
సాక్షి, అమరావతి : రాజధాని ప్రాంతమైన ఉండవల్లిలోని కృష్ణా కరకట్ట వద్ద అక్రమంగా నిర్మించిన ప్రజావేదిక తొలగింపు పనులు మూడవ రోజు కొనసాగుతున్నాయి. బుధవారం రాత్రి సమయానికి దాదాపు 80 శాతానికి పైగా తొలగింపు పనులు పూర్తయ్యాయి. ఉపయోగించుకోవటానికి వీలుగా ఉండే వాటిని జాగ్రత్తగా పక్కకు తీస్తున్న నేపథ్యంలో ఈ గురువారం కూడా తొలగింపు పనులు కొనసాగుతున్నాయి. మాజీ సీఎం ఇంటికి అత్యంత సమీపంలో ఉన్న ఈ ప్రజావేదిక భవనాన్ని తొలగిస్తున్న నేపథ్యంలో ఘర్షణలు, ఉద్రిక్తత తలెత్తకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా సిబ్బంది కరకట్టను ఆధీనంలోకి తీసుకున్నారు.
ప్రజావేదికను కూల్చివేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ మంగళవారం హైకోర్టులో పిల్ దాఖలైన సంగతి తెలిసిందే. అయితే ప్రజావేదిక నిర్మాణం కూల్చివేతలో జోక్యానికి హైకోర్టు నిరాకరించింది. స్టే ఇచ్చేందుకు ఎటువంటి కారణం కనిపించడం లేదని స్పష్టం చేసింది. అక్రమ నిర్మాణమని మీరే చెబుతున్నప్పుడు ఎలా జోక్యం చేసుకోగలమని పిటిషనర్‌ను ప్రశ్నించింది.
Comments
Please login to add a commentAdd a comment