helping hands association
-
ప్రార్థించే పెదవుల కన్నా..
‘మాట్లాడే పెదవుల కన్నా.. సాయం చేసే చేతులే మిన్న’ సూక్తిని ఆదర్శంగా తీసుకున్నారు. త్రికరణశుద్ధిగా ఆచరిస్తున్నారు. ఉన్న దాంట్లో కొంత పేదలకు పంచుతున్నారు. అనారోగ్య బాధితులకు ఆసరా అందిస్తున్నారు. సేవా కార్యక్రమాలతో పేదల హృదయాల్లో నిలిచిపోతున్నారు. నలుగురికీ స్ఫూర్తినిస్తున్నారు.. వేపాడ మండలం బానాది గ్రామానికి చెందిన హెల్పింగ్ హేండ్స్ మన నేస్తం ట్రస్ట్ నిర్వాహకులు. చేయి చేయి కలిపి.. బానాది గ్రామంలో 2010 ఏప్రిల్‌లో ప్రభుత్వ, ప్రైవేటు, వ్యాపార, వ్యవసాయం తదితర వృత్తులపై ఆధారపడిన ఇరవై మంది సభ్యులతో కలసి ‘హెల్పింగ్ హేండ్స్ మన నేస్తం ట్రస్ట్’ను ఏర్పాటు చేసుకున్నారు. ట్రస్ట్ అధ్యక్షునిగా కర్రి వి.ఆర్.సన్యాసినాయుడిని ఎన్నుకున్నారు. నాటి నుంచి ట్రస్ట్ సభ్యులు ప్రతి నెలా కొంత ధనం వెచ్చించి సేవా కార్యక్రమాలపై దృష్టి సారించారు. ట్రస్ట్ ద్వారా అందిస్తున్న సేవా కార్యక్రమాలకు ఆకర్షితులై మరికొందరు సేవా దృక్పథంతో ట్రస్ట్ సభ్యులుగా చేరటంతో ప్రస్తుతం 85 మంది సభ్యులతో నడుస్తోంది. ట్రస్ట్ పేరుతో ఏదో సేవా కార్యక్రమం చేసి చేతులు దులిపేసుకోకుండా.. సొంత సొమ్ము వెచ్చించి ప్రతినెలా పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తూ సేవా కార్యక్రమాలను అందిస్తున్నారు. ప్రతి నెల పేదలకు సరుకులు హెల్పింగ్ హేండ్స్ మన నేస్తం ట్రస్ట్ సభ్యులు బానాది పరిసర గ్రామాలకు చెందిన నిజమైన నిరుపేదలను 88 మందిని ఎంపిక చేసుకుని ప్రతి నెలా సరుకులను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. బానాది, ఎం.శింగవరం, బల్లంకి, అంకాజోస్యులపాలెం, ఎ.భీమవరం, ఆతవ, వేపాడ, వల్లంపూడి, రెడ్డిపాలెం, లచ్చంపేట, పోతంపేట, దేవాడ తదితర గ్రామాలకు చెందిన 88 నిరుపేదలకు ప్రతి నెలా శనగపప్పు, ఆయిల్ ప్యాకెట్, ఉల్లిపాయలు, ఎండుమిర్చి, ఉప్పు, పిండి తదితర నిత్యావసర వస్తువులను గ్రామంలో రామాలయం వద్ద అందజేస్తున్నారు. నేటికి ఎనిమిదేళ్లుగా సేవాభావంతో పేదలకు నిరాటంకంగా సరుకులు అందిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. పండగ రోజు పేదలకు వస్త్రాలు ఏటా సంక్రాంతికి ఎంపిక చేసిన పేదలు 100 మందికి బట్టలు పంపిణీ చేస్తున్నారు. పండగ రోజు నూతన వస్త్రాలతో ఆనందంగా గడపాలన్న ధ్యేయంతో ట్రస్ట్ సభ్యులు నిరుపేదలకు బట్టలు ఇస్తున్నారు. ఏటా బానాది పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు నోట్ పుస్తకాలు అందిస్తూ విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారు. అనారోగ్య బాధితులకు అండ పేదలెవరైనా అనారోగ్యంతో బాధపడుతున్నారన్న సమచారం తెలిస్తే ట్రస్ట్ సభ్యులు తామున్నామంటూ ఆర్థిక సహాయం అందిస్తూ ఆదుకుంటున్నారు. ఈ సేవలకు ఎవరివద్ద ఎలాంటి నిధులు సేకరించకుండా ట్రస్ట్ సభ్యులు ప్రతి నెలా తమ సంపాదనలో వీలైనంత కేటాయిస్తున్నారు. మండలంలో బొద్దాం, ఓబలయ్యపాలెం, అంకాజోస్యులపాలెం తదితర గ్రామాల్లోని ట్రస్ట్ సభ్యులు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించటం, పేదలకు దుస్తుల పంపిణీ తదితర సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. – వేపాడ (శృంగవరపుకోట) సేవాభావంతోనే.. మేమంతా రైతు కుటుంబాలకు చెందినవారం. భగవంతుని దయ వల్ల మాకు ఉపాధి కలిగింది. మా సంపాదనలో ఎంతో కొంత కేటాయించి పేదలకు సహాయపడాలన్న లక్ష్యంతో ట్రస్ట్‌ను ఏర్పాటు చేశాం. గ్రామానికి చెందిన 50 మంది సభ్యులతోపాటు మా స్నేహితులు మరో 40 మంది సేవా కార్యక్రమాలు చూసి ట్రస్ట్‌కు సహాయ సహకారాలు అందిస్తున్నారు. – కె.వి.ఆర్.సన్యాసినాయుడు, అధ్యక్షుడు, మన నేస్తం ట్రస్ట్, బానాది, వేపాడ -
క్యాన్సర్‌తో పోరాడుతున్న యువకుడు
శ్రీకాకుళం, మందస: రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం వారిది. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివించారు. కుమారుడు ప్రయోజకుడై ఉద్దరిస్తాడని భావించారు. ఆ యువకుడు క్యాన్సర్ మహమ్మారి బారిన పడి పోరాడుతున్నాడు. మందస మండలంలోని పిడిమందస గ్రామానికి చెందిన శిస్టు రామ్మూర్తి, జయమ్మ దంపతులు కూలి పనులు చేసుకుని బతుకుతున్నారు. వీరికి పూర్ణచంద్రరావు, గిరి అనే ఇద్దరు కుమారులున్నారు. చిన్న కుమారుడు గిరి బీఈడీ కూడా పూర్తి చేశారు. ఇంటి వద్ద ఉంటే ఉద్యోగాలు రావని విజయనగరంలో ఉంటూ పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్నాడు. ఈ సమయంలో బాగులేకపోవడంతో చికిత్స తీసుకున్నాడు. లివర్ క్యాన్సర్‌గా వైద్యులు నిర్ధారించారు. నిండా పాతికేళ్లు కూడా నిండని గిరికి క్యాన్సర్ సోకిందని తెలియడంతో తల్లిదండ్రులతోపాటు గ్రామస్తులు కూడా నివ్వెరపోయారు. ప్రస్తుతం గిరికి క్యాన్సర్ చికిత్స జరుగుతోంది. తల్లిదండ్రులు ఉన్న కొద్దిపాటి పొలం విక్రయించి రూ.2లక్షల వరకు వైద్యానికి ఖర్చుపెట్టారు. మరో రూ.5లక్షలు అవసరమని వైద్యులు చెప్పడంతో ఆ తల్లిదండ్రులకు అల్లాడుతున్నారు. ఆస్పత్రిలో కుమారుడి పరిస్థితి చూసి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. దాతల సాయం చేస్తే గిరి బతుకుతాడని ఆశిస్తున్నారు. ఎస్బీఐ ఖాతా నంబర్ 11691928972 (ఐఎఫ్ఎస్సీ కోడ్: ఎస్బిఐఎన్ 0003121)కు దాతలు డబ్బులు జమ చేయాలని స్నేహితులు కోరారు. -
కొత్తేడాది నాడు మానవత్వం చాటుకున్న యువకులు
సాక్షి, హైదరాబాద్ : కొత్త సంవత్సరం పలువురు యువకులు మావనత్వం చాటుకున్నారు. న్యూ ఇయర్ వేడుకలకు ఖర్చు చేసే డబ్బును సేవా కార్యక్రమాలకు వినియోగించారు. స్వచ్ఛందంగా డబ్బులు వేసుకుని హెల్పింగ్ హ్యాండ్స్ పేరిట ఒక బృందంగా తయారయ్యారు. వారంతా కలిసి దుప్పట్లు పంపిణీ చేసి ఆదర్శంగా నిలిచారు. మంగళవారం తెల్లవారుజామున 1 నుంచి 3 గంటల వరకు పాతబస్తీలోని మంగళ్‌హట్, రహీంపుర, ఉస్మానియా ఆస్పత్రి, నాంపల్లి తదితర ప్రాంతాల్లో అభాగ్యులకు దుప్పట్లు పంపిణీ చేశారు. దాదాపు 40 నుంచి 50 దుప్పట్లు చలికి వణుకుతున్న పేదలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సాయినాథ్, ఆకాశ్, విష్ణు, పవన్ సింగ్, మహేశ్ రతన్, అజయ్, మహేశ్, రవి తదితరులు పాల్గొన్నారు. పేదలకు కొంత సేవా చేయాలనే భావనతో కొత్త సంవత్సరం రోజు ఈ కార్యక్రమం చేసినట్లు సాయినాథ్ తెలిపారు. భవిష్యత్‌లో మరిన్ని కార్యక్రమాలు చేస్తామని చెప్పారు. -
శ్రమించి చదివితే ఉజ్వల భవిష్యత్
ఎచ్చెర్ల: శ్రమించి చదివితే బాలికలకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని హెల్పింగ్ హ్యాండ్స్ అసోసియేషన్ ప్రతినిధులు జి.అప్పారావు. ఎం.పట్టాభి అన్నారు. డి.మత్స్యలేశంలోని బాలికల వసతి గృహంలో బాలకార్మిక వ్యవస్థ, బాల్యవివాహాలు వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. చిన్నవయసులో పెళ్లిళ్లును తిరస్కరించాలని సూచించారు. విద్యార్థి దశలో చదువుపై మక్కువ చూపాలన్నారు. బాలకార్మిక వ్యవస్థ నిరోధానికి ప్రతి ఒక్కురూ పాటుపడాలన్నారు.