జల్సాల కోసం చోరీల బాట
♦ స్నాచింగ్స్‌కు పాల్పడుతున్న ముగ్గురు యువకులు
♦ నిందితుల్లో విశ్రాంత ఏఎస్పీ మనవడు
నల్లకుంట : జల్సాలకు అలవాటుపడ్డ ముగ్గురు యువకులు చైన్ స్నాచింగ్స్‌కు పాల్పడుతున్నారు. నల్లకుంట పోలీసులు ముగ్గురినీ అరెస్టు చేసి 8 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఓ యువకుడు విశ్రాంత అదనపు ఎస్పీ మనవడని సమాచారం. మంగళవారం నల్లకుంట ఇన్‌స్పెక్టర్ ఎస్.సంతోశ్ కిరణ్ తెలిపిన వివరాల ప్రకారం...
రామంతాపూర్‌కు చెందిన కారు డ్రైవర్ జి.నరేశ్(24), అంబర్‌పేటకు చెందిన వేదవ్యాస్(32), గోల్నాకకు చెందిన కృపాకర్(24) స్నేహితులు. జులాయిగా తిరిగే ముగ్గురూ మద్యానికి అలవాటుపడ్డారు. అవసరమైన డబ్బు కోసం కొంతకాలంగా చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతున్నారు. మంగళవారం ఉదయం రాంనగర్ గుండు వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. అదే సమయంలో అటుగా వచ్చిన నరేష్, వేదవ్యాస్, కృపాకర్‌లపై పోలీసులకు అనుమానం వచ్చి తనిఖీ చేయగా వారి వద్ద 8 తులాల బంగారు నగలు లభించాయి. బంగారం ఎక్కడిదని పోలీసులు ప్రశ్నించగా పొంతనలేని సమాధానం చెప్పారు.
దీంతో ముగ్గురినీ స్టేషన్‌కు తీసుకెళ్లి తమదైన శైలిలో విచారించగా గొలుసు చోరీలకు పాల్పడుతున్నామని, చోరీ బంగారాన్ని సికింద్రాబాద్‌లోని పాట్ మార్కెట్‌లో విక్రయించేందుకు వెళ్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు అంబర్‌పేట పీఎస్ పరిధిలో రెండు, నల్లకుంట పీఎస్ పరిధిలో రెండు స్నాచింగ్స్‌కు పాల్పడ్డామని చెప్పారు. దీంతో పోలీసులు ముగ్గురినీ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
నిందితుల్లో విశ్రాంత ఏఎస్పీ మనవడు?
నిందితులు ముగ్గురిలో కృపాకర్ అనే యువకుడు గోల్నాకలో నివాసముండే ఓ విశ్రాంత అదనపు ఎస్పీ మనవడని, ఇతను దోమలగూడలోని ఏవీ కళాశాలలో డిగ్రీ వరకు చదివాడని విశ్వసనీయ సమాచారం. మరో నిందితుడు వేదవ్యాస్ కంప్యూటర్ హార్డ్‌వేర్ చేసి హైకోర్టులో ఓ న్యాయవాది వద్ద కాంట్రాక్ట్ ఉద్యోగం చేస్తున్నాడని తెలిసింది. ఈ ముగ్గురు నిందితులు గతంలో అంబర్‌పేట పీఎస్ పరిధిలో ఓ టీడీపీ నాయకుడి కారు దహనం కేసులో కూడా నిందితులని సమాచారం.
స్నాచింగ్‌ల తీరు ఇదీ...
ముగ్గురిలో ఇద్దరు బైక్‌పై వెళ్తూ చైన్ స్నాచింగ్‌కు పాల్పడతారు. మరో యువకుడు స్నాచర్స్ వాహనా న్ని అనుసరిస్తూ ఎవరైనా వెంబడిస్తున్నారా? అనే విషయాన్ని గమనిస్తుంటాడు. ఎవరైనా వెంబడిస్తున్నట్లు అనుమానం వస్తే వెంటనే చైన్‌స్నాచర్స్‌కు సమాచారమందిస్తాడు. మెరుపు వేగంతో స్నాచర్స్ తప్పించుకుంటారు. అనంతరం చోరీ సొత్తును విక్రయిస్తారు. వచ్చిన డబ్బులో కొంత జల్సాలకు, మరికొంత అప్పులు తీర్చడానికి వినియోగిస్తారని తెలిసింది.
వృత్తి మెకానిక్... ప్రవృత్తి బైక్ చోరీలు
భాగ్యనగర్‌కాలనీ: జల్సాల కోసం బైక్ చోరీలు చేస్తున్న ఓ మెకానిక్‌ను కూకట్‌పల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మంగళవారం డీఎస్‌ఐ క్రాంతి తెలిపిన వివరాల ప్రకారం...ఒడిశాకు చెందిన భుజంగరావు(23) కుత్బుల్లాపూర్‌లో మెకానిక్‌గా పని చేస్తున్నాడు. జల్సాలకు అలవాటుపడ్డ ఇతను బైక్ చోరీలు ప్రవృత్తిగా చేసుకున్నాడు. కూకట్‌పల్లి పరిధిలోని వేర్వేరు చోట్ల పార్కు చేసిన మూడు ద్విచక్రవాహనాలు ఎత్తుకెళ్లాడు.
భుజంగరావు మంగళవారం చోరీ చేసిన వాహనంపై వెళ్తూ బాలాజీనగర్‌లో వాహన తనిఖీలు చేస్తున్న పోలీసులకు తారసపడ్డాడు. అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా మూడు బైక్‌లు చోరీ చేసినట్టు అంగీకరించాడు. పోలీసులు అతడి వద్ద నుంచి సుమారు రూ. 1.5 లక్షల విలువ చేసే మూడు బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం భుజంగరావును అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.