువారం ఉదయం 10.30 గంటల సమయంలో ఇద్దరు వ్యక్తులు పల్సర్ బైక్‌లో వచ్చి గొలుసును లాక్కొని పారిపోయారు. ముందు వైపు కూర్చున్న వ్యక్తి హెల్మెట్ పెట్టుకొని ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆమె గట్టిగా కేకలు వేయగా నిందితులు బైక్‌లో పారిపోయారు. డీఎస్పీ శ్రీనివాసరావు, వన్‌టౌన్ సీఐ వెంకటశివారెడ్డి సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. బాధితురాలిని విచారించి వివరాలు సేకరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెంకటశివారెడ్డి తెలిపారు. నిందితుల ఫొటో విడుదల చేసిన పోలీసులు మిట్టమడివీధిలో సీసీ కెమెరా ఉండటంతో చైన్ స్నాచింగ్ దృశ్యాలు రికార్డు అయ్యాయి. పరిశీలించిన పోలీసులు నిందితుల ఫొటోను పత్రికలకు విడుదల చేశారు. వారిని ఎవరైనా గుర్తిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని సీఐ కోరారు. ఇక్కడ చైన్ స్నాచింగ్‌కు పాల్ప డ్డ వారు ఇతర ప్రాంతాల్లోనూ నేరాలు చేసే అవకాశం ఉందని సీఐ అన్నారు. -
నలుగురు గజదొంగలు అరెస్టు
విజయవాడ: ఇంటి దొంగతనాలు, బైకులు అపహరణ, స్నాచింగ్‌లకు పాల్పడే నలుగురు గజదొంగల ముఠాను సీసీఎస్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 18లక్షల విలువ చేసే చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. కమిషనరేట్‌లో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలొ నగర కమిషనర్ డి.గౌతం సవాంగ్ వివరాలు వెల్లడించారు. ఈనెల 14వ తేదీ పటమట హైస్కూల్ రోడ్డులో రైతుబజార్ వెనక మారుతీ కాలనీలో ఓ ఇంట్లో చోటుచేసుకున్న దొంగతనం కేసుకు సంబంధించి సీసీఎస్ పోలీసులు అతితక్కువ వ్యవధిలో నిందితులను అరెస్టు చేశారని తెలిపారు. ఈ కేసులో నలుగురు నిందితులను చిట్టీనగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా అదుపులోకి తీసుకుని విచారించగా వారు చేసిన నేరాలు బయటపడ్డాయని వివరించారు. నిందితులో కొందరు క్రికెట్ బెట్టింగ్ మాఫియాతోను, రాజకీయ పార్టీలకు ర్యాలీకు జనసమీకరణ చేస్తుంటారని చెప్పారు. అరెస్టయిన నిందితుల వివరాలు.. విశాఖపట్నానికి చెందిన చింతల పురుషోత్తం అలియాస్ అఖిల్, అచ్యుత్ (23) విజయవాడ కలరా హాస్పిటల్ సమీపంలో నివసించే మహతి బాలదుర్గా ప్రకాష్, అలియాస్ బాలు (20), చిట్టినగర్‌కు చెందిన షేక్ జానీ బాషా అలియాస్ జానీ (20), గుడివాడకు చెందిన నారగాని హరీష్ అలియాస్ బుడ్డి (22)లను అరెస్టు చేశారు. నిందితులు నలుగురు పటమటలో ఓ ఇంట్లో ప్రవేశించి బీరువాలో రూ.18 లక్షల విలువ చేసే 558 గ్రాముల బంగారం, 2.4 కిలోల వెండి, ల్యాప్‌టాప్, వీడియో కెమెరా, ఓ బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. నలుగురు యవకులే.. కాగా ఈ కేసులో పట్టుపడిన నలుగురు 25ఏళ్ల లోపు యవకులే. నాలుగైదేళ్లుగా నేరాలకు పాల్పడుతున్న నిందితులు జైల్లో పరిచయం అయి ఓ గ్యాంగ్‌గా ఏర్పడి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. కాగా నిందితులపై గతంలో విశాఖ, కృష్ణాజిల్లా, గుంటూరు, శ్రీకాకుళం జిల్లాల్లో 48కి పైగా నేరాలు¯న్నాయి. రాజకీయ ర్యాలీల్లో కొత్త కోణం కాగా వివిధ రాజకీయ పక్షాల నాయకులు బైక్ ర్యాలీలకు జన సమీకరణకు కొందరు దొంగలను కూడా ఉపయోగిస్తున్నట్లు పోలీసు దర్యాప్తులో తేలింది. ఈ కేసులో నిందితుడు బాలదుర్గాప్రకాష్ దొంగతనాలతో పాటు విజయవాడలో రాజకీయ పార్టీల బైక్ ర్యాలీకు జనసమీకరణ చేసి డబ్బు సంపాదిస్తున్నాడు. ర్యాలీల కోసం మనిషికి రూ., 200లు చొప్పున తీసుకుని బైక్ ర్యాలీలకు యువకులను పంపుతుంటాడు. -
అరగంటలో మూడు చైన్ స్నాచింగ్‌లు
థానే: చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. కేవలం అరగంట వ్యవధిలోనే మూడు చోట్ల మహిళ మెడల్లో గొలుసులు లాక్కుపోయారు. థానే జిల్లా అంబర్నాథ్ టౌన్ షిప్లో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. ఆదివారం రాత్రి ఏడు నుంచి ఏడున్నర గంటల మధ్య ఈ దోపిడీ ఘటనలు జరిగాయి. ఓ మహిళ(65) భర్తతో కలిసి రోడ్డు పక్కన నడిచి వెళ్తుండగా వెనుక నుంచి బైక్‌పై వచ్చిన దుండగులు ఆమె మెడలోని రూ.1.10 లక్షల విలువైన గొలుసును లాక్కుపోయారు. అదే ప్రాంతంలో ఓ గృహిణి(35) రోడ్డుపై వెళ్తుండగా బైక్‌పై వచ్చిన ఆగంతకులు ఆమె మెడలోని రూ.40 వేల విలువైన పుస్తెలతాడను తెంపుకుని పోయారు. అదేవిధంగా మరో మహిళ మెడలోని రూ. లక్ష విలువైన బంగారు గొలుసు ఎత్తుకుపోయారు. ఈ మూడు ఘటనల్లోనూ ఒక్కరే పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. అంబర్నాథ్ డివిజన్ శివాజీనగర్ పోలీసులు ఈ మేరకు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సీపీ ఫుటేజీల ఆధారంగా దుండగుల కోసం గాలింపు చేపట్టారు. -
చైన్ స్నాచింగ్ జరుగుతోందని హెల్మెట్ వద్దా?
-
చైన్ స్నాచింగ్ జరుగుతోందని హెల్మెట్ వద్దా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్‌లో హెల్మెట్ వాడకాన్ని ఎందుకు తప్పనిసరి చేయడం లేదో తెలుసా... గొలుసు దొంగతనాల (చైన్ స్నాచింగ్) కారణంగా!? చైన్ స్నాచింగ్‌కు, హెల్మెట్లకు సంబంధమేమిటని అంటారా... దొంగలు హెల్మెట్లు పెట్టుకుని బైక్‌లపై దూసుకువస్తూ గొలుసులు లాక్కెళుతున్నారు, అందుకే ద్విచక్రవాహనదారులు హెల్మె ట్లు ధరించాలన్న నిబంధనను కచ్చితంగా అమలు చేయడం లేదు! ఇది ఎవరో చెప్పింది కాదు.. సాక్షాత్తు హైకోర్టుకు పోలీసులు పరోక్షం గా వెల్లడించిన వివరణ ఇది. ఈ కారణం హాస్యాస్పదంగా ఉందంటూ... హైకోర్టు ధర్మాసనం విస్తుపోయింది. లక్ష మందిలో ఒకరో ఇద్దరో దొంగతనం చేస్తే.. అసలు హెల్మెట్ నిబంధననే అమలు చేయబోమంటే ఎలాగని ప్రశ్నించింది. హెల్మెట్ తప్పనిసరి నిబంధనను సక్రమంగా అమలు చేయని అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. మొత్తంగా చూస్తే తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ హెల్మెట్ నిబంధన సక్రమంగా అమలవుతున్న దాఖలాలు కనిపించడం లేదని పేర్కొంది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ... విచారణను జనవరి 21కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలె, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. చర్యలు తీసుకుంటున్నాం: ప్రభుత్వం హెల్మెట్ ధారణకు సంబంధించి మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 129ని అమలు చేసే విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని... ఆ నిబంధనను కచ్చితంగా అమలు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని రంగారెడ్డి జిల్లాకు చెందిన ఉడతనేని రామారావు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ధర్మాసనం సోమవారం కూడా విచారణ జరిపింది. హెల్మెట్ ధరించని వారిని ఆపి, జరి మానాలు విధిస్తున్న సందర్భాలు తమకు హైదరాబాద్‌లో ఎక్కడా కనిపించడం లేదని ఈ సం దర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది. దీనికి తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎ.సంజీవ్‌కుమార్ సమాధానమిస్తూ.. హెల్మెట్ ధరించని వారికి జరిమానా విధిస్తున్నామని, అదే పనిగా ఉల్లంఘనకు పాల్పడితే లెసైన్స్ రద్దుకు చర్యలు తీసుకుంటున్నామని కోర్టుకు చెప్పారు. కేంద్ర మోటారు వాహనాల చట్టం ప్రకారం హెల్మెట్ ధరించని వారికి రూ. 300 కంటే ఎక్కువగా జరిమానా విధించడానికి వీల్లేదని తెలిపారు. దీనిపై స్పందించిన ధర్మాస నం... అలా వసూలు చేస్తున్న జరిమానా సొమ్మంతా ఎక్కడకు వెళుతోందని ప్రశ్నిం చగా.. ఆ సొమ్ము రవాణాశాఖకు జమవుతోం దని సంజీవ్ చెప్పారు. దీనిపై అఫిడవిట్ దాఖలు చేయాలని రవాణాశాఖను ధర్మాసనం ఆదేశించింది. చైన్ స్నాచింగ్‌లు పెరిగిపోయాయి.. అనంతరం ప్రభుత్వ న్యాయవాది వాదనలను కొనసాగిస్తూ... జంట నగరాల్లో గొలుసు దొంగతనాలు పెరిగిపోతున్నాయని, హెల్మెట్ ధరించి గొలుసు దొంగతనాలు చేస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. గత శుక్ర, శనివారాల్లో నాలుగు చోట్ల ఇలా దొంగతనాలు జరిగాయని చెప్పారు. ఈ వివరణపై ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ‘‘పోలీసుల తరఫున మీరు చెబుతున్న ఈ కారణం హాస్యాస్పదంగా ఉంది. లక్షల మందిలో ఒకరిద్దరు హెల్మెట్ ధరించి దొంగతనాలు చేస్తున్నారంటూ హెల్మెట్ నిబంధనను అమలు చేయకపోతే ఎలా... మీ ఉద్దేశం ప్రకారం హెల్మెట్ వచ్చినప్పటి నుంచే గొలుసు దొంగతనాలు జరుగుతున్నాయా.. అసలు పోలీసులు చెబుతున్న ఈ కారణంతో మీరు ఏకీభవిస్తారా..?..’’ అని న్యాయవాదిని ప్రశ్నించింది. ఈ కారణంతో తానూ ఏకీభవించనని సం జీవ్ పేర్కొనగా... మరి గొలుసు దొంగతనాలను ఎందుకు ప్రస్తావించారని ప్రశ్నించింది. హెల్మెట్ నిబంధనను కఠినంగా అమలు చేయ ని అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని.. దీనికి సంబంధించి ఇప్పటివరకు ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశిం చింది. అనంతరం ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ స్పందన కోరగా... తమ రాష్ట్రంలో నవంబర్ 1 నుంచి హెల్మెట్ నిబంధనను అమలు చేస్తున్నామని ఏపీ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది డి.రమేష్ వివరించారు. దీంతో ధర్మాసనం విచారణను వచ్చే నెల 21కి వాయిదా వేసింది. -
రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు
హైదరాబాద్ : ఉదయం వేళల్లో ఇళ్ల వద్ద ఒంటరిగా ఉండే మహిళలనే చైన్ స్నాచర్లు తాజాగా టార్గెట్ చేస్తున్నారు. సోమవారం నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఈ రకమైన దోపిడీలు జరిగాయి. వివరాల్లోకి వెళ్తే.. ఇంటి ముందున్న చెట్టు పూలు కోస్తున్న ఓ వృద్ధురాలి మెడలో నుంచి గుర్తుతెలియని దుండగులు బంగారు గొలుసు లాక్కెళ్లిన సంఘటన వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎన్జీవోస్ కాలనీలో నివాసముండే కె.మనోహరి(65) సోమవారం ఉదయం 7 గంటల సమయంలో ఇంటి ముందు ఉన్న పూల చెట్టుకు పూలను తెంపుతోంది. ఆమె వద్దకు వెనుక నుంచి వచ్చిన ఓ గుర్తు తెలియని వ్యక్తి మెడలోని ఆరు తులాల బంగారు గొలుసును తెంపుకుని పారిపోయాడు. అక్కడికి కొద్ది దూరంలోనే ద్విచక్ర వాహనంపై సిద్ధంగా ఉన్న వ్యక్తితో కలసి క్షణాల్లో మాయమయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇంటి ముందు ముగ్గు వేస్తుండగా... ఇంటి ముందు ముగ్గు వేస్తున్న మహిళ మెడలోని గొలుసును బైకుపై వచ్చిన ఇద్దరు ఆగంతకులు లాక్కుని పరారైన సంఘటన సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కర్మన్‌ఘాట్ శుభోదయకాలనీలో నివాసముంటున్న పీవీటీ మార్కెట్ ఉద్యోగిని లక్ష్మి(42) సోమవారం ఉదయం ఇంటి ముందు ముగ్గు వేస్తోంది. అదే సమయంలో బైకుపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆమె వద్దకు వేగంగా వెళ్లి మెడలోని ఐదు తులాల బంగారు గొలుసును లాక్కుని పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
రెండు గంటల వ్యవధిలో 7 చైన్ స్నాచింగ్‌లు
గుంటూరు : గుంటూరులో చైన్‌స్నాచర్లు హల్చల్ చేస్తున్నారు. శనివారం రెండు గంటల వ్యవధిలో ఏడుగురు మహిళల మెడలో నుంచి బంగారు గొలుసులు లాక్కెళ్లారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. జిల్లా కేంద్రంలోని పట్టాభిపురం, అరండల్‌పేట పరిధిలో బైక్ పై వచ్చిన గుర్తుతెలియని దుండగులు మహిళల మెడల్లోని బంగారు గొలుసులను లాక్కెళ్లారు. ఈ వరుస చోరీలతో పోలీసులు ఉలిక్కిపడ్డారు. కాగా చోరీకి గురైన సొత్తు ఎంత అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. -
జల్సాల కోసం చోరీల బాట
♦ స్నాచింగ్స్‌కు పాల్పడుతున్న ముగ్గురు యువకులు ♦ నిందితుల్లో విశ్రాంత ఏఎస్పీ మనవడు నల్లకుంట : జల్సాలకు అలవాటుపడ్డ ముగ్గురు యువకులు చైన్ స్నాచింగ్స్‌కు పాల్పడుతున్నారు. నల్లకుంట పోలీసులు ముగ్గురినీ అరెస్టు చేసి 8 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఓ యువకుడు విశ్రాంత అదనపు ఎస్పీ మనవడని సమాచారం. మంగళవారం నల్లకుంట ఇన్స్పెక్టర్ ఎస్.సంతోశ్ కిరణ్ తెలిపిన వివరాల ప్రకారం... రామంతాపూర్‌కు చెందిన కారు డ్రైవర్ జి.నరేశ్(24), అంబర్‌పేటకు చెందిన వేదవ్యాస్(32), గోల్నాకకు చెందిన కృపాకర్(24) స్నేహితులు. జులాయిగా తిరిగే ముగ్గురూ మద్యానికి అలవాటుపడ్డారు. అవసరమైన డబ్బు కోసం కొంతకాలంగా చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతున్నారు. మంగళవారం ఉదయం రాంనగర్ గుండు వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. అదే సమయంలో అటుగా వచ్చిన నరేష్, వేదవ్యాస్, కృపాకర్లపై పోలీసులకు అనుమానం వచ్చి తనిఖీ చేయగా వారి వద్ద 8 తులాల బంగారు నగలు లభించాయి. బంగారం ఎక్కడిదని పోలీసులు ప్రశ్నించగా పొంతనలేని సమాధానం చెప్పారు. దీంతో ముగ్గురినీ స్టేషన్‌కు తీసుకెళ్లి తమదైన శైలిలో విచారించగా గొలుసు చోరీలకు పాల్పడుతున్నామని, చోరీ బంగారాన్ని సికింద్రాబాద్‌లోని పాట్ మార్కెట్లో విక్రయించేందుకు వెళ్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు అంబర్‌పేట పీఎస్ పరిధిలో రెండు, నల్లకుంట పీఎస్ పరిధిలో రెండు స్నాచింగ్స్‌కు పాల్పడ్డామని చెప్పారు. దీంతో పోలీసులు ముగ్గురినీ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుల్లో విశ్రాంత ఏఎస్పీ మనవడు? నిందితులు ముగ్గురిలో కృపాకర్ అనే యువకుడు గోల్నాకలో నివాసముండే ఓ విశ్రాంత అదనపు ఎస్పీ మనవడని, ఇతను దోమలగూడలోని ఏవీ కళాశాలలో డిగ్రీ వరకు చదివాడని విశ్వసనీయ సమాచారం. మరో నిందితుడు వేదవ్యాస్ కంప్యూటర్ హార్డ్‌వేర్ చేసి హైకోర్టులో ఓ న్యాయవాది వద్ద కాంట్రాక్ట్ ఉద్యోగం చేస్తున్నాడని తెలిసింది. ఈ ముగ్గురు నిందితులు గతంలో అంబర్‌పేట పీఎస్ పరిధిలో ఓ టీడీపీ నాయకుడి కారు దహనం కేసులో కూడా నిందితులని సమాచారం. స్నాచింగ్‌ల తీరు ఇదీ... ముగ్గురిలో ఇద్దరు బైక్‌పై వెళ్తూ చైన్ స్నాచింగ్‌కు పాల్పడతారు. మరో యువకుడు స్నాచర్స్ వాహనా న్ని అనుసరిస్తూ ఎవరైనా వెంబడిస్తున్నారా? అనే విషయాన్ని గమనిస్తుంటాడు. ఎవరైనా వెంబడిస్తున్నట్లు అనుమానం వస్తే వెంటనే చైన్స్నాచర్స్కు సమాచారమందిస్తాడు. మెరుపు వేగంతో స్నాచర్స్ తప్పించుకుంటారు. అనంతరం చోరీ సొత్తును విక్రయిస్తారు. వచ్చిన డబ్బులో కొంత జల్సాలకు, మరికొంత అప్పులు తీర్చడానికి వినియోగిస్తారని తెలిసింది. వృత్తి మెకానిక్... ప్రవృత్తి బైక్ చోరీలు భాగ్యనగర్‌కాలనీ: జల్సాల కోసం బైక్ చోరీలు చేస్తున్న ఓ మెకానిక్‌ను కూకట్పల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మంగళవారం డీఎస్ఐ క్రాంతి తెలిపిన వివరాల ప్రకారం...ఒడిశాకు చెందిన భుజంగరావు(23) కుత్బుల్లాపూర్‌లో మెకానిక్‌గా పని చేస్తున్నాడు. జల్సాలకు అలవాటుపడ్డ ఇతను బైక్ చోరీలు ప్రవృత్తిగా చేసుకున్నాడు. కూకట్పల్లి పరిధిలోని వేర్వేరు చోట్ల పార్కు చేసిన మూడు ద్విచక్రవాహనాలు ఎత్తుకెళ్లాడు. భుజంగరావు మంగళవారం చోరీ చేసిన వాహనంపై వెళ్తూ బాలాజీనగర్‌లో వాహన తనిఖీలు చేస్తున్న పోలీసులకు తారసపడ్డాడు. అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా మూడు బైక్‌లు చోరీ చేసినట్టు అంగీకరించాడు. పోలీసులు అతడి వద్ద నుంచి సుమారు రూ. 1.5 లక్షల విలువ చేసే మూడు బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం భుజంగరావును అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.