ఏలూరు (అర్బన్) : న్యాయవాది రాయల్ హత్యకేసులో నిందితులు జిల్లా కోర్టులో లొంగిపోనున్నారనే ప్రచారం గురువారం జోరుగా సాగింది. రోజంతా హైడ్రామా నడిచింది. దీంతో కోర్టు పరిసర ప్రాంతాల్లో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. నిందితులెవరో తెలిసినప్పటికీ వారిని అదుపులోకి తీసుకోవడంలో విఫలమయ్యారనే ఆరోపణలు రావడంతో పోలీసులు ఈ కేసును సవాల్‌గా తీసుకున్నారు.
నిందితులకు కోర్టులో లొంగిపోయే అవకాశం ఇవ్వరాదనే ఉద్దేశంతో ఉదయం నుంచే కోర్టు పరిసరాలతోపాటు న్యాయస్థానానికి వచ్చే అన్ని దారుల్లో నిఘా పెంచారు. గతంలో కొన్ని కేసుల్లో నిందితులు మారువేషాల్లో, న్యాయవాదుల అవతారాల్లో, కార్లలో నేరుగా కోర్టు ఆవరణలోకి వచ్చి న్యాయమూర్తి ఎదుట లొంగిపోయిన ఘటనలు ఉన్న నేపథ్యంలో పోలీసులు వాటిని పరిగణనలోకి తీసుకుని నిఘా ఏర్పాటు చేశారు. గురువారం కోర్టు వేళలు ముగిసే సమయానికి కూడా నిందితులు రాకపోవడంతో వారికోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
కోర్టుకు మూడు రోజులు సెలవు
శుక్రవారం ఉగాది, ఆపై రెండో శనివారం, ఆదివారం కావడంతో జిల్లా కోర్టుకు వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి. ఈ నేపథ్యంలో రాయల్ హత్యకేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న ప్రభుదాసుతోపాటు మిగతావారు ఈ మూడురోజుల్లో కోర్టులో లొంగిపోయే అవకాశాలు లేవు. దీంతో వారిని ఎలాగైనా ఈలోగానే పట్టుకోవాలని పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. నిందితులు లొంగిపోక ముందే అరెస్టు చేసి పరువు నిలుపుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నిందితుల స్నేహితులు, బంధువులను ఆరా తీయడం ద్వారా త్వరగా పట్టుకోవచ్చనే అభిప్రాయానికి పోలీసులు వచ్చినట్టు సమాచారం. ఈ మేరకు ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలుస్తోంది. కొందరిపై నిఘా కూడా పెట్టినట్టు సమాచారం.
విచారణాధికారిగా సీసీఎస్ డీఎస్పీ తోట!
రాయల్ హత్యకేసులో విచారణాధికారిని మారుస్తూ పోలీసు అధికారులు గురువారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. నిందితులెవరో తెలిసినా.. ప్రస్తుతం విచారణాధికారిగా ఉన్న టౌన్ సీఐ ఎన్.రాజశేఖర్ వారిని అదుపులోకి తీసుకోవడంలో పురోగతి సాధించ లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. సీసీఎస్ డీఎస్పీ తోట సత్యనారాయణను విచారణాధికారిగా నియమించారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.
నిందితులకు సహాయ నిరాకరణ
ఏలూరు (సెంట్రల్) : న్యాయవాది రాయల్‌ను అతి దారుణంగా హత్య చేసిన నిందితుల తరఫున బెయిల్ పిటీషన్లు వేయడం కానీ, వారికి న్యాయ సలహాలు ఇవ్వడం గానీ చేయకూడదని జిల్లా కోర్టు లోని న్యాయవాదులు తీర్మానం చేశారు. గురువారం బార్ అసోసియేషన్ సమావేశ మందిరంలో న్యాయవాది ఎన్.కృష్ణారావు అధ్యక్షతన రాయల్ సంతాప సభ ఏర్పాటు చేశారు. రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు. ప్రముఖ న్యాయవాది రోనాల్డ్ రాజు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రభాకర్ రాయల్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. న్యాయవాది మంచినపల్లి సూర్యనారాయణ మాట్లాడుతూ నిందితులకు శిక్షపడే వరకూ ఉద్యమించాలని పిలుపునిచ్చారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అబ్బినేని విజయ్‌కుమార్, జనరల్ సెక్రటరీ సీహెచ్ రాజేంద్రప్రసాద్, సీనియర్ న్యాయవాది కానాల రామకృష్ణ, గుప్తా తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కోర్టు వద్ద హైడ్రామా
Published Fri, Apr 8 2016 12:40 AM | Last Updated on Sun, Sep 3 2017 9:25 PM
Advertisement
Advertisement