
సాక్షి, రామచంద్రపురం (తూర్పు గోదావరి): నిషేధిత సర్వే నంబర్లలోని భూములను రిజిస్ట్రేషన్ చేయరాదని చట్టం చెబుతుంది. కానీ రామచంద్రపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో దీనిని పట్టించుకోవడం లేదు. నిబంధనలను తుంగలో తొక్కి గత ఏడాది నవంబర్‌లో లెప్రసీ మిషన్ ట్రస్టు స్థలాన్ని అడ్డగోలుగా రిజిస్ట్రేషన్ చేయించుకుని ఆక్రమించేసిన విషయం తెలిసిందే. ఈ అక్రమ దందాపై కొంతమంది స్థానికులు హైకోర్టును ఆశ్రయించగా.. అక్రమార్కులకు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం నోటీసులు అందించిందనే విషయం ఆలస్యంగా తెలిసింది. రామచంద్రపురం – పసలపూడి ప్రధాన రహదారికి ఇరువైపులా బ్రిటిష్ పరిపాలన కాలంలో ఒక దాత ఉదారంగా ఐదెకరాల స్థలం ఇచ్చారు. ఈ ప్రాంతాల్లోని కుష్ఠు వ్యాధిగ్రస్తుల కోసం దీనిని దానం చేసి, దీని నిర్వహణ కోసం ట్రస్టు ఏర్పాటు చేశారు.
దేశంలోనే ఎంతో పేరొందిన ది లెప్రసీ మిషన్ ట్రస్టు ద్వారా ఇక్కడ ఆసుపత్రి ఏర్పాటు చేసి వైద్య సేవలందించేవారు. ఇందులో కొంత భాగం ప్రస్తుతం రామచంద్రపురం మున్సిపాలిటి పరిధిలో ఉంది. ఇందులో లెప్రసీ ఆసుపత్రితో పాటు రోగులుండేందుకు భవనాలు నిర్మించారు. రోడ్డుకు మరోవైపు పసలపూడి పంచాయతీ పరిధిలో సుమారు 4 వేల చదరపు గజాల స్థలం ఉంది. ఇందులో వైద్యుల విశ్రాంతి కోసం భవనాలు నిర్మించారు. దశాబ్దాల కాలం పాటు జిల్లావ్యాప్తంగా కుష్ఠు రోగులకు ఇక్కడ వైద్యసేవలు అందించారు. క్రమంగా కుష్ఠు వ్యాధిగ్రస్తులు తగ్గడంతో కొంతకాలంగా వైద్యసేవలు నిలిపివేశారు. ట్రస్టుకు సంబంధించిన ఈ ఆస్తుల క్రయ విక్రయాలకు వీలులేదు. దీంతో ఈ స్థలాలకు సంబంధించిన సర్వే నంబర్లపై మార్కెట్ వేల్యూ పుస్తకంలో రెడ్‌మార్కు పెట్టి ఉంచారు.
వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఈ స్థలాలపై అక్రమార్కుల కన్నుపడింది. దీంతో రామచంద్రపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నిబంధనలను తుంగలో తొక్కుతూ ప్రొహిబిటెడ్ సర్వే నంబర్లలో ఉన్న ఈ స్థలానికి అడ్డగోలుగా రిజిస్ట్రేషన్లు చేశారు. గత ఏడాది నవంబర్ 20వ తేదీన రామచంద్రపురం – పసలపూడి రోడ్డులో పసలపూడి పంచాయతీ పరిధిలోకి వచ్చే లెప్రసీ మిషన్ ట్రస్టుకు చెందిన 460/12, 461/2బి సర్వే నంబర్లలోని సుమారు 4 వేల చదరపు గజాల స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.
నిబంధనలకు పాతర
లెప్రసీ మిషన్ ట్రస్టుకు చెందిన 460/12, 461/2బి సర్వే నంబర్ల భూమి ఆన్‌లైన్‌లో నిషేధిత సర్వే నంబర్లలో ఉంది. కానీ అప్పటి సబ్ రిజిస్ట్రార్ వీటికి అడ్డగోలుగా రిజిస్ట్రేషన్ చేశారు. సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో 7649/18, 7650/18, 7651/18 నంబర్లతో ఈ రిజిస్ట్రేషన్లు జరిగాయి. తద్వారా కబ్జాదారులు సుమారు రూ.10 కోట్ల విలువైన ఈ స్థలాన్ని కేవలం రూ.1.80 కోట్లకు కాజేసే యత్నం చేశారు.
హైకోర్టు నోటీసులు
లెప్రసీ ట్రస్టు ఆస్తులను కాపాడాలనే ధ్యేయంతో పట్టణానికి చెందిన మట్టా ఉమాశంకరావు, లెప్రసీ సంఘం నాయకులు ఆవుపాటి విరాట్, పంపన రామకృష్ణ, జల్లి సత్యంనాయుడు అప్పట్లో ఈ వ్యవహారంపై కలెక్టర్‌తో పాటు జిల్లా రిజిస్ట్రార్‌కు, డీఐజీ తదితర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో వారు గత మార్చిలో హైకోర్టును ఆశ్రయించారు. దీనిని విచారణకు స్వీకరించిన హైకోర్టు.. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి, జిల్లా కలెక్టర్‌కు, న్యూఢిల్లీలోని లెప్రసీ మిషన్ ట్రస్టుకు, రామచంద్రపురం ఆర్డీవోకు, జిల్లా రిజిస్ట్రార్‌కు గత నెల 25న నోటీసులు జారీ చేసింది.
ఇదిలా ఉండగా ట్రస్టు బైలాస్ పంపించాలని కోరుతూ న్యూఢిల్లీ ట్రస్టు కార్యాలయానికి అప్పటి జిల్లా రిజిస్ట్రార్ లేఖ కూడా రాశారు. కానీ అది ఏమైందనేది ఇప్పటివరకూ వెలుగులోకి రాలేదు. ఎంతో విలువైన ఈ భూములు అన్యాక్రాంతమయ్యే పరిస్థితులు తలెత్తాయని, ప్రస్తుత జిల్లా అధికారులు ఈ భూబాగోతంపై విచారణ చేయించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పట్టణవాసులు, ప్రజాసంఘాల నాయకులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment