నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న బంగారాన్ని చూపిస్తున్న సీపీ గౌతమ్ సావాంగ్ చిత్రంలో డీసీపీ కాంత్రి రాణా టాటా
విజయవాడ: ఇంటి దొంగతనాలు, బైకులు అపహరణ, స్నాచింగ్‌లకు పాల్పడే నలుగురు గజదొంగల ముఠాను సీసీఎస్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 18లక్షల విలువ చేసే చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. కమిషనరేట్‌లో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలొ నగర కమిషనర్ డి.గౌతం సవాంగ్ వివరాలు వెల్లడించారు. ఈనెల 14వ తేదీ పటమట హైస్కూల్ రోడ్డులో రైతుబజార్ వెనక మారుతీ కాలనీలో ఓ ఇంట్లో చోటుచేసుకున్న దొంగతనం కేసుకు సంబంధించి సీసీఎస్ పోలీసులు అతితక్కువ వ్యవధిలో నిందితులను అరెస్టు చేశారని తెలిపారు. ఈ కేసులో నలుగురు నిందితులను చిట్టీనగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా అదుపులోకి తీసుకుని విచారించగా వారు చేసిన నేరాలు బయటపడ్డాయని వివరించారు. నిందితులో కొందరు క్రికెట్ బెట్టింగ్ మాఫియాతోను, రాజకీయ పార్టీలకు ర్యాలీకు జనసమీకరణ చేస్తుంటారని చెప్పారు.
అరెస్టయిన నిందితుల వివరాలు..
విశాఖపట్నానికి చెందిన చింతల పురుషోత్తం అలియాస్ అఖిల్, అచ్యుత్ (23) విజయవాడ కలరా హాస్పిటల్ సమీపంలో నివసించే మహతి బాలదుర్గా ప్రకాష్, అలియాస్ బాలు (20), చిట్టినగర్‌కు చెందిన షేక్ జానీ బాషా అలియాస్ జానీ (20), గుడివాడకు చెందిన నారగాని హరీష్ అలియాస్ బుడ్డి (22)లను అరెస్టు చేశారు. నిందితులు నలుగురు పటమటలో ఓ ఇంట్లో ప్రవేశించి బీరువాలో రూ.18 లక్షల విలువ చేసే 558 గ్రాముల బంగారం, 2.4 కిలోల వెండి, ల్యాప్‌టాప్, వీడియో కెమెరా, ఓ బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు.
నలుగురు యవకులే..
కాగా ఈ కేసులో పట్టుపడిన నలుగురు 25ఏళ్ల లోపు యవకులే. నాలుగైదేళ్లుగా నేరాలకు పాల్పడుతున్న నిందితులు జైల్లో పరిచయం అయి ఓ గ్యాంగ్‌గా ఏర్పడి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. కాగా నిందితులపై గతంలో విశాఖ, కృష్ణాజిల్లా, గుంటూరు, శ్రీకాకుళం జిల్లాల్లో 48కి పైగా నేరాలు¯న్నాయి.
రాజకీయ ర్యాలీల్లో కొత్త కోణం
కాగా వివిధ రాజకీయ పక్షాల నాయకులు బైక్ ర్యాలీలకు జన సమీకరణకు కొందరు దొంగలను కూడా ఉపయోగిస్తున్నట్లు పోలీసు దర్యాప్తులో తేలింది. ఈ కేసులో నిందితుడు బాలదుర్గాప్రకాష్ దొంగతనాలతో పాటు విజయవాడలో రాజకీయ పార్టీల బైక్ ర్యాలీకు జనసమీకరణ చేసి డబ్బు సంపాదిస్తున్నాడు. ర్యాలీల కోసం మనిషికి రూ., 200లు చొప్పున తీసుకుని బైక్ ర్యాలీలకు యువకులను పంపుతుంటాడు.
Comments
Please login to add a commentAdd a comment