poor people health
-
పేదవాడి ప్రాణం.. ఖరీదెంత?!
మిర్యాలగూడ అర్బన్ : ఆరోగ్యం బాగా లేక ఆస్పత్రికి వస్తే.. వచ్చిన రోగం పోవడం దేవుడెరుగు.. అసలు ప్రాణమే లేకుండా పోతే..! ఆ ప్రాణానికి ఖరీదు కట్టి చేతులు దులుపుకుంటున్నారు కొందరు ప్రైవేట్ ఆస్పత్రుల వైద్యులు. పెద్ద మనుషులుగా చెలామణి అవుతున్న వారు సైతం వైద్యులకే వత్తాసు పలుకుతూ బాధిత కుటుంబాల్లో కన్నీరు మిగిలిస్తున్నారు. ఒక్కోసారి రోగులు, వారి బంధువులును సైతం బెదిరించి విషయం బయటికి పొక్కకుండా పెద్ద మనుషులు (రౌడీ షీటర్లు) ఆయా ఆస్పత్రులకు అండగా నిలుస్తున్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాహకులు వారిని పెంచి పోషిస్తున్నారని ప్రజలకు తెలిసిన విషయమే. అనేక చావులను బయటికి రానీయకుండా ప్రాణాలకు ఖరీదు కట్టి చేతులు దులుపుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న వీరికి అడ్డుకట్ట వేయాల్సిన జిల్లా వైద్యధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వైద్యుల నిర్లక్ష్యాన్ని తెలిపే ఘటనలు ఇలా.. ● దామరచర్ల మండలం ఇర్కిగూడెం గ్రామానికి చెందిన దాసరి యల్లయ్య తన కూతురు మీనాక్షి(9)తో కలిసి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో కాలు విరిగింది. ఈ నెల 14వ తేదీన మిర్యాలగూడ పట్టణంలోని రెడ్డీకాలనీలో గల ఓ వైద్యశాలకు తీసుకొచ్చారు. బాలికలను పరీక్షించిన ఎముకల వైద్యుడు కాలికి ఆపరేషన్ చేయాలని థియేటర్‌కు తీసుకెళ్లి ఎముకల వైద్యుడే మత్తు మందు ఇచ్చాడు. మిర్యాలగూడలో ఓ ప్రైవేట్ ఆస్పత్రి ఎదుట ఆందోళన చేస్తున్న రోగి బంధువులు (ఫైల్) కొద్ది సేపటికే బాలిక అపస్మారక స్థితిలోకి పోవడంతో ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు వచ్చిన వైద్యుడు బాలిక పరిస్థితి విషమంగా ఉందని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తీసుకెళ్లాలని చెప్పి స్వయంగా అంబులెన్స్ ఏర్పాటు చేసి హడావుడిగా వారిని హైదరాబాద్ తరలించి ఆస్పత్రికి తాళం వేసి వెళ్లిపోయాడు. హైదరాబాద్‌కు తీసుకెళ్లే సరికి ఆ బాలిక మృతిచెందింది. వెంటనే పెద్ద మనుషులు రంగంలోకి దిగి బాలిక ప్రాణానికి రూ.5లక్షలు ఖరీదు కట్టారు. ● గత సంవత్సరం ఆగస్టు 30న త్రిపురారం మండలం రేగులగడ్డ గ్రామానికి చెందిన మాతంగి రాధ (38) కడుపునొప్పితో బాధపడుతూ మిర్యాలగూడ పట్టణంలోని డాక్టర్స్ కాలనీలో గల ఓ మల్టీసెపషాలిటీ ఆస్పత్రికి వచ్చింది. ఆమెను పరీక్షించిన సదరు వైద్యుడు ఆపరేషన్ చేసి గర్భసంచి తొలగించారు. వారంరోజుల తరువాత డిశ్చార్జి అయి ఇంటికి వెళ్లిన రాధకు తీవ్ర రక్తస్రావం కావడంతో భయపడిన కుటుంబ సభ్యులు తిరిగి ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆమెను పరీక్షించిన సదరు వైద్యుడు వైద్య సేవలు ప్రారంభించారు. అయినప్పటికీ మహిళ ఆరోగ్యం బాగు పడకపోగా మరింత క్షీణించింది. దీంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తీసుకెళ్లాలని సూచించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో నల్లగొండకు తరలించి చికిత్స అందిస్తుండగా ఆమె మృతి చెందింది. కాగా పెద్ద మనుషుల జోక్యంతో మృతురాలి కుటుంబానికి రూ.3 లక్షలు ఇచ్చారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో నిబంధనలకు నీళ్లు.. అన్నీ మావే.. అంతా మాకే.. అన్నట్లుగా ఉంది మిర్యాలగూడలో వైద్యులు తీరు. ఆస్పత్రులతోపాటు ల్యాబ్, మెడికల్ షాప్ వంటి వ్యాపారాలన్నీ వారే ఏర్పాటు చేసుకుని ఎలాంటి అర్హత లేని సిబ్బందిని పనిలో పెట్టుకుని రోగుల జేబులు గుళ్ల చేస్తున్నారు. ఏదైనా రోగం వచ్చిందని వైద్యుడి వద్దకు వెళ్తే.. అవసరం లేకపోయినా అన్ని రకాల పరీక్షలు రాసి తమవద్దే చేయించుకోవాలని వారిని ఒత్తిడికి గురి చేస్తున్నారని రోగులు బంధువులు ఆరోపిస్తున్నారు. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో రోగి మృతిచెందడంతో ఆందోళన చేస్తున్న బంధువులు (ఫైల్) తమకు నచ్చిన విధంగా ల్యాబ్ నుంచి రిపోర్టులు రాయించుకుని ఏ జబ్బూ లేకున్నా వేల రూపాయల మందులు తమ సొంత మెడికల్ షాపుల ద్వారా అంటగడుతున్నారనే విమర్శలు లేకపోలేదు. ఇప్పటికై నా జిల్లా వైద్యాధికారులు స్పందించి ప్రభుత్వ నిబంధనలను ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యం పాటించేలా చర్యలు తీసుకోవడంతో పాటు అకారణంగా రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న వైద్యులపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
పట్టణ పేదలకు ఆరోగ్య ధీమా
సాక్షి, అమరావతి: గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసేవలే కాదు.. పట్టణ పేదలకూ సర్కారు ఆరోగ్య ధీమా ఇచ్చింది. పట్టణాల్లో పేదలు, మధ్యతరగతి వారు ఆస్పత్రుల ఖర్చు భరించలేనంతగా పెరగడంతో వారి ఆరోగ్యానికి భరోసా ఇస్తూ 560 పట్టణ ఆరోగ్యకేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఇవి అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రంలో 1.60 కోట్ల మంది పట్టణాల్లో ఉన్నారు. అందులో 37 శాతంమంది మురికివాడల్లో ఉంటున్నారు. వైద్యం అవసరమైనవారు పెద్దాస్పత్రులకు వెళ్లడం ఇబ్బందిగా ఉంది. ప్రైవేటు డాక్టరు దగ్గరికి వెళితే ఫీజు, వ్యాధి నిర్ధారణ పరీక్షల బిల్లులు భరించలేనంతగా ఉంటున్నాయి. దీంతో వారు ఆరోగ్యపరంగాను, ఆర్థికంగాను మరింత చితికిపోతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం.. పట్టణాల్లో ఉన్న పేదలకు వైద్యం అందుబాటులో ఉండాలన్న లక్ష్యంతో పట్టణ ఆరోగ్యకేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. ప్రస్తుతం ఉన్న 260 పట్టణ ఆరోగ్యకేంద్రాలను, 71 కుటుంబ ఆరోగ్యకేంద్రాలను (మొత్తం 331) ఉన్నతీకరిస్తూ, కొత్తగా 229 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. భవనాల నిర్మాణం, మరమ్మతులు, పరికరాలు, ఫర్నిచర్ కోసం రూ.416.50 కోట్లు వెచ్చిస్తున్నారు. ఈ కేంద్రాల్లో వైద్యులు, ల్యాబ్టెక్నీషియన్లు, డేటాఎంట్రీ ఆపరేటర్లు, సహాయక సిబ్బంది 560 మంది వంతున, స్టాఫ్ నర్సులు 1,120 మంది ఉంటారు. దేశంలోనే మొదటిసారిగా.. దేశంలో ఇప్పటివరకు ఏ రాష్ట్రమూ పట్టణాల్లో ప్రాథమిక ఆరోగ్యంపై ఇంత భారీస్థాయిలో ఏర్పాట్లు చేసిన దాఖలాలు లేవు. తొలిసారిగా 111 మున్సిపాలిటీల్లో 560 ఆరోగ్యకేంద్రాలను ఏర్పాటు చేస్తున్నది మన రాష్ట్రంలోనే. స్పెషాలిటీ వైద్యానికి ఎలాగూ బోధనాస్పత్రులున్నాయి. ప్రాథమిక ఆరోగ్యం అంటే.. చిన్న జ్వరాలు, గాయాలు వంటి వాటికి ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించకుండా భారీవ్యయంతో పట్టణ ఆరోగ్యకేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేకంగా 8,600కుపైగా వైఎస్సార్ హెల్త్‌క్లినిక్‌లు ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో సేవలు ఇలా ► పట్టణాల్లో ఉన్న వారికి 15 నిమిషాల నడక దూరంలో ఆస్పత్రి ఉంటుంది. ► డాక్టరు, స్టాఫ్ నర్సుతో పాటు అత్యవసర వైద్యసేవలకోసం ఆరు పడకలుంటాయి. ► 63 రకాల రోగనిర్ధారణ పరీక్షలు అందుబాటులో.. ► ప్రస్తుతం 260 వరకు పట్టణ ఆరోగ్యకేంద్రాలు పీపీపీ పద్ధతిలో నడుస్తున్నాయి. ► వీటికోసం ఏటా రూ.150 కోట్లు ప్రైవేటు సంస్థలకు ఇస్తున్నారు. ► ఇదే రూ.150 కోట్లతో అంతకంటే మెరుగ్గా 560 కేంద్రాల్లో సేవలు అందిస్తారు. ► తాజా పట్టణ జనాభా ప్రకారం 26,500 మందికి ఒక ఆరోగ్యకేంద్రం ఉంటుంది. ► గతంలో పీపీపీ కింద అమలవుతున్న ఆరోగ్యకేంద్రాలు 79 పట్టణాల్లో మాత్రమే ఉండేవి. ► ఇప్పుడు 111 పట్టణాల్లోనూ ఆరోగ్యకేంద్రాల సేవలు అందుతాయి. -
మీకు అధికారంలో ఉండే హక్కులేదు - సుప్రీం ఫైర్
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రజలను వణికిస్తున్న తీవ్ర వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు మరోసారి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. తీవ్రమైన వాయు కాలుష్య ప్రమాదాన్ని ఎదుర్కొంటున్న ఢిల్లీ-ఎన్‌సిఆర్ ప్రాంతంలోని కోట్లాది మంది ప్రజల జీవితాలు, వారి రక్షణ పట్టదా అని సుప్రీం బుధవారం మండిపడింది. సంక్షేమ ప్రభుత్వం అనే భావన మీరు (రాష్ట్రాలు) మర్చిపోయారా? పేద ప్రజల గురించి బాధపడటం లేదు, ఇది చాలా దురదృష్టకరమని జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ దీపక్ దీపక్ గుప్తా నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అంతేకాదు ప్రజల గురించి పట్టించుకోనివారికి అధికారంలో ఉండే హక్కు లేదు వ్యాఖ్యానించింది. "కాలుష్యం కారణంగా ప్రజలు ఇలా చనిపోవడానికి మీరు అనుమతించగలరా? దేశాన్ని100 సంవత్సరాల వెనక్కి వెళ్ళడానికి మీరు అనుమతించగలరా" అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పంట వ్యర్థాలను దహనం చేయకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ప్రభుత్వాల నిర్లక్ష్యానికి రైతులను బాధ్యుల్ని చేయడం భావ్యం కాదని తెలిపింది. ఇది కోట్లాదిమంది ప్రజల జీవన్మరణ సమస్య. ఇందుకు ప్రభుత్వాలు బాధ్యత వహించాలి" అని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. పంట వ్యర్థాలను కొనుగోలు చేసేందుకు, వాటిని ఉపయోగించుకునేందుకు తమ వద్ద యంత్రాంగం, నిధులు లేవని, రాష్ట్రం ఇప్పటికే అప్పుల్లో ఉందని పంజాబ్ చీఫ్ సెక్రటరీ సుప్రీంకోర్టుకు నివేదించడంతో..మరోసారి మండిపడిన జస్టిస్ మిశ్రా..మీ వద్ద నిధులు లేకపోతే..మేమే మీకు నిధులు అందజేస్తామని, కేంద్రంపై ఆధారపడటం మాను కోవాలని, మీరు ఏమీ చేయలేకపోతే..ఆ విషయాన్ని కోర్టులకు వదిలేయాలని స్పష్టం చేశారు. విమానాల దారి మళ్లింపు, ప్రజలు తమ నివాసాల్లో కూడా సురక్షితంగా ఉండకపోవడంపై మీకు సిగ్గు అనిపించడం లేదా? అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరు భవంతుల్లో (ఐవరీ టవర్స్) కూర్చుంటే సరిపోతుందా..?కోట్లాది ప్రాణాలకు సంబంధించిన విషయంపైనా సరైన విధంగా స్పందించరా? అని అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది. మీరు భవంతుల్లో కూర్చుని ప్రజల ప్రాణాలు పోయినా పర్వాలేదనుకుంటే.. మీ ప్రాణాలు కూడా పోయే పరిస్థితి వస్తుంది.. మీ ప్రాణాలు పోకుండా ఉండాలంటే మీరు ఏదో ఒకటి చేయాలని ప్రభుత్వాధినేతలకు స్పష్టం చేసింది. ఈ విషయంలో తక్షణ చర్యలను ఆశిస్తున్నామని సుప్రీంకోర్టు పేర్కొంది. -
ఆరోగ్యశ్రీకి పునరుజ్జీవం
సాక్షి, బిట్రగుంట (నెల్లూరు): ఆరోగ్యశ్రీ... ఈపదం వింటేనే దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గుర్తుకు వస్తారు. ప్రభుత్వాసుపత్రుల్లో పేదలకు నాణ్యమైన వైద్యసేవలు అందటం లేదని, ఖరీదైన వైద్యం చేయించుకోలేక పేదలు అసువులుబాస్తున్నారనే ఉద్దేశంతో వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరోగ్యశ్రీ పథకానికి రూపకల్పన చేశారు. ఈ పథకం ద్వారా నిరుపేదలు కూడా నిశ్చింతగా, పైసా ఖర్చు లేకుండానే కార్పొరేట్ వైద్యం పొందగలిగారు. దేశ వ్యాప్తంగా ఈ పథకంపై ప్రశంసలు కూడా వెల్లువెత్తాయి. వైఎస్ మరణం తరువాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు ఈ పథకాన్ని నీరుగార్చడం మొదలుపెట్టాయి. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆరోగ్యశ్రీ పూర్తిగా అటకెక్కించింది. బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో చాలా ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ సేవలను నిలిపేశాయి. దీంతో ఖరీదైన వ్యాధులకు వైద్యం చేయించుకునే స్తోమత లేక పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాదయాత్రలో ఈ విషయాన్ని స్పష్టంగా గుర్తించిన వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యశ్రీకి పునరుజ్జీవం ప్రసాదిస్తానని నవరత్నాల్లో భాగం చేశారు. ఏడాడికి రూ.లక్ష నుంచి రూ.10లక్షల వరకూ ఆరోగ్యశ్రీ వర్తింపచేయనున్నట్లు ప్రకటించడంతో పేదల్లో అమితానందం వ్యక్తమవుతుంది. వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆస్పత్రి ఖర్చులు వెయ్యి దాటిన వెంటనే ఆరోగ్యశ్రీ వర్తింపచేస్తామని జగన్ ప్రకటించారు. అంతే కాకుండా పేదలకు రాష్ట్రంలో కార్పొరేట్ స్థాయి వైద్యంతో పాటు ఇతర రాష్ట్రాల్లో మెరుగైన వైద్యం కోసం వెళ్లినా ఆరోగ్యశ్రీ వర్తింపచేయనున్నట్లు ప్రకటించడంపై ప్రజల్లో ఆనందం వ్యక్తమవుతుంది. ఆరోగ్యశ్రీలో ఇప్పటి వరకూ ఉన్న వ్యాధులతో పాటు అన్ని రకాల వ్యాధులు, ఆపరేషన్లను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువస్తామని ప్రకటించడం, ఆపరేషన్ లేదా చికిత్స తరువాత విశ్రాంతి సమయంలో ఆర్థికసాయం, కిడ్నీ, తలసేమియా లాంటి దీర్ఘకాలిక వ్యాధులకు గురైన రోగులకు నెలకు రూ. 10వేలు ప్రకటించడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పేదలకు సంజీవని జగన్ ప్రకటించిన ఆరోగ్యశ్రీ పేదలకు అపర సంజీవని వంటింది. వైఎస్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీని టీడీపీ ప్రభుత్వం అటకెక్కించి పేదల ప్రాణాలతో ఆడుకుంది. జగన్ అధికారంలోకి వస్తే ఆరోగ్యశ్రీని మరింత విస్తృత చేస్తానని ప్రకటించడం నిజంగా అభినందనీయం. – కోడూరు లక్ష్మిరెడ్డి, సుందరగిరివారికండ్రిగ ఆరోగ్యశ్రీతో పేదల ప్రాణాలకు రక్షణ జగన్ ప్రకటించిన ఆరోగ్యశ్రీతో పేదల ప్రాణాలకు రక్షణ కల్పిస్తుంది. ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం ఆరోగ్యశ్రీని నీరుగార్చింది. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తే ఆరోగ్యశ్రీ ద్వారా ఏడాడికి రూ.లక్ష నుంచి రూ.10లక్షల వరకూ ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తామని జగన్ ప్రకటించడాన్ని ప్రజలంతా స్వాగతిస్తున్నారు. – మద్దిబోయిన వీరరఘు, వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ జగన్‌కు ఆ సత్తా ఉంది ఆరోగ్యశ్రీని సమర్థవంతంగా అమలు చేసే సత్తా జగన్‌కు మాత్రమే ఉంది. దివంగతనేత డాక్టర్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీని ఆయన తరువాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు అటకెక్కించాయి. ఆరోగ్యశ్రీ మళ్లీ సమర్థవంతంగా అమలు కావాలంటే జగన్ అధికారంలోకి రావాలి. – మేకల శ్రీనివాసులు, అరవపాళెం ఆరోగ్యానికి భరోసా జగన్ ప్రకటించిన ఆరోగ్యశ్రీతో పేదల ఆరోగ్యానికి అసలైన భరోసా లభిస్తుంది. ఏడాడికి రూ.10లక్షల వరకూ ఆరోగ్యశ్రీ వర్తించేలా ప్రకటించడం అభినందనీయం. అన్నీ వ్యాధులను ఆరోగ్యశ్రీలో చేర్చడంతో పేదలకు పూర్తి భరోసా లభిస్తుంది. – తుమ్మల రమణయ్య, బోగోలు -
హైటెక్ ప్రచారం.. లోటెక్ వైద్యం
అనారోగ్యంతో ధర్మాసుపత్రికి పోతే ప్రాణాలు పోతాయి.. కార్పొరేట్ హాస్పిటల్‌కు వెళ్తే ఆస్తులు కరుగుతాయి అన్నట్లుగా రోజులు మారిన నేపథ్యంలో నిరుపేదలకు మెరుగైన వైద్యం భారమవుతోంది. పేదలందరికీ ఆధునిక వైద్యం.. అందరికీ ఆరోగ్యం.. ఉచితంగానే అన్నీ పరీక్షలు.. ఇలా ఎన్నో పథకాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్భాటంగా ప్రకటించి ఆచరణలో చేతెలెత్తేశారు. ఐదేళ్ల పాలనలో పేదల ఆరోగ్య పరిరక్షణ గాలిలో దీపంలా మారింది. కుయ్ కుయ్ మనే 108 వాహనాలు కుయ్యో మొర్రో అంటున్నాయి. సంచార చికిత్స వాహనాలు గ్రామాల వైపు కన్నెత్తి చూడటం లేదు. మురికివాడల్లోని ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాల్లో నామమాత్ర వైద్య సేవలే అందుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని ఆరోగ్య కేంద్రాల్లో ఆరోగ్య పరీక్షలు అధిక శాతం బోగస్‌గా నమోదవుతున్నాయి. బడిపిల్లలకు ఆరోగ్య పరీక్షలు చేస్తామని చెప్పిన బాలసురక్ష వాహనాల కోసం పిల్లలు ఎదురు చూస్తున్నారు. – కర్నూలు(హాస్పిటల్) సాక్షి, కర్నూలు: రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు ఆసుపత్రిలో గాకుండా 133 రకాల శస్త్ర చికిత్సలను కేవలం ప్రభుత్వ ఆసుపత్రిలో మాత్రమే ఎన్టీఆర్ వైద్యసేవ(ఆరోగ్యశ్రీ) ద్వారా చేయించుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. అయితే కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో రోగులకు ప్రైవేటుకు మించి ఖర్చు అవుతోంది. అత్యవసరం పేరుతో అధిక శాతం మందులను బయటి నుంచి రోగులతో కొనిపిస్తున్నారు. ఎన్టీఆర్ వైద్యసేవ పథకం వర్తించినా సదరు రోగి కుటుంబీకులు డిశ్చార్జ్ అయ్యేలోగా రూ.4 వేల నుంచి రూ.30వేల దాకా ఖర్చు పెడుతున్నారు. ఇలా ఖర్చు పెట్టిన మొత్తంలో కేవలం 10 శాతం మాత్రమే నెలల తరబడి తిప్పుకుని వెనక్కి ఇస్తున్నారు. ఇలా తిరగలేక చాలా మంది ఆ మొత్తాన్ని కూడా వదిలేస్తున్నారు. మరోవైపు ఎన్టీఆర్ వైద్యసేవ ద్వారా వచ్చిన క్లెయిమ్ నిధుల నుంచి వాటా రూపేణా అధికారులు, వైద్యులు, పారా మెడికల్, స్టాఫ్ నర్సులు, ఇతర సిబ్బంది పంచుకుంటున్నారు. మరోవైపు ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఎన్టీఆర్ వైద్యసేవ పథకం ఉన్నా తగిన ప్యాకేజి మొత్తం లేకపోవడంతో చాలా ఆసుపత్రులు రోగుల నుంచి ప్యాకేజికి మించిన మొత్తాన్ని వసూలు చేస్తున్నాయి. మరికొన్ని ఆసుపత్రులు మా వల్ల కాదంటూ వెనక్కి పంపిస్తున్నాయి. ఆపద్బాంధవుడికి అష్టకష్టాలు జిల్లాలో ప్రస్తుతం 108 అత్యవసర అంబులెన్స్‌లు 32 ఉన్నాయి. వీటిలో అధిక శాతం వాహనాలు మరమ్మతులకు గురయ్యాయి. అయినా నిర్వహణ పనులు చేపట్టకుండా వాటిని అలాగే తిప్పుతున్నారు. ఏ బండి ఎక్కడ ఆగిపోతుందోనని డ్రైవర్లు(పైలెట్లు) తీవ్ర ఆందోళనలో విధులు నిర్వహిస్తున్నారు. ప్రతి వాహనానికి రూ.2,500 విలువ జేసే డీజిల్ కార్డు మాత్రమే ఇస్తున్నారు. ఒక్కోసారి ఇంధనం చాలక షెడ్డుకే వాహనాలు పరిమితం చేయాల్సి వస్తోంది. ఇందులో పనిచేసే 64 మంది పైలెట్లు, టెక్నీషియన్లకు సైతం రెండు నెలల నుంచి జీతాలు రావడం లేదు. అడిగితే టెర్మినేట్ చేస్తామని యాజమాన్యం బెదిరిస్తోందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బడికి రాని బాలసురక్ష జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల ఆరోగ్యస్థితిగతులను తెలుసుకునేందుకు బాల సురక్ష పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీనిని కూడా ధనుష్ అనే సంస్థకు అప్పగించింది. ఇందుకు గాను జిల్లాలోని మండల, జిల్లా పరిషత్ పాఠశాలల్లోని ఒకటి నుంచి 10వ తరగతి విద్యార్థులకు అవసరమైన వైద్యపరీక్షలు నిర్వహించి చికిత్స అందించాలి. అయితే ఈ పథకం ప్రారంభమైన ఆరు నెలల వరకు ఎలాంటి కార్యక్రమాలను ఈ సంస్థ చేపట్టలేదని, ఇటీవలే కార్యక్రమాన్ని ప్రారంభించిందని జిల్లా స్థాయి అధికారులు సైతం చెబుతున్నారు. ఈ కార్యక్రమం సైతం సరిగ్గా నిర్వహించడం లేదని అధికారులు ప్రభుత్వానికి పలుమార్లు నివేదికలు పంపించారు. సంచార వాహనాల్లో మందుల కొరత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో గ్రామాల్లో సేవలు అందించిన 104 సంచార వాహనాలను నేడు రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రైవేటు సంస్థకు అప్పగించింది. ఈ సంస్థ చంద్రన్న సంచార చికిత్సగా నామకరణం చేసి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి 5 కిలో మీటర్ల ఆవల ఉన్న గ్రామాలకు వాహనాన్ని తీసుకెళ్లి గ్రామీణులకు చికిత్స అందిస్తోంది. అయితే ఇలా వెళ్లిన వాహనాల్లో సిబ్బంది సరిగ్గా ఉండటం లేదని, మందులు కూడా ఇవ్వడం లేదని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీపీ, షుగర్ మందులు కూడా తగినంత ఇవ్వకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిర్ణీత తేదీల్లోనూ ఈ వాహనాలు ఆయా గ్రామాలకు వెళ్లడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆరోగ్య కేంద్రాల్లో బోగస్ పరీక్షలు జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో డయా గ్నోస్టిక్ పరీక్షలు (రక్త, మూత్ర పరీక్షలు)ను, ఎక్స్‌రే తీసేందుకు రాష్ట్ర ప్రభు త్వం ప్రైవేటు సంస్థలకు అప్పగించింది. కొన్ని చోట్ల వైద్యుల సహాయంతో ముందుగానే సంతకాలు చేయించి అవసరం లేకపోయినా రోగులకు పరీక్షలు చేస్తున్నారు. అందులో కొన్ని మాత్రమే చేసి, మిగిలిన వాటికి నార్మల్ రిపోర్ట్లు ఇస్తున్నారు. ఇలా ఆసుపత్రికి వచ్చిన రోగుల్లో 20 నుంచి 30 శాతం మంది రోగులకు పరీక్షలు చేశామని పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి బిల్లులు డ్రా చేసుకుంటున్నాయి. కొన్ని చోట్ల వైద్యుల సంతకాలు లేకపోయినా రోగులకు పరీక్షలు చేసినట్లు రాసుకుని బిల్లులు డ్రా చేసుకుంటున్నా అడిగే నాథుడు కరువయ్యారు. ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలకు ఆదరణ కరువు పట్టణాల్లోని మురికివాడల్లో స్వచ్ఛంద సంస్థలు నిర్వహిస్తున్న అర్బన్‌హెల్త్ సెంటర్లను రాష్ట్ర ప్రభుత్వం అపోలో సంస్థకు అప్పగించింది. వీటిని ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలుగా నామకరణం చేసింది. రెగ్యులర్‌గా అందే సేవలతో పాటు టెలి మెడిసిన్‌ను కూడా రోగులకు అందిస్తామని ఆ సంస్థ చెప్పింది. అయితే ఈ సంస్థ వచ్చిన తర్వాత ఏఎన్ఎంలు క్షేత్రస్థాయికి వెళ్లి చికిత్సలు చేయడం లేదు. రోగులే కేంద్రానికి వచ్చి చికిత్స తీసుకోవాల్సి వస్తోంది. టెలి మెడిసిన్ సైతం అందించడం లేదని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు గర్భిణిలు, పిల్లలకు సైతం సరైన వైద్యం అందించేందుకు వైద్యులు అందుబాటులో ఉండటం లేదన్న విమర్శలు ఉన్నాయి. రూ.40 వేల మందులు బయట కొన్నా నాకు ముగ్గురు పిల్లలు. రెండో కుమారుడు యూనుస్(5)కు అపెండిక్స్ వచ్చింది. మూడు వారాల క్రితం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని చిన్నపిల్లల శస్త్రచికిత్స విభాగంలో చేర్పించాము. వెంటనే డాక్టర్లు స్పందించి ఆపరేషన్ చేశారు. అయితే ఆపరేషన్ వికటించడంతో మళ్లీ గత సోమవారం ఆపరేషన్ చేశారు. అయితే బాబు కోలుకోలేక 9వ తేదీన మరణించాడు. మూడు వారాల సమయంలో మాకు రూ.40 వేల దాకా మందులు, ఇతర ఖర్చులు అయ్యాయి. ఎన్టీఆర్ వైద్యసేవ కింద చికిత్స చేస్తున్నామని చెప్పినా ఇంత స్థాయిలో ఖర్చు అయ్యింది. – యూసుఫ్, తిరుమిల్ల గ్రామం, కంభం మండలం, ప్రకాశం జిల్లా 108కు ఫోన్ చేస్తే బిజీ అని చెబుతున్నారు రెండు వారాల క్రితం నా ఫ్రెండ్‌కు రోడ్డు ప్రమాదం జరగడంతో వెంటనే 108కు ఫోన్ చేశాము. ఆ నెంబర్ రింగ్ అవుతోంది గానీ ఎవరూ లిఫ్ట్ చేయడం లేదు. కొంత సేపటికి నా మరో ఫ్రెండ్ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేశారు. అయితే వాహనాలన్నీ బిజీగా ఉన్నాయి...కాస్త ఆలస్యం అవుతుందని, వేచి ఉండాలని చెప్పి ఫోన్ పెట్టేశారు. ఫోన్లోనే రోగి స్థితిగతులను అడిగి తెలుసుకుని, ఇలా చేయండి...అలా చేయండి అంటూ సూచనలు, సలహాలు ఇచ్చారు. దీంతో ఆలస్యం అవుతుందని చెప్పి మేమే ఆటోలో ఆసుపత్రికి తరలించాము. – బషీర్, కల్లూరు డాక్టర్లు ఉండటం లేదు కర్నూలులోని ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు ఉండటం లేదు. టెలిమెడిసిన్ ద్వారా చికిత్స అందిస్తామంటున్నారు గానీ రోగులను వేచి ఉండాలని చెబుతున్నారు. గంటల తరబడి రోగులు అక్కడ కూర్చోలేక వెనక్కిపోతున్నారు. మాది స్వచ్ఛంద సంస్థ. పేదలకు సేవ చేయాలన్న భావనతో ఆరోగ్య కేంద్రాలకు రోగులను తీసుకెళ్తుంటాము. కానీ అక్కడ సరైన వైద్యసేవలు అందకపోవడంతో రోగులు నిరాశ చెందుతున్నారు. – ప్రసాద్, స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు, కర్నూలు -
'పేదల ఆరోగ్యంపై అజాగ్రత్త వద్దు'
ఒంగోలు:ప్రకాశం జిల్లా కలెక్టరేట్ లో జాతీయ గ్రామీణ ఆరోగ్యమిషన్ కార్యక్రమంపై నియోజకవర్గ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సోమవార సమీక్ష నిర్వహించారు. దీనిలో భాగంగానే జిల్లాలో ప్రభుత్వాస్పత్రుల పనితీరుపై సుబ్బారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. పేదల ఆరోగ్యంపై అజాగ్రత్త వద్దని ఆయన సూచించారు. ఈ సమీక్ష సమావేశానికి ఎమ్మెల్యేలు అశోక్ రెడ్డి, గొ్ట్టిపాటి రవికుమార్, ఆదిమూలపు సురేష్, వీరాంజనేయ స్వామి తదితరులు హాజరయ్యారు.