ప్రముఖ సైకాలజిస్టు, జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు డాక్టర్ టీఎస్.రావు, వ్యక్తిత్వ వికాస నిపుణులు డాక్టర్ ఎంవీ.రావు,
విజయవాడ, న్యూస్‌లైన్ : ప్రముఖ సైకాలజిస్టు, జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు డాక్టర్ టీఎస్.రావు, వ్యక్తిత్వ వికాస నిపుణులు డాక్టర్ ఎంవీ.రావు, విక్టరీ పబ్లిషకేషన్స్ అధినేత ఇమ్మడిశెట్టి రామకుమార్‌లతో కూడిన బృందం ఈ నెల 12వ తేదీ నుంచి ఆరు రోజులపాటు మలేషియా, సింగపూర్‌ల దేశాల్లో పర్యటించనుంది. ఆయా దేశాల్లోని తెలుగు సమాజం వీరిని ఆహ్వానించింది.
సూర్యారావుపేటలోని స్పందన సైకియాట్రి సెంటర్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ టీఎస్.రావు వివరాలు వెల్లడించారు. మలేషియా, సింగపూర్‌లో నివసించే తెలుగువారి సంస్కృతి, సంప్రదాయాలు, త ల్లిదండ్రులతో పిల్లల సంబంధ బాంధవ్యాలు, తెలుగు భాషపై వారి అభిరుచి ఎలా ఉంది తదితర అంశాలపై బృందం పరిశోధిస్తుందని చెప్పారు. అక్కడి బాలబాలికలతో ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
తాను రచించిన ‘బాలలకు బంగారు బాట’ పుస్తకాన్ని మలేషియాలో ఆవిష్కరించనున్నట్లు చెప్పారు. ఈ పుస్తకాన్ని అక్కడ స్థిరపడి తెలుగు ప్రజలకు విశేష సేవలు అందిస్తున్న డాక్టర్ అచ్చయ్యకుమార్‌కు అంకితం ఇస్తున్నట్లు వివరించారు. అలాగే ఈ నెల 16న సింగపూర్‌లో జరిగే కార్యక్రమంలో ‘ఆనందానికి 50 మార్గాలు’ పుస్తకాన్ని ఆవిష్కరిస్తామని, అలాగే డాక్టర్ ఎంవీ.రావు రచించిన ‘ఆనందంతో విజయం’ అనే పుస్తకాన్ని కూడా ఆవిష్కరించనున్నట్లు తెలిపారు.