సాక్షి, రాజమండ్రి : గోదావరి పుష్కరాలకు దేశం నలుమూల నుంచీ రాజమండ్రి తరలివస్తున్న యాత్రికులు రాత్రి బస చేయడంలో తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. నగర శివార్లలో ఏర్పాటు చేసిన పుష్కర నగర్‌ల నుంచి ఘాట్లకు దూరం ఎక్కువగా ఉంటోంది. అంత దూరం నడిచి వెళ్లడానికి వారు ఇక్కట్లు పడుతున్నారు. దీంతో దూరప్రాంతంలోని పుష్కర నగర్‌లు ఖాళీగా ఉంటున్నాయి. కానీ స్నానఘట్టాలకు దగ్గరగా ఉన్న రైల్వే వెయిటింగ్, ప్రైవేటు వసతి ప్రదేశాలు మాత్రం కిక్కిరిసిపోతున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలు జరిగే ప్రదేశాల్లోనూ అవి ముగిసిన తర్వాత అక్కడే కుర్చీల్లో భక్తులు సేద తీరుతున్నారు.
అయితే ఇక్కడ వారికి ఎలాంటి సదుపాయాలూ లభించడం లేదు. కనీసం తాగునీరు కూడా దొరకడం లేదు. ఆర్ట్స్ కళాశాల, లూథర్ గిరి, రైల్వే గూడ్స్ షెడ్, సాంస్కృతిక కళాశాల మైదానాల్లో ప్రధాన పుష్కర నగర్‌లు ఉన్నాయి. ఇక్కడ భారీ ఏర్పాట్లు చేశామని అధికారులు చెప్పుకొచ్చారు. అక్కడినుంచి పుష్కర ఘాట్‌లకు వెళ్లేందుకు ఆర్టీసీ ఉచిత బస్సులను అందుబాటులో ఉంచారు. కానీ పుష్కర నగర్‌లకు జనం వెళ్లకపోవడంతో ఉచిత బస్సులు యాత్రికులకు సగమే ఉపయోగపడుతున్నాయి. దీనికి పూర్తి భిన్న పరిస్థితులు రైల్వే స్టేషన్, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్న ప్రదేశాల్లో కనిపిస్తోంది.
గోదావరి రైల్వే స్టేషన్ పుష్కర్ ఘాట్‌కు అతి సమీపంలో ఉండటంతో రైలు దిగిన యాత్రికులు ఇక్కడే ఉంటున్నారు. వెయిటింగ్ హాల్ ఏర్పాటు చేసినప్పటికీ వాటిలో ఫ్యాన్లు, పడుకోవడానికి కార్పెట్లవంటివి లేవు. దీంతో భక్తులు మట్టిలోనే పడుకుంటున్నారు. కొందరు రైల్వే బ్రిడ్జి కింద పిండప్రదానాల కోసం వేసిన టెంట్లలోనే సేద తీరుతున్నారు. పక్కనే వందలాది టాయిలెట్లు ఉండటంతో దుర్గంధంతో పాటు దోమల బెడదతో నరకం చవి చూస్తున్నారు.
సుబ్రహ్మణ్య మైదానంలో సాంస్కృతిక కార్యక్రమాలు ముగిసిన తర్వాత యాత్రికులు అక్కడే కుర్చీల్లో పడుకుంటున్నారు. వారిని పట్టించుకున్న నాథుడే లేడు. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన పుష్కర నగర్‌లను కనీస ప్రణాళిక లేకుండా దూరప్రాంతాల్లో ఏర్పాటు చేయడంతో ఆ నిధులు నిరుపయోగమైనట్టు అయింది. కనీసం ఘాట్‌ల దగ్గర్లో సేద తీరే భక్తుల బాగోగులు పట్టించుకుంటే కొంతలో కొంత ఊరట లభిస్తుంది.
ఇక్కడ ఖాళీ.. అక్కడ రద్దీ
Published Mon, Jul 20 2015 3:47 AM | Last Updated on Sun, Sep 3 2017 5:48 AM
Advertisement
Advertisement