ఆక్రమిత స్థలం వద్ద బైఠాయించిన టీడీపీ నేతలు
శ్రీకాకుళం: కాలువను ఆక్రమించారు.. ఆక్రమణ తొలగింపును అడ్డుకోవాలనుకున్నారు.. ఫిర్యాదు చేశారన్న కోపంతో ప్రత్యర్థి పార్టీ కార్యకర్తలపై దాడికి తెగబడ్డారు. పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలో టీడీపీ నాయకులు తమకు అలవాటైన రీతిలో నీచ రాజకీయాలకు పాల్పడ్డారు. శనివారం రాత్రి చినబడాంలో హైడ్రామా సృష్టించి హడావుడి చేశారు. స్థానిక చోటా నాయకులకు తోడుగా నియోజకవర్గ నేతలు కూడా ఈ రాజకీయ డ్రామాలో పాలు పంచుకున్నారు. వివరాల్లోకి వెళితే..
పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ 7వ వార్డు చినబడాంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు బడ్డ నాగరాజు సాగునీటి కాలువను ఆక్రమించారు. ఖరీఫ్ పనులు ఊపందుకోవడం, సాగునీటికి ఇబ్బందులు ఎదురవుతుండడంతో ఈ ఆక్రమణలపై స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఆక్రమణలను తొలగించడానికి అధికారులు కూడా సిద్ధమైనట్టు సమాచారం. అయితే దీనిపై సమాచారం అందుకున్న టీడీపీ నాయకులు ఈ అంశాన్ని రాజకీయం చేయడానికి చూశారు.
అధికారులకు ఫిర్యాదు చేశారనే కారణంతో నలుగురు వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడికి తెగబడ్డారు. బాధితులు కాశీబుగ్గ పోలీసులను ఆశ్రయించారు. ఆక్రమిత స్థలం వద్ద రాత్రిపూట కుర్చీలు వేసుకుని మరీ కూర్చున్నారు. అధికారులు వస్తే అడ్డుకుందామని, ఈ గొడవను రాజకీయంగా వాడుకుందామని అనుకున్నారు. ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్, గౌతు శిరీష ఆక్రమిత స్థలం వద్దకు వచ్చి ఆక్రమణదారుడికి మద్దతు పలకడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment