
రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు
హైదరాబాద్ : ఉదయం వేళల్లో ఇళ్ల వద్ద ఒంటరిగా ఉండే మహిళలనే చైన్ స్నాచర్లు తాజాగా టార్గెట్ చేస్తున్నారు. సోమవారం నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఈ రకమైన దోపిడీలు జరిగాయి. వివరాల్లోకి వెళ్తే..
ఇంటి ముందున్న చెట్టు పూలు కోస్తున్న ఓ వృద్ధురాలి మెడలో నుంచి గుర్తుతెలియని దుండగులు బంగారు గొలుసు లాక్కెళ్లిన సంఘటన వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎన్జీవోస్ కాలనీలో నివాసముండే కె.మనోహరి(65) సోమవారం ఉదయం 7 గంటల సమయంలో ఇంటి ముందు ఉన్న పూల చెట్టుకు పూలను తెంపుతోంది. ఆమె వద్దకు వెనుక నుంచి వచ్చిన ఓ గుర్తు తెలియని వ్యక్తి మెడలోని ఆరు తులాల బంగారు గొలుసును తెంపుకుని పారిపోయాడు. అక్కడికి కొద్ది దూరంలోనే ద్విచక్ర వాహనంపై సిద్ధంగా ఉన్న వ్యక్తితో కలసి క్షణాల్లో మాయమయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇంటి ముందు ముగ్గు వేస్తుండగా...
ఇంటి ముందు ముగ్గు వేస్తున్న మహిళ మెడలోని గొలుసును బైకుపై వచ్చిన ఇద్దరు ఆగంతకులు లాక్కుని పరారైన సంఘటన సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కర్మన్‌ఘాట్ శుభోదయకాలనీలో నివాసముంటున్న పీవీటీ మార్కెట్ ఉద్యోగిని లక్ష్మి(42) సోమవారం ఉదయం ఇంటి ముందు ముగ్గు వేస్తోంది. అదే సమయంలో బైకుపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆమె వద్దకు వేగంగా వెళ్లి మెడలోని ఐదు తులాల బంగారు గొలుసును లాక్కుని పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.