నది కాలుష్యాన్ని నియంత్రించాలని హైకోర్టు ఉత్తర్వులు
భువనగిరి, న్యూస్‌లైన్: జంట నగరాల్లోని పారిశ్రామికవాడల నుంచి విడుదలయ్యే కాలుష్యం మూసీలో కలవకుండా చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇది జిల్లాలోని హెచ్‌ఎండీఏ పరిధిలో ఉన్న పోచంపల్లి, చౌటుప్పల్, బీబీనగర్ మండలాలతో పాటు మూసీ పరీవాహక ప్రాంత ప్రజలకు ఎంతో ఊరటనిచ్చే విషయం. అయితే మూసీ కాలుష్యం నుంచి తమను కాపాడాలని ఎంతోకాలంగా నది పరీవాహక ప్రజలు కోరుతున్నారు. ఇంత జరుగుతున్నా పాలకులు మాటలతో కాలం గడపడం తప్పా నిజాయితీగా చర్యలు చేపట్టింది లేదు.
లెక్కలు కట్టడంలో మాయ
మూసీనదిపై పర్యావరణ కాలుష్య సూచీ ప్రమాదకరస్థాయిలో ఉంది. ఇది ఏటా పెరుగుతున్నా.. దాన్ని తక్కువగా చూపించడం ఆనవాయితీగా వస్తోంది. దీనికి సంబంధించి బడా కంపెనీలు పెద్ద మొత్తంలో ముడుపులు ముట్టజెప్పినట్లు ఆరోపణలు ఉన్నాయి. 2010లో 70.7గా నమోదైన పర్యావరణ కాలుష్య సూచీ, 2011నాటికి 74.58కి చేరింది. 2013 నాటికి అది అత్యధికంగా 76.05కు చేరడడం తథ్యమని తెలుస్తోంది. అయితే సీపీసీబీ (సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు) జారీ చేసిన ఆయా ప్రాంతాల్లో పర్యావరణ కాలుష్య సూచీ కేవలం 47.33 శాతానికి తగ్గినట్లు తప్పుడు నివేదికను సృష్టించారు. ఇందులో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, పీసీబీ(పొల్యూషన్ కంట్రోల్ బోర్డు) అప్పీలేట్ అథారిటీ, రాష్ట్ర పరిశ్రమల శాఖలోని ఉన్నతాధికారులు బాధ్యులు. అంతేకాదు అయా కంపెనీల నుంచి వెలువడుతున్న నీటిలో కెమికల్‌ఆక్సిజన్ డిమాండ్ (సీఓడి), వాయు కాలుష్కంలో నైట్రోజన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, ధూళిరే ణువులు, సూక్ష్మ ధూళికణాలు మోతాదును తక్కువగా చూపినట్లు ఆరోపణలు ఉన్నాయి.
పర్యావర ణానికి పెను ముప్పు
హైదరాబాద్‌లోని పెద్ద కంపెనీలు వదిలే పారిశ్రామిక వ్వర్థజలాల ఉత్పత్తితో పర్యావరణానికి పెనుముప్పు వాటిల్లుతోంది. పారిశ్రామిక ఘన వ్వర్థాలను దుండిగల్‌లోని సాలిడ్ వేస్ట్ ట్రీట్‌మెంట్ సెంటర్‌కు తరలించాల్సి ఉన్నా, కంపెనీలు నిర్లక్ష్యంగా వ్వవహరిస్తున్నాయి. ఎక్కడికక్కడే ఘన వ్వర్థాలను భూమిలో పూడ్చుతుండడంతో విషతుల్యమౌతోంది. పలు పరిశ్రమలు తమకు అనుమతి ఉన్న దానికంటే అత్యధికంగా ఉత్పత్తులు తయారుచేస్తుండడం పర్యావరణానికి ముప్పుగా మారిందని పర్యావరణ నిపుణులు అందోళన వ్వక్తం చేస్తున్నారు.
ఇలా చేయాల్సి ఉన్నా..
పారిశ్రామిక వ్వర్థాలతో కూడిన జలాలను 1200 డిగ్రీల ఉష్టోగ్రత వద్ద ఆవిరి చేయాల్సి ఉన్నా పరిశ్రమలు పెరిగిన విద్యుత్ చార్జీల నేపథ్యంలో ఆ పనిచేయడం లేదు. వాటిని దొంగచాటుగా సమీప చెరువులు, కాలువల్లో గుట్టుచప్పుడు కాకుండా కలిపేస్తున్నారు.
పారిశ్రామిక వ్వర్థాలు కలిపిన జల ఉద్గారాలను శుద్ధిచేసేందుకు సొంతంగా పరిశ్రమలోనే ఎప్లుయెంట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ (ఈటీపీ) ఏర్పాటు చేయడంలో చాలా పరిశ్రమలు చేతులెత్తేశాయి.
జల ఉద్గారాల్లోని పర్యావరణానికి తీవ్ర హాని చేసే మూలకాలను శుద్ధిచేసే రివర్స్ అస్మోసిస్ ప్లాంటు ఏర్పాటులోనూ ఎక్కువగా నిర్లక్ష్యం కన్పిస్తోంది.
పలు పరిశ్రమలు వాయి ఉద్గారాలను వడకట్టే స్ట్రిప్సర్ ఏర్పాటు చేసే విషయాన్ని గాలికొదిలేశాయి.
కర్మాగారాల్లో ఘన, ద్రవ, వాయు ఉద్గారాల్లో హానికార క మూలకాలను అవిరి చేసే మల్టిపుల్ ఎఫెక్ట్ ఎవాపరేటర్ (ఎంఈఈ), ఎజిటేటెడ్ థిన్ ఫిల్మ్ డ్రైవర్లు లేకపోవడం అందోళన కలిగించే అంశం.
నిషేధానికి తూట్లు ఇలా..
సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం 1999 ఏప్రిల్ 20న జారీ చేసిన నిషేధం ఉత్తర్వుల (జీ.ఓ.ఎంఎస్.నెం.62) ప్రకారం హైదరాబాద్ నగర శివార్లలో గల రంగారెడ్డి, మహబూబ్‌నగర్ , నల్లగొండ, మెదక్ జిల్లాల పరిధిలోని బల్క్‌డ్రగ్, ఫార్మా కంపెనీలు తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచ కూడదు. జల, వాము కాలుష్య చట్టాలను ఉల్లంఘించే పనులకూ పాల్పడరాదని ఉత్తర్వుల్లో ఉన్నా వాటికి పరిశ్రమల యాజమాన్యాలు తిలోదకాలిచ్చాయి. పై ఉత్తర్వులకు గండికొడుతూ 2013 జూలై 25న నిషేధం ఉత్తర్వులకు సవరణ చేస్తూ జీఓఎంఎస్‌నెం 64జారీ అయ్యేలా చేసుకున్నారు. దీని ప్రకారం జీరో లిక్విడ్ డిశ్చార్జి (జల, వాయు), విధంగా ఉపకరణాలను ఏర్పాటు చేసుకున్న తరువాత ఉత్పత్తి సామర్థ్యం విస్తకణ చర్యలు చేపట్టుకోవచ్చన్న సాకుతో నిషేధాన్ని ఎత్తివేసేలా సఫలీకృతమయ్యారు. ఈ ఉత్తర్వులతో తమ ఉత్పత్తులను అన్యూహ్యంగా పెంచుకునేందుకు గేట్లు బార్ల తెరిచినట్లైంది. దీంతో పరిశ్రమల లాబీ ఆగడాలకు అడ్డులేకుండా పోయింది.