హైవే దిగ్బంధం
Published Sun, Sep 8 2013 2:07 AM | Last Updated on Wed, Apr 3 2019 4:37 PM
రావులపాలెం, న్యూస్‌లైన్: హైదరాబాద్‌లో సేవ్ ఆంధ్రప్రదేశ్ సభకు వెళ్లొస్తున్న రావులపాలెం ఉద్యోగుల బస్సుపై తెలంగాణవాదులు దాడి చేసిన సంఘటనపై స్థానిక సమైక్యాంధ్ర జేఏసీ మండిపడింది. దాడి సమాచారాన్ని ఫోన్ ద్వారా తెలుసుకున్న రావులపాలెం సమైక్యాంధ్ర జేఏసీ సభ్యులు ఆందోళన చేపట్టారు. దాడిలో గాయపడ్డ ఉద్యోగులకు న్యాయం జరిగే వరకు కదిలేది లేదంటూ శనివారం రాత్రి రోడ్డుపై బైఠాయించారు. స్థానిక కళా వెంకట్రావు సెంటరులో జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ను స్తంభింపజేశారు. తెలంగాణవాదుల జులుం నశించాలంటూ నినాదాలు చేశారు. ట్రాఫిక్ స్తంభించడంతో ఎస్సై ఆర్.గోవిందరాజు ఆందోళనకారులతో చర్చించారు.
జేఏసీ చైర్మన్ కర్రి శ్యామ్‌సుందరరెడ్డి హైదారాబాద్‌లో ఉన్న ఉద్యోగులతో ఫోన్‌లో మాట్లాడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సభ నుంచి తిరిగొస్తున్న ఇక్కడి ఉద్యోగుల బస్సు హైదరాబాద్ మలక్‌పేట వద్దకు వచ్చేసరికి తెలంగాణవాదులు రాళ్లతో దాడి చేశారన్నారు. దీంతో బస్సు అద్దాలు పగిలి కొందరికి గాయాలయ్యాయని, దీంతో వారు అక్కడ ఆందోళన చేపడితే.. అక్కడి పోలీసులు చర్యలు తీసుకోలేదన్నారు. డబ్బులిపిస్తామని, వెళ్లిపొమ్మన్నారని ఇక్కడకు సమాచారమిచ్చారన్నారు. వారికి మద్దతుగా దోషులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జాతీయ రహదారి దిగ్బంధించామన్నారు.
సీఐ సీహెచ్‌వీ రామారావు సంఘటన స్థలానికి చేరుకుని, విషయాన్ని జిల్లా ఎస్పీ శివశంకర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన హైదరాబాద్‌లో పోలీసు ఉన్నతాధికారులను సంప్రదించారు. వారి ఆదేశాలతో మలక్‌పేట పోలీసులు కేసు నమోదు చేశారు. దాని ఎఫ్‌ఐఆర్ నంబరును ఉద్యోగులు ఇక్కడ జేఏసీ ప్రతినిధులకు ఫోన్‌లో చెప్పడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో జేఏసీ సభ్యులు పీవీఎస్ సూర్యకుమార్, ఉప సర్పంచ్ కొవ్వూరి జగన్నాథరెడ్డి, పోతంశెట్టి కనికిరెడ్డి, కర్రి సుబ్బారెడ్డి, మన్యం పర్వతవర్ధనరావు పాల్గొన్నారు.
Advertisement
Advertisement