పట్టుకున్న వాహనాలు, నిందితులను చూపుతున్న ఎస్పీ
జగిత్యాలక్రైం: వారిద్దరూ మిత్రులు. జల్సా మోజులోపడ్డారు. సులభంగా డబ్బు సంపాదించేందుకు పెడదారిపట్టారు. పార్కింగ్ చేసిన ద్విచక్రవాహనాలను దొంగిలిస్తూ.. వాటిపై షికారు చేస్తూ జల్సా చేస్తున్నారు. మిత్రుల్లో ఒకరు ఇప్పటికే ఓ దొంగతనం కేసులో జైలుకెళ్లి వచ్చినా.. తన బుద్ధిని మాత్రం పోనిచ్చుకోలేదు. ఇటీవలే ఓ బైక్‌ను దొంగిలించి షికారు చేస్తుండగా పోలీసులకు చిక్కాడు. ఈ సంఘటన వివరాలను జగిత్యాల ఎస్పీ అనంతశర్మ తన క్యాంపు కార్యాలయంలో గురువారం వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. మల్యాల మండలం కొండగట్టు గ్రామానికి చెందిన ఉప్పు రమణారెడ్డి, గొల్లపల్లి మండలం రంగదామునిపల్లికి చెందిన కీర్తి కమలాకర్ మిత్రులు. ఇద్దరూ కలిసి దొంగతనాలకు అలవాటుపడ్డారు.
రమణారెడ్డి వేములవాడ పోలీస్‌స్టేషన్ పరిధిలో రెండు ద్విచక్రవాహనాలు, వెల్గటూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ ద్విచక్రవాహానాన్ని చోరీ చేశాడు. వెల్గటూర్‌లో ఓ వ్యక్తి ఏటీఎం కేంద్రానికిరాగా.. అతడిని నమ్మించి కార్డుమార్చి రూ.1.40లక్షలు డ్రా చేసుకున్నాడు. వాటితో ఇద్దరు కలిసి జల్సా చేశారు. అలాగే కరీంనగర్ వన్‌టౌన్‌లో పరిధిలోనూ ఒక ద్విచక్రవాహనం, ధర్మారం, మల్యాల, జగిత్యాల టౌన్ పీఎస్ పరిధిలో ఒక్కో ద్విచక్రవాహనం చొప్పున మొత్తం ఆరు వాహనాలను దొంగిలించారు. ఓ వాహనంపై రమణారెడ్డి షికారు చేస్తూ.. గురువారం ఉదయం వెల్గటూర్ మండలం గుల్లకోట వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులకు పట్టుబడ్డాడు. అతడిని విచారించగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
విశాఖ పోలీసులకు చిక్కి..
గతంలో ఓ ద్విచక్రవాహనాన్ని దొంగిలించిన రమణారెడ్డి.. దానిపైనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం వెళ్లాడు. అక్కడ నంబర్‌ప్లేట్‌పై అనుమానం రావడంతో అక్కడి పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేశారు. ఈ కేసులో రమణారెడ్డి ఆర్నెల్లు జైలుకు కూడా వెళ్లాడు. తిరిగి వచ్చినా.. అతడిలో మార్పు రాలేదు. మళ్లీ ఆరు ద్విచక్రవాహనాలు దొంగిలించాడు. రమణారెడ్డితోపాటు కమలాకర్‌ను అరెస్టు చేసి ఆరు ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకున్న రూరల్ సీఐ శ్రీనివాస్‌చౌదరి, రూరల్ ఎస్సై కిరణ్‌కుమార్, వెల్గటూర్ ఎస్సై మహేందర్‌ను ఎస్పీ అనంతశర్మ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment