
నిర్దిష్ట విధానాన్ని అనుసరించడంలో తప్పులేదు..
- విద్యుత్ చార్జీల ఖరారుపై ఈఆర్‌సీ నిర్ణయానికి హైకోర్టు సమర్థన
- సింగిల్ జడ్జి ఉత్తర్వులను కొట్టివేసిన ధర్మాసనం
సాక్షి, హైదరాబాద్: టారిఫ్ షెడ్యూల్‌లో పేర్కొన్న విధంగా ఇరు రాష్ట్రాలకూ విద్యుత్ చార్జీలను ఖరారు చేసే విషయంలో విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్‌సీ) ఓ నిర్దిష్ట విధానాన్ని(మెథడాలజీ) అనుసరించడంలో ఎంతమాత్రం తప్పులేదని హైకోర్టు తేల్చిచెప్పింది. యూనిట్ల లెక్కింపు విధానానికి విరుద్ధంగా ఈఆర్‌సీ అనుసరించిన మెథడాలజీ ఉందన్న ఏకైక కారణంతో, దానిని తప్పని ప్రకటించలేమని స్పష్టంచేసింది.
బిల్లింగ్ లెక్కింపు విధానంలో మార్పు విద్యుత్ చట్టనిబంధనలకుగానీ, రాజ్యాంగ నిబంధనలకుగానీ విరుద్ధం కాదని తెలిపింది. ఈ మెథడాలజీని అమలుచేసే ముందు దాని హేతుబద్ధతను ఈఆర్‌సీ పూర్తిస్థాయిలో పరిశీలించిందని, అందువల్ల మెథడాలజీ మార్పు నిర్ణయాన్ని అనాలోచిత నిర్ణయంగా పరిగణించలేమంది. ఈ విధానాన్ని ఇప్పటికే పలు రాష్ట్రాలు అమలు చేస్తున్నాయని, అందులో కొత్తేమీ లేదని తెలిపింది. ఈఆర్‌సీ అనుసరించిన విధానాన్ని తప్పుపడుతూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును కొట్టివేసింది.
ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావులతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. కిలోవాట్ పర్ అవర్(కేడబ్ల్యూహెచ్) స్థానంలో కిలోవోల్ట్ అంపరెస్ పర్ అవర్(కేవీఏహెచ్) పద్ధతిన విద్యుత్ చార్జీల లెక్కింపు విధానానికి ఆమోదముద్ర వేస్తూ ఈఆర్‌సీ 2011లో ఉత్తర్వులిచ్చింది. వీటిని 2011-12, 2012-13, 2013-14 సంవత్సరాలకు వర్తింపచేసింది.
కొత్త విధానం ద్వారా బిల్లింగ్ చేయడాన్ని సవాలుచేస్తూ పెద్దసంఖ్యలో గృహ వినియోగదారులు, వాణిజ్య సంస్థలు హైకోర్టును ఆశ్రయించాయి. ఈ వ్యాజ్యాలను విచారించిన సింగిల్ జడ్జి.. ఈఆర్‌సీ అనుసరించిన విధానాన్ని తప్పుపడుతూ 2013లో తీర్పునిచ్చారు. ఈ తీర్పును సవాలు చేస్తూ అటు ఈఆర్‌సీ, ఇటు ఇరురాష్ట్రాలకు చెందిన విద్యుత్ పంపిణీ సంస్థలు ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేశాయి. వీటిని విచారించిన ధర్మాసనం.. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును కొట్టేసింది.