సాక్షి, కర్నూలు : దేవుడు వరమిచ్చినా.. పూజారి కరుణించని చందంగా మారింది జిల్లాలో తెలుగు తమ్ముళ్ల పరిస్థితి. నామినేటెడ్ పదవుల విషయంలో పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న వారిని జిల్లా నేతలు దూరం పెడుతున్నారు. కాదూ.. కూడదు అంటే పదవికి ఇంత ఇవ్వాలని బేరం చేస్తున్నారు. అడిగినంత ఇస్తేనే నామినేటెడ్ పదవి అంటూ తెగేసి చెబుతున్నారు.
పది సంవత్సరాల తర్వాత అధికారంలోకి రావడంతో నామినేటెడ్ పదవులు వస్తాయని ఆశించిన వారికి నిరాశే ఎదురవుతోంది. ఈనెల ఒకటిన దేవాలయాల పాలక మండళ్లను రద్దు చేస్తూ రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఆగస్టు చివరి నాటికి కొత్త కమిటీలు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. దీంతో జిల్లాలోని ఆలయ పాలకమండళ్లలో పాగా వేసేందుకు ఆశావహులు ప్రయత్నాలు మొదలెట్టారు.
జిల్లాలో ఇదీ పరిస్థితి..
రాయలసీమలో అత్యధిక దేవాలయాలు ఉన్న జిల్లా కర్నూలు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన వాటి సంఖ్యా ఇక్కడే అధికం. కోటి రూపాయలకు పైగా ఆదాయం వచ్చే ఆలయాలు ఐదు ఉన్నాయి. వాటిలో శ్రీశైలం అతి పెద్దది కాగా మహానంది, ఉరుకుంద, అహోబిలం, ఆర్.ఎస్.రంగాపురం(మద్దిలేటి స్వామి) తరువాత స్థానాల్లో నిలుస్తాయి. ప్రస్తుతం శ్రీశైలం, ఉరుకుంద దేవస్థానాలకు ఆలయ కమిటీలు ఉన్నప్పటికీ తాజాగా ప్రభుత్వ నిర్ణయంతో అవి రద్దు కాబోతున్నాయి.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన శ్రీశైలం దేవస్థానం పాలక మండలి చైర్మన్ పదవికి టీడీపీ నుంచి తుగ్గలి నాగేంద్ర పోటీపడుతున్నారు. జిల్లా పరిషత్తు చైర్మన్ పదవిని ఆశించిన ఆయన.. కొన్ని కారణాలతో తప్పుకోవాల్సి వచ్చింది. ప్రత్యామ్నాయంగా శ్రీశైలం ట్రస్ట్ బోర్డులో అవకాశం ఇస్తామని ఓ సీనియర్ నేత హామీ ఇచ్చినట్లు టీడీపీ నేతల్లో ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పుడు ఆ పదవి దక్కాలంటే కనీసం రూ. కోటి ఇవ్వాలంటూ ఆ సీనియర్ నేత సోదరుడు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. పార్టీ కోసం ఇన్నేళ్లు కష్టపడినందుకు తగిన ఫలితమే దక్కిందంటూ నాగేంద్ర తన సన్నిహితులతో చెప్పుకుని బాధపడినట్లు సమాచారం. ఈ విషయంపై అధినేత వద్ద పంచాయితీ పెట్టి తనకు న్యాయం చేయాలని అడగాలని భావిస్తున్నట్లు తెలిసింది.
అన్నింటికీ బేరసారాలు..
ఇదే పద్ధతిన మిగిలిన దేవాలయాలకు కొత్త కమిటీలను వేసేందుకు నేతలు సన్నద్ధమయ్యారు. మహానంది, ఆహోబిలం, ఆర్.ఎస్.రంగాపురం కీలకమైన దేవస్థానాలు కావడంతో నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొని ఉంది. శ్రీశైల దేవస్థానానికి ఏటా రూ. 100 కోట్లకుపైగా ఆదాయం వస్తుండగా, మహానంది దేవస్థానానికి ఏటా రూ. 5 కోట్లకుపైగా ఆదాయం ఉంది. ఉరుకుంద, ఆర్‌ఎస్ రంగాపురం, ఆహోబిలం, యాగంటి దేవాలయాలకు రూ. 2 కోట్ల నుంచి రూ. 4 కోట్ల వరకూ ఆదాయం లభిస్తోంది.
బేతంచెర్ల మండలంలోని మద్దిలేటి స్వామి దేవస్థానానికి ఆ ప్రాంత వాసులే చైర్మన్ పోస్టు కోసం పోటీ పడుతున్నారు. అయితే నియోజకవర్గస్థాయిలో పార్టీకి సంబంధించిన ఖర్చులంతా భరించాలని అక్కడి నాయకుడు షరతు విధించినట్లు చర్చ జరుగుతోంది. ఇక వీటితో పాటు రూ. 20 లక్షల నుంచి రూ. కోటి మధ్యన ఆదాయం ఉండే దేవాలయాలు మూడు ఉన్నాయి. వాటిలో కొత్తూరు సుబ్రమణ్యస్వామికి ట్రస్టుబోర్డు ఉండగా మిగిలిన వాటికి ఇంకా ఏర్పడలేదు.
బనగానపల్లె నియోజకవర్గంలో ఉన్న నందవరం చౌడేశ్వరీ దేవి ఆలయం, పాణ్యం పరిధిలో ఉన్న కాల్వబుగ్గ ఆంజనేయస్వామి దేవస్థానాలకు గట్టి పోటీ ఉంది. రూ. 2 లక్షల నుంచి రూ. 20 లక్షలలోపు ఉన్న దేవాలయాలు 89 ఉన్నాయి. జిల్లాలో 81 దేవాలయాలకు ట్రస్టుబోర్డు ఏర్పాటుకు దేవదాయశాఖ అనుమతి ఉంది. ప్రస్తుతం 29 దేవాలయాలకు ఆలయ కమిటీలు కొనసాగుతుండగా 52కు కొత్త కమిటీలు ఏర్పాటు చేయాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. రూ. కోటికిపైగా ఆదాయం ఉండే ఆలయాల ట్రస్ట్‌బోర్డు ఏర్పాటు దేవదాయశాఖ పరిధిలో ఉండగా.. అంతకంటే తక్కువ ఆదాయం ఉండే వాటికి సంబంధించి జిల్లా స్థాయిలోనే నిర్ణయం తీసుకునే వెసులుబాటు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
పండుగల నాటికల్లా కమిటీల ఏర్పాటు అనివార్యమేనా..?
రాష్ట్ర ప్రభుత్వం కొత్త పాలక మండళ్ల ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంది. ఆ ప్రకటన జారీ చేశాక కమిటీ సభ్యుల నియామకానికి కనీసం నెల రోజుల వరకు సమయం పట్టే అవకాశం ఉండగా ఈ లోగా వినాయకచవితి పండుగ ముంచుకొస్తోంది. ఆ తర్వాత దసరా వస్తుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నూతన ధర్మకర్తల కమిటీ నియామకం నిమిత్తం నోటిఫికేషన్‌ను ఎప్పుడెప్పుడు జారీ చేస్తుందా అని టీడీపీ నేతలు ఆశగా ఎదురు చూస్తున్నారు.
పండుగలు వచ్చేస్తున్న సందదర్భంగా ప్రభుత్వం నూతన పాలక కమిటీలను యుద్ధ ప్రాతిపదికన నియమించాల్సి ఉంది. లేని పక్షంలో చవితి, నవరాత్రి మహోత్సవాల నిర్వహణకు తప్పనిసరిగా ఉత్సవ కమిటీలను ఏర్పాటు చేయవలసి వస్తుంది.
రండి బాబూ.. రండి..
Published Thu, Aug 21 2014 1:24 AM | Last Updated on Wed, Oct 17 2018 6:27 PM
Advertisement
Advertisement