సురక్షిత ప్రయాణానికి హెల్మెట్ తప్పనిసరి
నగరంపాలెం(గుంటూరు) : ద్విచక్రవాహనంపై సురక్షితంగా ప్రయాణం చేయాలంటే హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని జిల్లా ఉప రవాణా కమిషనరు రాజారత్నం అన్నారు. రవాణాశాఖ ఆధ్యర్యంలో ద్విచక్రవాహనదారులకు హెల్మెట్ వాడకం పై నిర్వహించిన అవగాహన ర్యాలీని మంగళవారం ఆయన జెండా ఊపి ప్రారంభించారు. వాహనప్రమాదంలో మరణిస్తున్న వారిలో ద్విచక్ర వాహనంపై హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్నవారే 80 శాతం ఉన్నారన్నారు. రవాణా కమిషనరు ఆదేశానుసారం నవంబరు మెదటి తేదీ నుంచి ద్విచక్రవాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నరు.
రవాణా శాఖ వాహనదారుల భద్రత కోసం రూపొందించిన నిబంధనలు నిర్లక్ష్యంగా పాటించకపోతే వారి ప్రాణాలకే ప్రమాదం జరిగే అవకాశం ఉందన్నారు. ట్రాఫిక్ డీఎస్పీ కండె శ్రీనివాసులు మాట్లాడుతూ జరిమానాలకు భయపడి కాకుండా ప్రమాదాల బారిన పడకుండా ఉండేదుకు హెల్మెట్ వాడాలన్నారు. ప్రాంతీయ రవాణా శాఖ అధికారి రామస్వామి, మోటర్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లు ఉమామహేశ్వరరావు, సుధాకరరెడ్డి తదితరులు వంద వాహనాలతో నగరంలో ర్యాలీ నిర్వహించారు.