Bike robberies
-
ప్రియురాలి కోసం బైక్‌ల అపహరణ
కర్ణాటక , బనశంకరి:ప్రియురాలితో కలిసి బైక్‌ల అపహరణకు పాల్పడుతున్న వ్యక్తిని గురువారం కోరమంగల పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి రూ.6.15 లక్షల విలువైన పది బైక్‌లు స్వాధీనం చేసుకున్నట్లు ఆగ్నేయ విభాగం డీసీపీ బోరలింగయ్య తెలిపారు. కోరమంగల పోలీస్‌స్టేషన్ చుట్టుపక్కల ప్రాంతాల్లో బైక్ అపహరణలు తీవ్రతరం కావడంతో మడివాళ ఉపవిభాగ అసిస్టెంట్ కమిషనర్ సోమేగౌడ నేతృత్వంలో సీఐ మంజునాథ్‌తో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందం గురువారం బొమ్మనహళ్లి హొసపాళ్యకు చెందిన కార్తీక్‌ను అరెస్ట్ చేసి పది బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడికి ఓ ప్రియురాలు ఉంది. ఆమెకు బైక్‌లు అంటే ఇష్టం. దీంతో ఆమెను మెప్పించటానికి ఇతను బైక్‌లు అపహరణకు పాల్పడేవాడని పోలీసులు తెలిపారు. అనంతరం వాటిని విక్రయించి ఆ డబ్బుతో ఇద్దరు జల్సా చేసేవారని తెలిపారు. -
ఈ బాబు... మహా ముదురు బాబూ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధానికి చెందిన ఓ మైనర్.. బైకులతో స్టంట్స్ చేయడంలో ఎక్స్పర్ట్.. అందులో మరికొందరికి శిక్షణ కూడా ఇస్తుంటాడు.. మరో ముగ్గురు బాలురతో జట్టు కట్టాడు.. ఈ స్టంట్స్ చేయడానికి, రేసింగ్స్‌లో పాల్గొనడానికి అవసరమైన బైక్‌ల కోసం చోరీల బాట పట్టారు. వాటిలో పెట్రోల్ నింపుకోవడానికి మొబైల్ ఫోన్స్ దొంగతనం చేయడం మొదలుపెట్టారు. నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఈ ముఠాలోని నలుగురిని పట్టుకుని వారి గుట్టు రట్టుచేశారు. ‘సాహసాలు’అంటే మక్కువ.. హైదరాబాద్‌లోని సిద్ధార్థనగర్‌కు చెందిన 17 ఏళ్ల బాలుడు ఈసీఐఎల్‌లోని ఓ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. తండ్రి గతంలోనే మరణించగా.. తల్లి ఇళ్లల్లో పని చేసుకుంటూ కొడుకును పోషిస్తోంది. బైక్‌లు నడపటంలో పట్టున్న అతడికి.. స్టంట్స్ చేయడమంటే సరదా. స్నేహితుల వద్ద నుంచి తీసుకున్న బైక్‌లతో రోడ్లపై స్టంట్స్ చేస్తుంటాడు. కేబీఆర్ పార్క్ వద్ద రేసింగ్స్ చేసేవాడు. ఉప్పల్‌లోని భగాయత్ ల్యాండ్స్‌లో ప్రతి శని, ఆదివారాల్లో స్టంట్స్ చేయడంలో యువతకు ‘శిక్షణ’కూడా ఇచ్చేవాడు. ఈ నేపథ్యంలో ఇతడికి తమ ఏరియాలోనే ఉండే ముగ్గురు మైనర్లతో పరిచయం ఏర్పడింది. ఈ ముఠాకు అతగాడు గ్యాంగ్‌లీడర్‌గా మారాడు. స్టంట్స్ చేయడానికి స్పోర్ట్స్‌బైక్స్.. ఎప్పుడు కోరుకుంటే అప్పుడు స్టంట్స్ చేయాలంటే సొంతంగా స్పోర్ట్స్ బైక్ ఉండాలని సూత్రధారి భావించాడు. వాటిని ఖరీదు చేసే స్తోమత వారికి లేకపోవడంతో బైక్‌లను చోరీ చేయాలని పథకం వేశారు. ఇందుకు మరో ముగ్గురు మైనర్లనూ తమతో చేర్చుకున్నారు. వీరంతా కలసి గోల్కొండ, జూబ్లీహిల్స్ ప్రాంతాల నుంచి మూడు బైక్స్ చోరీ చేశారు. వీటిలో రెండు కేటీఎంలు కాగా, మరొకటి పల్సర్. వీటిపై తిరిగేందుకు కావాల్సిన పెట్రోల్ కోసం గోపాలపురం, మహంకాళి, ఎల్బీనగర్లలో సెల్ఫోన్లు దొంగతనం చేశారు. వీరు దొంగిలించిన బైకులకు తప్పుడు నంబర్ప్లేట్లు తగిలించి రోడ్డుపై వెళ్తున్న వారి నుంచి సెల్ఫోన్లు లాక్కుపోయేవారు. మల్కాజ్గిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో మరో రెండు ఫోన్లు దొంగతనం చేశారు. చిక్కినా చెప్పడు... ఈ గ్యాంగ్ సూత్రధారి అయిన మైనర్ చాలా ముదురు. పోలీసులకు చిక్కినా కూడా పూర్తి వివరాలు చెప్పేవాడు కాదు. రెండు సెల్ఫోన్లు దొంగిలించిన కేసులో మల్కాజ్గిరి పోలీసులు గత నెలలో మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. గతంలో చేసిన నేరాలకు సంబంధించి నోరు విప్పలేదు. గత నెల 18న సూత్రధారి సహా ముగ్గురు మైనర్లు ఓ వాహనంపై వచ్చి క్లాక్‌టవర్ వద్ద సెల్‌ఫోన్ దొంగిలించారు. దీనిపై గోపాలపురం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు కావడంతో నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దర్యాప్తు చేశారు. సీసీ కెమెరాల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా సూత్రధారిని గుర్తించారు. అతడి కదలికలపై ఆరా తీయగా.. వీకెండ్స్‌లో ఉప్పల్‌లోని భగాయత్‌లో, మామూలు రోజుల్లో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌ల్లో తిరుగుతున్నట్లు గుర్తించారు. నిఘా పెట్టిన పోలీసులు సూత్రధారితో పాటు నలుగురు మైనర్లను మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. -
నలుగురు గజదొంగలు అరెస్టు
విజయవాడ: ఇంటి దొంగతనాలు, బైకులు అపహరణ, స్నాచింగ్‌లకు పాల్పడే నలుగురు గజదొంగల ముఠాను సీసీఎస్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 18లక్షల విలువ చేసే చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. కమిషనరేట్‌లో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలొ నగర కమిషనర్ డి.గౌతం సవాంగ్ వివరాలు వెల్లడించారు. ఈనెల 14వ తేదీ పటమట హైస్కూల్ రోడ్డులో రైతుబజార్ వెనక మారుతీ కాలనీలో ఓ ఇంట్లో చోటుచేసుకున్న దొంగతనం కేసుకు సంబంధించి సీసీఎస్ పోలీసులు అతితక్కువ వ్యవధిలో నిందితులను అరెస్టు చేశారని తెలిపారు. ఈ కేసులో నలుగురు నిందితులను చిట్టీనగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా అదుపులోకి తీసుకుని విచారించగా వారు చేసిన నేరాలు బయటపడ్డాయని వివరించారు. నిందితులో కొందరు క్రికెట్ బెట్టింగ్ మాఫియాతోను, రాజకీయ పార్టీలకు ర్యాలీకు జనసమీకరణ చేస్తుంటారని చెప్పారు. అరెస్టయిన నిందితుల వివరాలు.. విశాఖపట్నానికి చెందిన చింతల పురుషోత్తం అలియాస్ అఖిల్, అచ్యుత్ (23) విజయవాడ కలరా హాస్పిటల్ సమీపంలో నివసించే మహతి బాలదుర్గా ప్రకాష్, అలియాస్ బాలు (20), చిట్టినగర్‌కు చెందిన షేక్ జానీ బాషా అలియాస్ జానీ (20), గుడివాడకు చెందిన నారగాని హరీష్ అలియాస్ బుడ్డి (22)లను అరెస్టు చేశారు. నిందితులు నలుగురు పటమటలో ఓ ఇంట్లో ప్రవేశించి బీరువాలో రూ.18 లక్షల విలువ చేసే 558 గ్రాముల బంగారం, 2.4 కిలోల వెండి, ల్యాప్‌టాప్, వీడియో కెమెరా, ఓ బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. నలుగురు యవకులే.. కాగా ఈ కేసులో పట్టుపడిన నలుగురు 25ఏళ్ల లోపు యవకులే. నాలుగైదేళ్లుగా నేరాలకు పాల్పడుతున్న నిందితులు జైల్లో పరిచయం అయి ఓ గ్యాంగ్‌గా ఏర్పడి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. కాగా నిందితులపై గతంలో విశాఖ, కృష్ణాజిల్లా, గుంటూరు, శ్రీకాకుళం జిల్లాల్లో 48కి పైగా నేరాలు¯న్నాయి. రాజకీయ ర్యాలీల్లో కొత్త కోణం కాగా వివిధ రాజకీయ పక్షాల నాయకులు బైక్ ర్యాలీలకు జన సమీకరణకు కొందరు దొంగలను కూడా ఉపయోగిస్తున్నట్లు పోలీసు దర్యాప్తులో తేలింది. ఈ కేసులో నిందితుడు బాలదుర్గాప్రకాష్ దొంగతనాలతో పాటు విజయవాడలో రాజకీయ పార్టీల బైక్ ర్యాలీకు జనసమీకరణ చేసి డబ్బు సంపాదిస్తున్నాడు. ర్యాలీల కోసం మనిషికి రూ., 200లు చొప్పున తీసుకుని బైక్ ర్యాలీలకు యువకులను పంపుతుంటాడు. -
ఇద్దరు మిత్రులు.. భలేదొంగలు
జగిత్యాలక్రైం: వారిద్దరూ మిత్రులు. జల్సా మోజులోపడ్డారు. సులభంగా డబ్బు సంపాదించేందుకు పెడదారిపట్టారు. పార్కింగ్ చేసిన ద్విచక్రవాహనాలను దొంగిలిస్తూ.. వాటిపై షికారు చేస్తూ జల్సా చేస్తున్నారు. మిత్రుల్లో ఒకరు ఇప్పటికే ఓ దొంగతనం కేసులో జైలుకెళ్లి వచ్చినా.. తన బుద్ధిని మాత్రం పోనిచ్చుకోలేదు. ఇటీవలే ఓ బైక్‌ను దొంగిలించి షికారు చేస్తుండగా పోలీసులకు చిక్కాడు. ఈ సంఘటన వివరాలను జగిత్యాల ఎస్పీ అనంతశర్మ తన క్యాంపు కార్యాలయంలో గురువారం వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. మల్యాల మండలం కొండగట్టు గ్రామానికి చెందిన ఉప్పు రమణారెడ్డి, గొల్లపల్లి మండలం రంగదామునిపల్లికి చెందిన కీర్తి కమలాకర్ మిత్రులు. ఇద్దరూ కలిసి దొంగతనాలకు అలవాటుపడ్డారు. రమణారెడ్డి వేములవాడ పోలీస్‌స్టేషన్ పరిధిలో రెండు ద్విచక్రవాహనాలు, వెల్గటూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ ద్విచక్రవాహానాన్ని చోరీ చేశాడు. వెల్గటూర్‌లో ఓ వ్యక్తి ఏటీఎం కేంద్రానికిరాగా.. అతడిని నమ్మించి కార్డుమార్చి రూ.1.40లక్షలు డ్రా చేసుకున్నాడు. వాటితో ఇద్దరు కలిసి జల్సా చేశారు. అలాగే కరీంనగర్ వన్‌టౌన్‌లో పరిధిలోనూ ఒక ద్విచక్రవాహనం, ధర్మారం, మల్యాల, జగిత్యాల టౌన్ పీఎస్ పరిధిలో ఒక్కో ద్విచక్రవాహనం చొప్పున మొత్తం ఆరు వాహనాలను దొంగిలించారు. ఓ వాహనంపై రమణారెడ్డి షికారు చేస్తూ.. గురువారం ఉదయం వెల్గటూర్ మండలం గుల్లకోట వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులకు పట్టుబడ్డాడు. అతడిని విచారించగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. విశాఖ పోలీసులకు చిక్కి.. గతంలో ఓ ద్విచక్రవాహనాన్ని దొంగిలించిన రమణారెడ్డి.. దానిపైనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం వెళ్లాడు. అక్కడ నంబర్‌ప్లేట్‌పై అనుమానం రావడంతో అక్కడి పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేశారు. ఈ కేసులో రమణారెడ్డి ఆర్నెల్లు జైలుకు కూడా వెళ్లాడు. తిరిగి వచ్చినా.. అతడిలో మార్పు రాలేదు. మళ్లీ ఆరు ద్విచక్రవాహనాలు దొంగిలించాడు. రమణారెడ్డితోపాటు కమలాకర్‌ను అరెస్టు చేసి ఆరు ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకున్న రూరల్ సీఐ శ్రీనివాస్‌చౌదరి, రూరల్ ఎస్సై కిరణ్‌కుమార్, వెల్గటూర్ ఎస్సై మహేందర్‌ను ఎస్పీ అనంతశర్మ అభినందించారు. -
యువకుడి అరెస్ట్.. 24 బైక్స్ స్వాధీనం
ఏలూరు(పశ్చిమగోదావరి): జల్సాలకు అలవాటుపడి దొంగతనాల బాటపట్టి ద్విచక్రవాహనాలను తస్కరిస్తున్న యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన మడగల విజయ్‌కుమార్ గత కొన్ని రోజులనుంచి బైక్ చోరీలకు పాల్పడుతున్నాడు. ఈక్రమంలో శుక్రవారం ఓ బైక్ అమ్మడానికి యత్నిస్తుండగా.. అనుమానం వచ్చిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. నిందితుడిని విచారించగా అసలు విషయాలు బయటకొచ్చాయి. అతని వద్ద నుంచి చోరీ చేసిన 24 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు రూ.12 లక్షల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. -
జల్సాల కోసం చోరీల బాట
♦ స్నాచింగ్స్‌కు పాల్పడుతున్న ముగ్గురు యువకులు ♦ నిందితుల్లో విశ్రాంత ఏఎస్పీ మనవడు నల్లకుంట : జల్సాలకు అలవాటుపడ్డ ముగ్గురు యువకులు చైన్ స్నాచింగ్స్‌కు పాల్పడుతున్నారు. నల్లకుంట పోలీసులు ముగ్గురినీ అరెస్టు చేసి 8 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఓ యువకుడు విశ్రాంత అదనపు ఎస్పీ మనవడని సమాచారం. మంగళవారం నల్లకుంట ఇన్స్పెక్టర్ ఎస్.సంతోశ్ కిరణ్ తెలిపిన వివరాల ప్రకారం... రామంతాపూర్‌కు చెందిన కారు డ్రైవర్ జి.నరేశ్(24), అంబర్‌పేటకు చెందిన వేదవ్యాస్(32), గోల్నాకకు చెందిన కృపాకర్(24) స్నేహితులు. జులాయిగా తిరిగే ముగ్గురూ మద్యానికి అలవాటుపడ్డారు. అవసరమైన డబ్బు కోసం కొంతకాలంగా చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతున్నారు. మంగళవారం ఉదయం రాంనగర్ గుండు వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. అదే సమయంలో అటుగా వచ్చిన నరేష్, వేదవ్యాస్, కృపాకర్లపై పోలీసులకు అనుమానం వచ్చి తనిఖీ చేయగా వారి వద్ద 8 తులాల బంగారు నగలు లభించాయి. బంగారం ఎక్కడిదని పోలీసులు ప్రశ్నించగా పొంతనలేని సమాధానం చెప్పారు. దీంతో ముగ్గురినీ స్టేషన్‌కు తీసుకెళ్లి తమదైన శైలిలో విచారించగా గొలుసు చోరీలకు పాల్పడుతున్నామని, చోరీ బంగారాన్ని సికింద్రాబాద్‌లోని పాట్ మార్కెట్లో విక్రయించేందుకు వెళ్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు అంబర్‌పేట పీఎస్ పరిధిలో రెండు, నల్లకుంట పీఎస్ పరిధిలో రెండు స్నాచింగ్స్‌కు పాల్పడ్డామని చెప్పారు. దీంతో పోలీసులు ముగ్గురినీ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుల్లో విశ్రాంత ఏఎస్పీ మనవడు? నిందితులు ముగ్గురిలో కృపాకర్ అనే యువకుడు గోల్నాకలో నివాసముండే ఓ విశ్రాంత అదనపు ఎస్పీ మనవడని, ఇతను దోమలగూడలోని ఏవీ కళాశాలలో డిగ్రీ వరకు చదివాడని విశ్వసనీయ సమాచారం. మరో నిందితుడు వేదవ్యాస్ కంప్యూటర్ హార్డ్‌వేర్ చేసి హైకోర్టులో ఓ న్యాయవాది వద్ద కాంట్రాక్ట్ ఉద్యోగం చేస్తున్నాడని తెలిసింది. ఈ ముగ్గురు నిందితులు గతంలో అంబర్‌పేట పీఎస్ పరిధిలో ఓ టీడీపీ నాయకుడి కారు దహనం కేసులో కూడా నిందితులని సమాచారం. స్నాచింగ్‌ల తీరు ఇదీ... ముగ్గురిలో ఇద్దరు బైక్‌పై వెళ్తూ చైన్ స్నాచింగ్‌కు పాల్పడతారు. మరో యువకుడు స్నాచర్స్ వాహనా న్ని అనుసరిస్తూ ఎవరైనా వెంబడిస్తున్నారా? అనే విషయాన్ని గమనిస్తుంటాడు. ఎవరైనా వెంబడిస్తున్నట్లు అనుమానం వస్తే వెంటనే చైన్స్నాచర్స్కు సమాచారమందిస్తాడు. మెరుపు వేగంతో స్నాచర్స్ తప్పించుకుంటారు. అనంతరం చోరీ సొత్తును విక్రయిస్తారు. వచ్చిన డబ్బులో కొంత జల్సాలకు, మరికొంత అప్పులు తీర్చడానికి వినియోగిస్తారని తెలిసింది. వృత్తి మెకానిక్... ప్రవృత్తి బైక్ చోరీలు భాగ్యనగర్‌కాలనీ: జల్సాల కోసం బైక్ చోరీలు చేస్తున్న ఓ మెకానిక్‌ను కూకట్పల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మంగళవారం డీఎస్ఐ క్రాంతి తెలిపిన వివరాల ప్రకారం...ఒడిశాకు చెందిన భుజంగరావు(23) కుత్బుల్లాపూర్‌లో మెకానిక్‌గా పని చేస్తున్నాడు. జల్సాలకు అలవాటుపడ్డ ఇతను బైక్ చోరీలు ప్రవృత్తిగా చేసుకున్నాడు. కూకట్పల్లి పరిధిలోని వేర్వేరు చోట్ల పార్కు చేసిన మూడు ద్విచక్రవాహనాలు ఎత్తుకెళ్లాడు. భుజంగరావు మంగళవారం చోరీ చేసిన వాహనంపై వెళ్తూ బాలాజీనగర్‌లో వాహన తనిఖీలు చేస్తున్న పోలీసులకు తారసపడ్డాడు. అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా మూడు బైక్‌లు చోరీ చేసినట్టు అంగీకరించాడు. పోలీసులు అతడి వద్ద నుంచి సుమారు రూ. 1.5 లక్షల విలువ చేసే మూడు బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం భుజంగరావును అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.