తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తత | Hi Tension In Tadipatri | Sakshi
Sakshi News home page

తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తత

Published Sat, Sep 15 2018 7:23 PM | Last Updated on Sun, Sep 16 2018 4:12 AM

Hi Tension In Tadipatri - Sakshi

జేసీ సోదరులకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న మహిళా భక్తులు

తాడిపత్రి: అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలో వినాయక నిమజ్జనం సందర్బంగా ఇరువర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. పరస్పరం రాళ్ల దాడులు, వాహనాల దహనాలతో ఉద్రిక్తత నెలకొంది. తాడిపత్రి మండలం చిన్నపొలమడ గ్రామంలో శనివారం వినాయక నిమజ్జన వేడుకలను నిర్వహించారు.చిన్నపొలమడలోని శ్రీప్రబోధానందాశ్రమం మీదుగా జేసీ సోదరుల అనుచరులు మూడు ట్రాక్టర్లలో ఊరేగింపు నిర్వహించారు. రంగులు చల్లుకుంటూ, డప్పులు మోగిస్తూ, ఈలలు కేకలు వేయడంతో ఆశ్రమ నిర్వాహకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తాము ధ్యానం చేసుకుంటున్న సమయంలో ఇలా హంగామా సృష్టించడం సమంజసం కాదన్నారు. అక్కడ బందోబస్తులో ఉన్న సీఐ సురేంద్రనాథ్‌రెడ్డి ఆశ్రమ భక్తులకు సర్దిచెప్పారు. అయితే, నిమజ్జనం ఊరేగింపు ఆశ్రమం ముందుకు రాగానే అధికార టీడీపీ కార్యకర్తలు, జేసీ సోదరుల అనుచరులు ఒక్కసారిగా రెచ్చిపోయారు.

ఇంతలో అక్కడున్న మూడు ట్రాక్టర్లు, ఒక ఆటోకు మంటలంటుకున్నాయి. ఆశ్రమ భక్తులు, జేసీ అనుచరుల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రికంగా మారింది. ఈ ఘర్షణలో ఆశ్రమానికి చెందిన భక్తులు చంద్రశేఖర్, ఆదినారాయణ, జయచంద్ర, రామకృష్ణ, మహేష్, వెంకటేష్, నిరంజన్‌తోపాటు మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ భక్తులను ఆశ్రమ నిర్వాహకులు చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరోవైపు జేసీ సోదరుల అనుచరులు పెద్దపొలమడలోని ఆశ్రమ భక్తుల నివాసాలను చుట్టుముట్టారు. పోలీసులు రంగంలోకి దిగి, ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.జిల్లా ఎస్పీ అశోక్‌కుమార్‌ శనివారం రాత్రి ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. జిల్లా ఎస్పీ సంఘటనా స్థలానికి వచ్చేంత వరకు వాహనాలు దహనమవుతూనే ఉన్నాయి. ఎస్పీ ఆదేశాలతో పోలీసులు మంటలను ఆదుపులోకి తెచ్చారు.  

అనుమతి ఎందుకు ఇచ్చినట్లు?  
శ్రీప్రబోధానందాశ్రమం ముందుగా ట్రాక్టర్లు ఊరేగింపుగా వెళ్లేందుకు పోలీసులు ఎందుకు అనుమతి ఇచ్చారన్న దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఆ దారిలో ఊరేగింపుగా వెళ్లి విగ్రహాలను నిమజ్జనం చేయడానికి ఇక్కడ నీళ్లు కూడా లేవు. అలాంటప్పుడు పోలీసులు ఆశ్రమం ముందు నుంచి ఊరేగింపునకు ఎందుకు అనుమతిచ్చారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గతంలోనూ వినాయక చవితి సందర్బంగా ఆశ్రమ నిర్వాహకులకు, జేసీ అనుచరులకు మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. అయినా జేసీ వర్గీయులు మళ్లీ అదే మార్గాన్ని ఎంచుకోవడం గమనార్హం.  

పథకం ప్రకారమే ఆశ్రమంపై దాడులు  
పెద్దపొలమడ, చిన్నపొలమడ గ్రామస్థులు తమ ఊళ్లలోనే వినాయక నిమజ్జనం నిర్వహించడం ఏటా కొనసాగుతున్న ఆనవాయితీ. అయితే, ఈసారి నిమజ్జనం సందర్భంగా చిన్నపాటి విగ్రహాలను ఓ ట్రాక్టర్‌లో ఉంచి, దాని వెనుక మరో రెండు ఖాళీ ట్రాక్టర్లకు పోలీసులు ఎందుకు అనుమతిచ్చారని ఆశ్రమ భక్తులు ప్రశ్నిస్తున్నారు. ఘర్షణ చోటు చేసుకోవడానికి కారణం సీఐ సురేంద్రనాథ్‌రెడ్డేనని ఆరోపిస్తున్నారు. సీఐ ప్రోత్సాహంతోనే జేసీ అనుచరులు మరింత రెచ్చిపోయారని పేర్కొంటున్నారు. విగ్రహం వెనుక వస్తున్న రెండు ట్రాక్టర్లలో రాళ్లు వేసుకుని ఊరేగింపునకు వచ్చారని, ఆశ్రమం వద్దకు రాగానే ఓ పథకం ప్రకారం దాడులకు తెగబడ్డారని భక్తులు చెబుతున్నారు. ఘర్షణ సందర్బంగా ట్రాక్టర్లను జేసీ అనుచరులే దహనం చేసి తమపై తప్పుడు కేసులు బనాయించేందుకు కుట్ర పన్నుతున్నారని అంటున్నారు. ఓ పథకం ప్రకారమే వారి ట్రాక్టర్లను వారే దహనం చేసుకుని తమపై కేసులు బనాయించేందుకు ప్రయత్నిస్తున్నారని భక్తులు మండిపడుతున్నారు. ట్రాక్టర్లకు ఎవరు నిప్పు పెట్టారో తెలియాల్సి ఉంది. 

పోలీసులు జేసీ సోదరులకు తొత్తులు  
తాడిపత్రిలో జేసీ సోదరులకు పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆశ్రమం భక్తులు ఆరోపించారు. ఘర్షణకు పరోక్షంగా సహకరించి, ఆశ్రమంపై జేసీ అనుచరులను ఉసిగొల్పిన సీఐ సురేంద్రనాథ్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని మహిళా భక్తులు శనివారం రాత్రి ఆశ్రమం ముందు ఆందోళనకు దిగారు. గతంలో ఇదే సీఐ పలుమార్లు జేసీ సోదరుల ప్రోద్బలంతో ఆశ్రమ నిర్వాహకులపై తప్పడు కేసులు బనాయించాడని ధ్వజమెత్తారు. మళ్లీ ఇప్పుడుబందోబస్తు డ్యూటీ వేయించుకుని ఆశ్రమంపై తెలుగుదేశం పార్టీ వారిని ఉసిగొల్పాడని విమర్శించారు. సీఐ సురేంద్రనాథ్‌రెడ్డిపై పోలీసు ఉన్నతాధికారులు వెంటనే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.  

జేసీ సోదరులు కక్ష సాధిస్తున్నారు  
జేసీ సోదరులు ఓ పథకం ప్రకారం తమపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని శ్రీప్రబోధానందశ్రమం డైరెక్టర్‌ సూర్యనారాయణ ఆరోపించారు. ఆశ్రమానికి చెందిన దళితుడిని దూషించిన ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డిపై కేసు నమోదు చేయించామన్న అక్కసుతో తమపై కక్ష సాధిస్తున్నారని పేర్కొన్నారు.  

సీఐ సురేంద్రనాథ్‌రెడ్డిపై ఎస్పీ సీరియస్‌ 
నిమజ్జనం సందర్బంగా బందోబస్తు నిర్వహించిన సీఐ సురేంద్రనాథ్‌రెడ్డిపై జిల్లా ఎస్పీ అశోక్‌కుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. గతంలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయని, ఇప్పుడు మళ్లీ ఇదే దారి గుండా నిమజ్జనానికి ఎందుకు అనుమతిచ్చారని సీఐపై ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement