సాక్షి, చెన్నై : హెల్మెట్ తప్పనిసరి వ్యవహారం బుధవారం హైకోర్టు పరిసరాల్లో రగడకు దారి తీసింది. హెల్మెట్ విషయంలో మదురై న్యాయవాదులపై కోర్టు ధిక్కార కేసు వివాదానికి దారి తీసింది. ఏకంగా బస్సుల్లో తరలివచ్చిన న్యాయవాదులు హైకోర్టు ముట్టడికి యత్నించారు. ఎన్‌ఎస్‌సీ బోస్ రోడ్డులో రాస్తారోకోకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. త్వరలో అవినీతి న్యాయమూర్తుల వివరాల్ని గవర్నర్‌కు అందిస్తామని న్యాయవాద సంఘాల నాయకులు హెచ్చరించడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో ద్విచక్ర వాహనాదారులకు హెల్మెట్ తప్పనిసరి చేస్తూ హైకోర్టు న్యాయమూర్తి కృపాకరణ్ రెండు నెలల క్రితం తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే.
దీంతో హెల్మెట్లు తప్పనిసరి అయ్యాయి. హెల్మెట్ల ధరలు ఆకాశాన్ని అంటి , ఇప్పుడిప్పుడే దిగి వచ్చాయి. అదే సమయంలో హెల్మెట్ వాడకం వ్యవహారంలో పలు పిటిషన్లు కోర్టుల్లో విచారణలో ఉన్నాయి. ఈసమయంలో న్యాయవాదులకు తమకు మినహాయింపు ఇవ్వాలని, అలాగే హెల్మెట్ తప్పనిసరి చేస్తూ విధించిన కొన్ని నిబంధనల్ని సడలించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేస్తూ వస్తున్నారు. మద్రాసు హైకోర్టు, మదురై ధర్మాసనంలో ఉన్న న్యాయవాదులు ఏకంగా పోరు బాట పట్టారు. వీరి ఆందోళనలతో విధులకు ఆటంకాలు నెల కొంటూ వస్తున్నాయి. దీంతో ఆలస్యంగా స్పందించిన మద్రాసు హైకోర్టు అక్కడి న్యాయవాదుల తీరును తీవ్రంగా ఖండించింది.
అలాగే, అక్కడి న్యాయవాద సంఘం నాయకులు ధర్మరాజ్, రామస్వామిలతో పాటు ఐదుగురిపై కే సు నమోదుకు ఆదేశిస్తూ, విచారణను సుమోటోగా స్వీకరించింది. దీనిపై న్యాయవాదుల్లో ఆగ్రహం పెల్లుబిక్కాయి. వీరికి మద్దతుగా కొన్ని చోట్ల న్యాయవాదులు కదిలారు. హైకోర్టు ముట్టడి : తమ మీద కోర్టు ధిక్కార కేసు నమోదు కావడంతో మదురైలోని న్యాయవాదుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. బుధవారం ఈ కేసు విచారణకు రావడంతో హైకోర్టును ముట్టడించి తమ నిరసన తెలియజేయడానికి సిద్ధమయ్యారు. మదురై నుంచి మూడు బస్సుల్లో రెండు వందల మందికి పైగా న్యాయవాదులు చెన్నైకు బయలు దేరిన సమాచారంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. హైకోర్టు పరిసరాల్లోని అన్ని మార్గాల్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. భద్రతను కట్టుదిట్టం చేశారు. ఉదయం నుంచి హైకోర్టులోకి వచ్చే ప్రతి ఒక్కర్నీ తనిఖీల అనంతరం అనుమతించారు.
హెల్మెట్ రగడ : మదురై నుంచి ప్రైవేటు ట్రావెల్స్‌ల్లో వచ్చిన న్యాయవాదులు ఆ బస్సులతో నేరుగా హైకోర్టులోని ఆవిన్ గేట్ వద్దకు చేరుకుని లోనికి చొరబడ్డారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకునేందుకు శ్రమించాల్సి వచ్చింది. చివరకు న్యాయవాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎన్‌ఎస్‌సీ బోసు రోడ్డులో రాస్తారోకోకు దిగడంతో వాహనాల రాక పోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. గత అనుభవాల దృష్ట్యా, న్యాయవాదులతో వివాదానికి వెళ్లకుండా వారిని బుజ్జగించేందుకు పోలీసులు తీవ్రంగానే శ్రమించాల్సి వచ్చింది. అదే సమయంలో న్యాయవాదుల తీరుపై కోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయడంతో కాస్త వెనక్కి తగ్గక తప్పలేదు. దీంతో న్యాయవాదులు బార్ కౌన్సిల్ వైపుగా కదిలారు. ఈసందర్భంగా మదురై న్యాయవాద సంఘం నేత రామస్వామి మీడియాతో మాట్లాడుతూ, తాము పారిశ్రామికవేత్తల్ని బెదిరించి ప్రైవేటు బస్సుల ద్వారా ఇక్కడికి వచ్చామని న్యాయ వర్గాలు ఆరోపించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
అవినీతి న్యాయమూర్తులు ఎందరో ఉన్నారని, వారి గురించి తామెప్పుడైనా నోరు విప్పామా..? అని ప్రశ్నించారు. త్వరలో రాష్ర్ట గవర్నర్‌ను కలవబోతున్నామని, ఇక్కడున్న అవినీతి న్యాయమూర్తుల వివరాల్ని అందజేసి చర్యకు డిమాండ్‌చేయబోతున్నామంటూ న్యాయ విభాగంలో అవినీతిని ఎత్తి చూపుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. మధ్యాహ్నం కోర్టు ధిక్కార కేసు న్యాయమూర్తులు సీటీ సెల్వన్, తమిళ్‌వానన్ నేతృత్వంలోని బెంచ్ ముందుకు విచారణకు రావడంతో ఎలాంటి ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యగా హైకోర్టు పరిసరాల్లో భారీ భద్రతా ఏర్పాట్లును పోలీసు యంత్రాంగం చేసింది. ఇక, కోర్టు పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్ ఆదేశాలు జారీ చేయక తప్పలేదు.
హెల్మెట్ రగడ
Published Thu, Sep 17 2015 4:13 AM | Last Updated on Mon, Oct 8 2018 4:05 PM
Advertisement