హెల్ప్‌లెస్ | Helpless | Sakshi
Sakshi News home page

హెల్ప్‌లెస్

Published Mon, Dec 9 2013 1:52 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM

Helpless

=జిల్లాలో ఉద్యోగుల పెదవి విరుపు
 =30 వేల మంది ఉద్యోగులు, 38 వేల విశ్రాంత ఉద్యోగులకు వర్తింపు
 =హెల్త్‌కార్డు కంటే రీయింబర్స్‌మెంటే మేలంటున్న లబ్ధిదారులు
 =సీఎం దృష్టికి ఉద్యోగ సంఘాల అభ్యంతరం
 =పారని ప్రభుత్వ ఎన్నికల పాచిక

 
సాక్షి, మచిలీపట్నం : కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న ఎన్నికల గిమ్మిక్కులు ఫలించడం లేదు. తాజాగా ఉద్యోగులను, రిటైరైన ఉద్యోగులను బుట్టలో వేసుకునేందుకు కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం వేసిన హెల్త్‌కార్డ్ పాచిక పారలేదు. జిల్లాలో ఇటీవల వీటి పంపిణీ మొదలైనా ఉద్యోగ సంఘాలు వాటిని తీసుకునేందుకు ఇష్టపడటం లేదు. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (సీజీహెచ్‌ఎస్)ను వర్తింపచేస్తూ గతంలో ఉండే మెడికల్ రీయింబర్స్‌మెంట్‌కు మంగళం పాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా హెల్త్‌కార్డుల జారీ ప్రక్రియ చేపట్టింది. హెల్త్‌కార్డులతో ఏమాత్రం అదనపు ప్రయోజనం లేకపోగా ఉన్న రాయితీలు, అవకాశాలనే ప్రభుత్వం కొల్లగొట్టేస్తోందని ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి.
 
నిబంధనల మెలిక...

రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, రిటైరైన ఉద్యోగులకు హెల్త్‌కార్డులను అందించేందుకు గత నెలలో 173, 174, 175 నంబర్లతో జీవోలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో జిల్లాలోని సుమారు 30 వేల మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, 38 వేల మంది రిటైర్డ్ ఉద్యోగులు తమకు మేలు జరుగుతుందని భావించారు. తీరా ఆ జీవోల్లోని సారాంశం, హెల్త్‌కార్డుల వినియోగంలో నిబంధనలు చూసిన ఉద్యోగ వర్గాలు కంగుతిన్నాయి.

గతంలో ఉన్న మెడికల్ రీయింబర్స్‌మెంట్ పద్ధతే తమకు అనుకూలంగా ఉందని, హెల్త్‌కార్డు వల్ల ఏ మాత్రం ప్రయోజనం లేదని ఉద్యోగులు వాటిని తీసుకునేందుకు నిరాకరించారు. దీంతో రిటైర్డ్ ఉద్యోగుల్లో కేవలం పది వేలమంది మాత్రమే తాత్కాలిక హెల్త్‌కార్డులను తీసుకున్నారు. వీరికి 2014 ఏప్రిల్ నుంచి శాశ్వత హెల్త్‌కార్డులను జారీ చేస్తారు.
 
హెల్త్‌కార్డుల వివరాలివీ..

హెల్త్‌కార్డు ఉన్న ఉద్యోగి, విశ్రాంత ఉద్యోగులు తమతో పాటు తమ భార్య, పిల్లలకు కూడా దీనిద్వారా వైద్యం పొందవచ్చు. ఇందుకోసం క్లాస్-4 ఉద్యోగులు, ఎన్‌జీవోల నుంచి రూ.90, ఉపాధ్యాయుల నుంచి రూ.120 చొప్పున ప్రీమియం వసూలు చేస్తారు. విశ్రాంత ఉద్యోగులకు ప్రతి నెలా రూ.200 చొప్పున గతంలో వైఎస్సార్ ఇచ్చిన మెడికల్ అలవెన్సును ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసి దాన్నే హెల్త్‌కార్డు ప్రీమియంగా చూపిస్తోంది.

ఈ కార్డు కలిగినవారు ఏడాదిలో మూడు సార్లు వైద్యసేవలు పొందవచ్చు. వీరికి రూ.2 లక్షల వరకు వైద్యం అందిస్తారు. 338 ప్రధాన వ్యాధులు, వాటి పరిధిలోకి వచ్చే 1,885 చిన్నపాటి వ్యాధులకు కూడా చికిత్స అందిస్తారు. దరఖాస్తు చేసుకున్నవారికి ఈ నెల 5 నుంచి తాత్కాలిక కార్డులను జారీ చేస్తారు. వాటిలో లోపాలుంటే ఈ ఏడాది డిసెంబర్ 31లోగా ఆన్‌లైన్‌లో సరిదిద్దుకునే వెసులుబాటు కల్పిస్తారు. 2014 ఏప్రిల్ నుంచి శాశ్వత హెల్త్‌కార్డులను అందిస్తారు.
 
హెల్త్‌కార్డుకు లోపాల జబ్బు..


రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా చెబుతున్న హెల్త్‌కార్డుల జారీలో లోపాల జబ్బు ఉందని ఉద్యోగం సంఘాలు గగ్గోలు పెడుతున్నాయి. దీంతో జిల్లాలోని ఉద్యోగులు 30 వేల మంది, రిటైర్డ్ ఉద్యోగులు సుమారు 28 వేల మంది ఇంకా హెల్త్‌కార్డులు తీసుకునేందుకు నిరాకరించారు. హెల్త్‌కార్డుల్లో లోపాలను ఎత్తిచూపుతూ ఇప్పటికే జిల్లా ఉద్యోగ సంఘాల నేతలు సీఎం కిరణ్ దృష్టికి తీసుకువెళ్లారు. గుండె సంబంధ వ్యాధుల వల్ల గుండెకు స్టంట్ వేసుకుంటే మెడికల్ రీయింబర్స్‌మెంట్‌లో ఉద్యోగికి రూ.2 లక్షలు వచ్చేవి.

ప్రభుత్వం ఇచ్చే హెల్త్‌కార్డులతో రూ.40 వేలు మాత్రమే ఇచ్చేలా నిబంధన పెట్టారు. దీంతో కార్పొరేట్ ఆస్పత్రుల్లో గుండెకు స్టంట్ వేయించుకుంటే రూ.2 లక్షలు అవుతున్న తరుణంలో రూ.40 వేలు ఏమాత్రం సరిపోవని, దీనివల్ల తక్కువ రేటుకు స్టీలు స్టంట్ వేసుకుంటే సుగర్ వ్యాధి ఉన్న గుండె రోగులు నాలుగు నెలలకే చనిపోయే ప్రమాదం ఉందని వాపోతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకుంటే హెల్త్‌కార్డు వర్తించే విధానం వల్ల కార్పొరేట్ వైద్యం అవకాశం ఉన్నా చేయించుకోలేని దుస్థితి ఏర్పడుతుందని చెబుతున్నారు.
 
 లోపాలు చక్కదిద్దకపోతే ఉపయోగం లేదు

 ప్రభుత్వం అందిస్తున్న హెల్త్‌కార్డుల్లో లోపాలు చక్కదిద్దకపోతే వాటివల్ల ఉపయోగం లేదు. ఈ విషయంలో ఇప్పటికే ఏపీ ఎన్జీవో నాయకుడు పి.అశోక్‌బాబు దృష్టికి తీసుకెళ్లాం. ఆయన సీఎంని కలిసి సమస్యలు చెప్పారు. ముందు కార్డులు తీసుకోండి.. లోపాలు చక్కదిద్దుతామని సీఎం అన్నారు. అయినా హెల్త్‌కార్డులు తీసుకుంటే మెడికల్ రీయింబర్స్‌మెంట్ వర్తించకుండా నష్టపోతామని చెప్పాం. హెల్త్‌కార్డులో లోపాలు చక్కదిద్ది ఉద్యోగులకు మేలు కలిగేలా చేస్తే తప్ప మేం వాటిని తీసుకునేది లేదు.
 - ఉల్లి కృష్ణ, ఏపీ ఎన్జీవో జిల్లా నేత
 
 రూ.40 వేలకు స్టంట్ సాధ్యమా?
 ప్రభుత్వం ఇస్తున్న హెల్త్‌కార్డుల్లో చాలా వరకు వ్యాధులు వర్తించడంలేదు. ప్రధానంగా గుండె సంబంధ రోగం వస్తే స్టంట్ వేసుకోవాలంటే కనీసం రూ.2 లక్షలు ఖర్చవుతుంది. దానికి రూ.40 వేలు ఇస్తామని హెల్త్‌కార్డులో నిబంధన పెట్టారు. ఇదెలా సాధ్యమవుతుంది? ఇలాంటి లోపాలు ఎన్నో ఉద్యోగులు, రిటైర్ట్ ఉద్యోగులకు, వారి కుటుంబానికి ఇబ్బందికరంగా మారింది. దీనికంటే గతంలో ఉండే మెడికల్ రీయింబర్స్‌మెంటే బాగుంది.
 - సీహెచ్‌వీ చంద్రశేఖర్,
 రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement