విజయనగరం క్రైం, న్యూస్‌లైన్ : ద్విచక్ర వాహన చోదకులు హెల్మెట్‌ను ధరించి ప్రాణ రక్షణ పొందాలని జిల్లా ఎస్పీ తఫ్సీర్ ఇక్బాల్ సూచించారు. రహదారి భద్రతా వారోత్సవాలను పురస్కరించుకుని విజయనగర పట్టణ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో హెల్మెట్ ధరించడం వల్ల కలిగే ఉపయోగాలను వివరించారు. ఈ సందర్భంగా వివిధ రకాల హోర్డింగ్ (ప్లెక్సీ), బ్యానర్‌లను ఆయన ప్రారంభించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ద్విచక్ర వాహనాలతో పాటు, ఆటోలు, లారీలు, ట్రాక్టర్ల వల్ల ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు.
ద్విచక్ర వాహన చోదకులు హెల్మెట్ ధరించడం వల్ల ప్రమాదాలు సంభవించినపుడు ప్రాణాలతో బయటపడడంతో పాటు కాలుష్యం బారి నుంచి బయట పడతారన్నారు. 25వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలను పురస్కరిం చుకుని జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో ప్రజలకు, వాహనచోదకులకు, విద్యార్థులకు అవగాహన కల్పించడానికి ర్యాలీలను నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ విభాగం ఆధ్వర్యంలో వారం రోజులపాటు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు వివరించారు. వాహనచోదకులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రమాదాల నివారణకు కృషి చేయాలన్నారు. వాహనాల సంఖ్య గణనీయంగా పెరిగిందని, అతి వేగంగా వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు.
రవాణాకు మాత్రమే ఉపయోగించాల్సిన వాహనాల్లో ప్రయాణికులను తరలించడం, హెడ్‌లైట్లు, సిగ్నల్ లైట్లు సరిగ్గా పనిచేయకపోవడం ప్రమాదాలకు కారణంగా గుర్తించామన్నారు. ప్రమాదాలను నియంత్రించేందుకు నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డీఎస్పీ ఎస్.శ్రీనువాస్ మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనలకు సంబంధించిన హోర్డింగ్‌లను పట్టణంలో ముఖ్య కూడళ్లలోను, జన సంచారం అధికంగా ఉన్న ప్రదేశాల్లో ఏర్పాటు చేసి తద్వారా ప్రజలకు ట్రాఫిక్ గుర్తులపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సీఐ ఎ.రవికుమార్, ఒకటో పట్టణ సీఐ ఎ.రవికుమార్, స్పెషల్ బ్రాంచ్ సీఐ ఎ.వి.లీలారావు, ఆర్.ఐ పి.నాగేశ్వరరావు, ట్రాఫిక్ ఎస్‌ఐ వి.ఎన్.మూర్తి తదితరులు పాల్గొన్నారు.
హెల్మెట్‌తో ప్రాణ రక్షణ
Published Tue, Jan 14 2014 1:30 AM | Last Updated on Sat, Sep 2 2017 2:36 AM
Advertisement