
బాధితురాలు అప్పలనర్సమ్మ
రణస్థలం:అత్తా అల్లుడు వెళ్తున్న బైక్‌ను సుమారు రెండు కిలోమీటర్ల మేర ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు వెంబడించి ఆమె మెడలోని బంగారు గొలుసు లాక్కుని పరారయ్యారు. ఈ విషయం తెలుసుకుని గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులను సైతం ముప్పుతిప్పలు పెట్టి చాకచక్యంగా తప్పించుకుపోయారు. సినీ ఫక్కీలో జరిగిన ఈ ఘటన మండలంలో కలకలం రేపింది. నిందితులు బైక్ వదిలి పరారయ్యారు. దానిపై నంబరు ప్లేటు లేకపోవడంతో గమనార్హం.
జేఆర్‌పురం పోలీసుల వివరాలు ప్రకారం... మండలంలోని దేవరాపల్లి గ్రామం నుంచి రావాడ వెళ్లేందుకు బుధవారం సాయంత్రం చందక అప్పలనర్సమ్మ ఆమె అల్లుడు కరిమజ్జి శంకర్ తన ఇద్దరు చిన్నపిల్లలతోపాటు ద్విచక్రవాహనంపై బయలుదేరారు. ఈ క్రమంలో కమ్మసిగడాం కూడలి నుంచి రెండు కిలోమీటర్లు వరకు గుర్తుతెలియని వ్యక్తులు పల్సర్ 200సీసీపై వెంబడించారు. కొండములగాం శ్మశానవాటిక సమీపానికి రాగానే అప్పలనర్సమ్మ మెడలో నుంచి హఠాత్తుగా రెండు తులాల బంగారు చైన్ లాక్కుకొని ఉడాయించారు. వారు వెనుకనే వెంబడించి రణస్థలం జాతీయ రహదారిపై ఉన్న జేఆర్‌పురం పోలీసులకు శంకర్ సమాచారమిచ్చాడు. హుటాహుటిన హైవే పెట్రోలింగ్ వాహనంపై జాతీయ రహదారిపై పోలీసులు వెంబడించారు. అయితే దుండగులు వీరిని ముప్పుతిప్పలు పెట్టారు. రణస్థలంలోని రామతీర్థాలు కూడలి నుంచి కోష్ట జంక్షన్ మధ్య రెండుమార్లు అటూ ఇటూ చక్కర్లు కొట్టించి చాకచక్యంగా తప్పించుకుపోయారు. కడ వరకు వెంబడించిన పోలీసులకు చెమటలు పట్టించారు. చివరకు రణస్థలం దగ్గర కొత్త పెట్రోల్ బంకు ఎదురుగా ఉన్న సీతంపేట గ్రామ సమీపంలో తోటపల్లి కాలువ వద్ద ద్విచక్ర వాహనాన్ని వదిలేసి తోటల్లోకి పారిపోయారు. సుమారు ఐదు గంటలపాటు జేఆర్‌పురం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినా నిందితుల ఆచూకీ దొరకలేదు.
అయితే బైక్ నడిపే విధానం, పరారైన తీరు చూస్తే చోరీల్లో ఆరితేరిన వారేనని, వాహనానికి నంబర్ ప్లేటు లేదని, దొంగిలించిన వాహనమై ఉంటుందని, ఛాసీ, ఇంజన్ నంబర్, బైక్ రూపురేఖలు విభిన్నంగా ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనపై రాత్రంతా రెక్కీ వేస్తామని తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వీ బాలకృష్ణ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment