ప్రార్థించే పెదవుల కన్నా.. | Helping Hands Mana Nestham Trust In Vepadu | Sakshi
Sakshi News home page

సాయానికి వీరు ముందుంటారు.

Published Wed, Aug 7 2019 9:02 AM | Last Updated on Wed, Aug 7 2019 9:02 AM

Helping Hands Mana Nestham Trust In Vepadu - Sakshi

మన నేస్తం చారిటబుల్‌ ట్రస్ట్‌ లోగో

‘మాట్లాడే పెదవుల కన్నా.. సాయం చేసే చేతులే మిన్న’ సూక్తిని ఆదర్శంగా తీసుకున్నారు. త్రికరణశుద్ధిగా ఆచరిస్తున్నారు. ఉన్న దాంట్లో కొంత పేదలకు పంచుతున్నారు. అనారోగ్య బాధితులకు ఆసరా అందిస్తున్నారు. సేవా కార్యక్రమాలతో పేదల హృదయాల్లో నిలిచిపోతున్నారు. నలుగురికీ స్ఫూర్తినిస్తున్నారు.. వేపాడ మండలం బానాది గ్రామానికి చెందిన హెల్పింగ్‌ హేండ్స్‌ మన నేస్తం ట్రస్ట్‌ నిర్వాహకులు.

చేయి చేయి కలిపి..
బానాది గ్రామంలో 2010 ఏప్రిల్‌లో ప్రభుత్వ, ప్రైవేటు, వ్యాపార, వ్యవసాయం తదితర వృత్తులపై ఆధారపడిన ఇరవై మంది సభ్యులతో కలసి ‘హెల్పింగ్‌ హేండ్స్‌ మన నేస్తం ట్రస్ట్‌’ను ఏర్పాటు చేసుకున్నారు. ట్రస్ట్‌ అధ్యక్షునిగా కర్రి వి.ఆర్‌.సన్యాసినాయుడిని ఎన్నుకున్నారు. నాటి నుంచి ట్రస్ట్‌ సభ్యులు ప్రతి నెలా కొంత ధనం వెచ్చించి సేవా కార్యక్రమాలపై దృష్టి సారించారు. ట్రస్ట్‌ ద్వారా అందిస్తున్న సేవా కార్యక్రమాలకు ఆకర్షితులై మరికొందరు సేవా దృక్పథంతో ట్రస్ట్‌ సభ్యులుగా చేరటంతో ప్రస్తుతం 85 మంది సభ్యులతో నడుస్తోంది. ట్రస్ట్‌ పేరుతో ఏదో సేవా కార్యక్రమం చేసి చేతులు దులిపేసుకోకుండా.. సొంత సొమ్ము వెచ్చించి ప్రతినెలా పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తూ సేవా కార్యక్రమాలను అందిస్తున్నారు.

ప్రతి నెల పేదలకు సరుకులు
హెల్పింగ్‌ హేండ్స్‌ మన నేస్తం ట్రస్ట్‌ సభ్యులు బానాది పరిసర గ్రామాలకు చెందిన నిజమైన నిరుపేదలను 88 మందిని ఎంపిక చేసుకుని ప్రతి నెలా సరుకులను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. బానాది, ఎం.శింగవరం, బల్లంకి, అంకాజోస్యులపాలెం, ఎ.భీమవరం, ఆతవ, వేపాడ, వల్లంపూడి, రెడ్డిపాలెం, లచ్చంపేట, పోతంపేట, దేవాడ తదితర గ్రామాలకు చెందిన 88 నిరుపేదలకు ప్రతి నెలా శనగపప్పు, ఆయిల్‌ ప్యాకెట్, ఉల్లిపాయలు, ఎండుమిర్చి, ఉప్పు, పిండి తదితర నిత్యావసర వస్తువులను గ్రామంలో రామాలయం వద్ద అందజేస్తున్నారు. నేటికి ఎనిమిదేళ్లుగా సేవాభావంతో పేదలకు నిరాటంకంగా సరుకులు అందిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.

పండగ రోజు పేదలకు వస్త్రాలు
ఏటా సంక్రాంతికి ఎంపిక చేసిన పేదలు 100 మందికి బట్టలు పంపిణీ చేస్తున్నారు. పండగ రోజు నూతన వస్త్రాలతో ఆనందంగా గడపాలన్న ధ్యేయంతో ట్రస్ట్‌ సభ్యులు నిరుపేదలకు బట్టలు ఇస్తున్నారు. ఏటా బానాది పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు నోట్‌ పుస్తకాలు అందిస్తూ విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారు.

అనారోగ్య బాధితులకు అండ
పేదలెవరైనా అనారోగ్యంతో బాధపడుతున్నారన్న సమచారం తెలిస్తే ట్రస్ట్‌ సభ్యులు తామున్నామంటూ ఆర్థిక సహాయం అందిస్తూ ఆదుకుంటున్నారు. ఈ సేవలకు ఎవరివద్ద ఎలాంటి నిధులు సేకరించకుండా ట్రస్ట్‌ సభ్యులు ప్రతి నెలా తమ సంపాదనలో వీలైనంత కేటాయిస్తున్నారు. మండలంలో బొద్దాం, ఓబలయ్యపాలెం, అంకాజోస్యులపాలెం తదితర గ్రామాల్లోని ట్రస్ట్‌ సభ్యులు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించటం, పేదలకు దుస్తుల పంపిణీ తదితర సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. 
– వేపాడ (శృంగవరపుకోట)

సేవాభావంతోనే..
మేమంతా రైతు కుటుంబాలకు చెందినవారం. భగవంతుని దయ వల్ల మాకు ఉపాధి కలిగింది. మా సంపాదనలో ఎంతో కొంత కేటాయించి పేదలకు సహాయపడాలన్న లక్ష్యంతో ట్రస్ట్‌ను ఏర్పాటు చేశాం. గ్రామానికి చెందిన 50 మంది సభ్యులతోపాటు మా స్నేహితులు మరో 40 మంది సేవా కార్యక్రమాలు చూసి ట్రస్ట్‌కు సహాయ సహకారాలు అందిస్తున్నారు. 
– కె.వి.ఆర్‌.సన్యాసినాయుడు, అధ్యక్షుడు, మన నేస్తం ట్రస్ట్, బానాది, వేపాడ

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/2

ప్రమాదంలో కాలు విరిగి చికిత్స పొందుతున్న దమ్ము రమేష్‌ తల్లికి ఆర్థిక సహాయం అందిస్తున్న ట్రస్ట్‌ సభ్యులు

2
2/2

నిత్యావసర సరుకులు పేదలకు అందిస్తున్న ట్రస్ట్‌ సభ్యులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement