హైటెక్‌ ప్రచారం.. లోటెక్‌ వైద్యం | Hightech Campaign .. Lotech Healthing | Sakshi
Sakshi News home page

హైటెక్‌ ప్రచారం.. లోటెక్‌ వైద్యం

Published Thu, Mar 14 2019 12:58 PM | Last Updated on Thu, Mar 14 2019 12:59 PM

 Hightech Campaign .. Lotech Healthing - Sakshi

అనారోగ్యంతో ధర్మాసుపత్రికి పోతే ప్రాణాలు పోతాయి.. కార్పొరేట్‌ హాస్పిటల్‌కు వెళ్తే ఆస్తులు కరుగుతాయి అన్నట్లుగా రోజులు మారిన నేపథ్యంలో నిరుపేదలకు మెరుగైన వైద్యం భారమవుతోంది.  పేదలందరికీ ఆధునిక వైద్యం.. అందరికీ ఆరోగ్యం.. ఉచితంగానే అన్నీ పరీక్షలు.. ఇలా ఎన్నో పథకాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్భాటంగా ప్రకటించి ఆచరణలో చేతెలెత్తేశారు. ఐదేళ్ల పాలనలో పేదల ఆరోగ్య పరిరక్షణ గాలిలో దీపంలా మారింది. కుయ్‌ కుయ్‌ మనే 108 వాహనాలు  కుయ్యో మొర్రో అంటున్నాయి. సంచార చికిత్స వాహనాలు గ్రామాల వైపు కన్నెత్తి చూడటం లేదు. మురికివాడల్లోని ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాల్లో నామమాత్ర వైద్య సేవలే అందుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని ఆరోగ్య కేంద్రాల్లో ఆరోగ్య పరీక్షలు అధిక శాతం బోగస్‌గా నమోదవుతున్నాయి. బడిపిల్లలకు ఆరోగ్య పరీక్షలు చేస్తామని చెప్పిన బాలసురక్ష వాహనాల కోసం పిల్లలు ఎదురు చూస్తున్నారు.          
 – కర్నూలు(హాస్పిటల్‌)   

సాక్షి, కర్నూలు: రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు ఆసుపత్రిలో గాకుండా 133 రకాల శస్త్ర చికిత్సలను కేవలం ప్రభుత్వ ఆసుపత్రిలో మాత్రమే ఎన్‌టీఆర్‌ వైద్యసేవ(ఆరోగ్యశ్రీ) ద్వారా చేయించుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. అయితే కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో రోగులకు ప్రైవేటుకు మించి ఖర్చు అవుతోంది. అత్యవసరం పేరుతో అధిక శాతం మందులను బయటి నుంచి రోగులతో కొనిపిస్తున్నారు. ఎన్‌టీఆర్‌ వైద్యసేవ పథకం వర్తించినా సదరు రోగి కుటుంబీకులు డిశ్చార్జ్‌ అయ్యేలోగా రూ.4 వేల నుంచి రూ.30వేల దాకా ఖర్చు పెడుతున్నారు.

ఇలా ఖర్చు పెట్టిన మొత్తంలో కేవలం 10 శాతం మాత్రమే నెలల తరబడి తిప్పుకుని వెనక్కి ఇస్తున్నారు. ఇలా తిరగలేక చాలా మంది ఆ మొత్తాన్ని కూడా వదిలేస్తున్నారు. మరోవైపు ఎన్‌టీఆర్‌ వైద్యసేవ ద్వారా వచ్చిన క్లెయిమ్‌ నిధుల నుంచి వాటా రూపేణా అధికారులు, వైద్యులు, పారా మెడికల్, స్టాఫ్‌ నర్సులు, ఇతర సిబ్బంది పంచుకుంటున్నారు. మరోవైపు ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో ఎన్‌టీఆర్‌ వైద్యసేవ పథకం ఉన్నా తగిన ప్యాకేజి మొత్తం లేకపోవడంతో చాలా ఆసుపత్రులు రోగుల నుంచి ప్యాకేజికి మించిన మొత్తాన్ని వసూలు చేస్తున్నాయి. మరికొన్ని ఆసుపత్రులు మా వల్ల కాదంటూ వెనక్కి పంపిస్తున్నాయి.  

ఆపద్బాంధవుడికి అష్టకష్టాలు 
జిల్లాలో ప్రస్తుతం 108 అత్యవసర అంబులెన్స్‌లు 32 ఉన్నాయి. వీటిలో అధిక శాతం వాహనాలు మరమ్మతులకు గురయ్యాయి. అయినా నిర్వహణ పనులు చేపట్టకుండా వాటిని అలాగే తిప్పుతున్నారు. ఏ బండి ఎక్కడ ఆగిపోతుందోనని డ్రైవర్లు(పైలెట్లు) తీవ్ర ఆందోళనలో విధులు నిర్వహిస్తున్నారు. ప్రతి వాహనానికి రూ.2,500 విలువ జేసే డీజిల్‌ కార్డు మాత్రమే ఇస్తున్నారు. ఒక్కోసారి ఇంధనం చాలక షెడ్డుకే వాహనాలు పరిమితం చేయాల్సి వస్తోంది. ఇందులో పనిచేసే 64 మంది పైలెట్లు, టెక్నీషియన్లకు సైతం రెండు నెలల నుంచి జీతాలు రావడం లేదు. అడిగితే టెర్మినేట్‌ చేస్తామని యాజమాన్యం బెదిరిస్తోందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

  
బడికి రాని బాలసురక్ష 
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల ఆరోగ్యస్థితిగతులను తెలుసుకునేందుకు బాల సురక్ష పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీనిని కూడా ధనుష్‌ అనే సంస్థకు అప్పగించింది. ఇందుకు గాను జిల్లాలోని మండల, జిల్లా పరిషత్‌ పాఠశాలల్లోని ఒకటి నుంచి 10వ తరగతి విద్యార్థులకు అవసరమైన వైద్యపరీక్షలు నిర్వహించి చికిత్స అందించాలి. అయితే ఈ పథకం ప్రారంభమైన ఆరు నెలల వరకు ఎలాంటి కార్యక్రమాలను ఈ సంస్థ చేపట్టలేదని, ఇటీవలే కార్యక్రమాన్ని ప్రారంభించిందని జిల్లా స్థాయి అధికారులు సైతం చెబుతున్నారు. ఈ కార్యక్రమం సైతం సరిగ్గా నిర్వహించడం లేదని అధికారులు ప్రభుత్వానికి పలుమార్లు నివేదికలు పంపించారు.

 
సంచార వాహనాల్లో మందుల కొరత 
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో గ్రామాల్లో సేవలు అందించిన 104 సంచార వాహనాలను నేడు రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రైవేటు సంస్థకు అప్పగించింది. ఈ సంస్థ చంద్రన్న సంచార చికిత్సగా నామకరణం చేసి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి 5 కిలో మీటర్ల ఆవల ఉన్న గ్రామాలకు వాహనాన్ని తీసుకెళ్లి గ్రామీణులకు చికిత్స అందిస్తోంది. అయితే ఇలా వెళ్లిన వాహనాల్లో సిబ్బంది సరిగ్గా ఉండటం లేదని, మందులు కూడా ఇవ్వడం లేదని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీపీ, షుగర్‌ మందులు కూడా తగినంత ఇవ్వకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిర్ణీత తేదీల్లోనూ ఈ వాహనాలు ఆయా గ్రామాలకు వెళ్లడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  


ఆరోగ్య కేంద్రాల్లో బోగస్‌ పరీక్షలు 
జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లలో డయా గ్నోస్టిక్‌ పరీక్షలు (రక్త, మూత్ర పరీక్షలు)ను, ఎక్స్‌రే తీసేందుకు రాష్ట్ర ప్రభు త్వం ప్రైవేటు సంస్థలకు అప్పగించింది. కొన్ని చోట్ల వైద్యుల సహాయంతో ముందుగానే సంతకాలు చేయించి అవసరం లేకపోయినా రోగులకు పరీక్షలు చేస్తున్నారు. అందులో కొన్ని మాత్రమే చేసి, మిగిలిన వాటికి నార్మల్‌ రిపోర్ట్‌లు ఇస్తున్నారు. ఇలా ఆసుపత్రికి వచ్చిన రోగుల్లో 20 నుంచి 30 శాతం మంది రోగులకు పరీక్షలు చేశామని పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి బిల్లులు డ్రా చేసుకుంటున్నాయి. కొన్ని చోట్ల వైద్యుల సంతకాలు లేకపోయినా రోగులకు పరీక్షలు చేసినట్లు రాసుకుని బిల్లులు డ్రా చేసుకుంటున్నా అడిగే నాథుడు కరువయ్యారు. 


ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలకు ఆదరణ కరువు 
పట్టణాల్లోని మురికివాడల్లో స్వచ్ఛంద సంస్థలు నిర్వహిస్తున్న అర్బన్‌హెల్త్‌ సెంటర్లను రాష్ట్ర ప్రభుత్వం అపోలో సంస్థకు అప్పగించింది. వీటిని ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలుగా నామకరణం చేసింది. రెగ్యులర్‌గా అందే సేవలతో పాటు టెలి మెడిసిన్‌ను కూడా రోగులకు అందిస్తామని ఆ సంస్థ చెప్పింది. అయితే ఈ సంస్థ వచ్చిన తర్వాత ఏఎన్‌ఎంలు క్షేత్రస్థాయికి వెళ్లి చికిత్సలు చేయడం లేదు. రోగులే కేంద్రానికి వచ్చి చికిత్స తీసుకోవాల్సి వస్తోంది. టెలి మెడిసిన్‌ సైతం అందించడం లేదని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు గర్భిణిలు, పిల్లలకు సైతం సరైన వైద్యం అందించేందుకు వైద్యులు అందుబాటులో ఉండటం లేదన్న విమర్శలు ఉన్నాయి.  

రూ.40 వేల మందులు బయట కొన్నా  
నాకు ముగ్గురు పిల్లలు. రెండో కుమారుడు యూనుస్‌(5)కు అపెండిక్స్‌ వచ్చింది. మూడు వారాల క్రితం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని చిన్నపిల్లల శస్త్రచికిత్స విభాగంలో చేర్పించాము. వెంటనే డాక్టర్లు స్పందించి ఆపరేషన్‌ చేశారు. అయితే ఆపరేషన్‌ వికటించడంతో మళ్లీ గత సోమవారం ఆపరేషన్‌ చేశారు. అయితే బాబు కోలుకోలేక 9వ తేదీన మరణించాడు. మూడు వారాల సమయంలో మాకు రూ.40 వేల దాకా మందులు, ఇతర ఖర్చులు అయ్యాయి. ఎన్‌టీఆర్‌ వైద్యసేవ కింద చికిత్స చేస్తున్నామని చెప్పినా ఇంత స్థాయిలో ఖర్చు అయ్యింది.  

– యూసుఫ్, తిరుమిల్ల గ్రామం, కంభం మండలం, ప్రకాశం జిల్లా    

108కు ఫోన్‌ చేస్తే బిజీ అని చెబుతున్నారు 
రెండు వారాల క్రితం నా ఫ్రెండ్‌కు రోడ్డు ప్రమాదం జరగడంతో వెంటనే 108కు ఫోన్‌ చేశాము. ఆ నెంబర్‌ రింగ్‌ అవుతోంది గానీ ఎవరూ లిఫ్ట్‌ చేయడం లేదు. కొంత సేపటికి నా మరో ఫ్రెండ్‌ ఫోన్‌ చేస్తే లిఫ్ట్‌ చేశారు. అయితే వాహనాలన్నీ బిజీగా ఉన్నాయి...కాస్త ఆలస్యం అవుతుందని, వేచి ఉండాలని చెప్పి ఫోన్‌ పెట్టేశారు. ఫోన్‌లోనే రోగి స్థితిగతులను అడిగి తెలుసుకుని, ఇలా చేయండి...అలా చేయండి అంటూ సూచనలు, సలహాలు ఇచ్చారు. దీంతో ఆలస్యం అవుతుందని చెప్పి మేమే ఆటోలో ఆసుపత్రికి తరలించాము.                                        

– బషీర్, కల్లూరు    

డాక్టర్లు ఉండటం లేదు
కర్నూలులోని ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు ఉండటం లేదు. టెలిమెడిసిన్‌ ద్వారా చికిత్స అందిస్తామంటున్నారు గానీ రోగులను వేచి ఉండాలని చెబుతున్నారు. గంటల తరబడి రోగులు అక్కడ కూర్చోలేక వెనక్కిపోతున్నారు. మాది స్వచ్ఛంద సంస్థ. పేదలకు సేవ చేయాలన్న భావనతో ఆరోగ్య కేంద్రాలకు రోగులను తీసుకెళ్తుంటాము. కానీ అక్కడ సరైన వైద్యసేవలు అందకపోవడంతో రోగులు నిరాశ చెందుతున్నారు.  

– ప్రసాద్, స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు, కర్నూలు  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement