ఒడిశా సరిహద్దులో ఉన్న ముంచంగిపుట్టులో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు
అరకులోయ: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుకుమా జిల్లా కుంట అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ సంఘటనతో ఏవోబీలో హైఅలర్ట్ ప్రకటించారు. ఆదివారం రాత్రి నుంచి పోలీసులు–మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల సంఘటనలో 15మంది మావోయిస్టు కీలక నేతలు మృతి చెందారు. ఈ సంఘటనతో కేంద్ర హోంశాఖలోని నిఘా వర్గాలు తెలంగాణా, ఒడిశా, ఆంధప్రదేశ్ రాష్ట్రాల పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. ఏవోబీలో ప్రస్తుతం ఇరు రాష్ట్రాల పోలీసు పార్టీలు కూంబింగ్ చర్యలలో నిమగ్నమయ్యాయి. మావోయిస్టులు ఇటీవల వారం రోజులపాటు ఏవోబీలో ఆమర వీరుల వారోత్సవాలను విజయవంతంగా జరుపుకున్నారు.
ఈ మేరకు మావోయిస్టులు ఏవోబీలో అధికంగా సంచరిస్తున్నారనే సమాచారంతో విశాఖ జిల్లాలోని పోలీసు పార్టీలతోపాటు ఒడిశాకు చెందిన పోలీసు భద్రత బలగాలు ఏవోబీవ్యాప్తంగా జల్లెడ పడుతున్నాయి. ఈ నేపధ్యంలో ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో 15మంది మావోయిస్టులు మృతి చెందిన ఘటనతో ఏవోబీలో పోలీసు పార్టీలను ఉన్నతాధికారులు అప్రమత్తం చేసారు.కూంబింగ్ చర్యలలో ఉన్న పోలీసు పార్టీలకు భద్రతను పెంచే చర్యలను చేపట్టినట్టు విస్వసనీయ వర్గాల సమాచారం. అదనపు పోలీసు బలగాలను ఏవోబీలోకి పంపే చర్యలను ఇరు రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారులు వేగవంతం చేసారు. అలాగే విశాఖ ఏజెన్సీలోని రాళ్లగెడ్డ, కోరుకొండ, రూడకోట ప్రాంతాలలో పోలీసు అవుట్ పోస్టులతోపాటు, ఒడిశా సరిహద్దులో ఉన్న పెదబయలు. ముంచంగిపుట్టు పోలీసు స్టేషన్‌ల పరిధిలో హైఅలర్ట్ ప్రకటించారు. ప్రత్యేక పోలీసు బలగాలను ఈ స్టేషన్‌లలో అందుబాటులో ఉంచారు. పోలీసులు ఒడిశా సరిహద్దు ప్రాంతాలలో తనిఖీలను ముమ్మరం చేసారు.
Comments
Please login to add a commentAdd a comment