సాక్షి, హిందూపురం : హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పనితీరుపై నియోజకవర్గ ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి తమకు అందుబాటులో ఉండటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో టీడీపీ గెలిచిన నియోజకవర్గాల్లో హిందూపురం ఒకటి. ప్రజలు బాలకృష్ణపై నమ్మకం పెట్టుకుని గెలిపించినా ఆయన మాత్రం ప్రజల కష్టాలను పట్టించుకునే పరిస్థితులు కనిపించడం లేదు. ఎన్నికలు జరిగిన ఆరునెలల్లో ఎమ్మెల్యే నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడటం మానేశారు. గెలిచినప్పటి నుంచి కేవలం రెండుసార్లు మాత్రమే ఇక్కడికి వచ్చారు. నియోజకవర్గంలో ప్రజాసమస్యలపై ఏమాత్రం పట్టింపులేనట్లుగా వదిలేశారు. అసెంబ్లీ సమావేశాలకే కాకుండా జిల్లా కేంద్రంలో నియోజకవర్గాల అభివృద్ధిపై జరిగిన మూడు సమావేశాలకు ఎమ్మెల్యేలందరూ హాజరై తమ వాణిని వినిపించారు. అయితే బాలయ్య మాత్రం సమావేశాలకు డుమ్మా కొట్టారు. ఆయన అసెంబ్లీ, అధికార సమావేశాలకు హాజరుకాకపోవడంతో అధికారులతో పాటు ప్రజల్లో కూడా తీవ్రంగా విమర్శలు వినిపిస్తున్నాయి.
ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఇదే తంతు
గత 2014లో ఎమ్మెల్యే గెలిచినప్పటి నుంచి నేటి వరకు బాలకృష్ణ ఇదే రీతిగా వ్యవహరిçస్తున్నారు. ఐదేళ్లు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే హోదాలో నియోజవకవర్గానికి ఆయన వచ్చిన తేదీలు వేళ్లపై లెక్కించవచ్చు. వచ్చినప్పుడల్లా మండలాల్లో ప్రారంభోత్సవాలు, భూమి పూజలు, రోడ్డుషోలతో సరిపెట్టేశారు. ఎన్నికల సమయంలో సతీసమేతంగా హిందూపురంలో ఇంటింటి ప్రచారాలు చేశారే తప్ప ఆ తర్వాత కనిపించలేదు. 2014 ఎన్నికల సమయంలో అయితే ఏకంగా బాలయ్య దంపతులు స్థానికంగా గృహప్రవేశం చేసి ఇక్కడే ఉంటామని ప్రజలను నమ్మించారు. గతంలో తాను గెలిస్తే హిందూపురం నియోజకవర్గాన్ని రాష్ట్రంలో ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చుదిద్దుతానని చెప్పిన బాలయ్య నియోజకవర్గ పాలన అంతా పీఏలకు అప్పగించి సినిమా షూటింగ్‌లకే పరిమితమయ్యారు.
ప్రస్తుతం 2019 ఎన్నికల్లో కూడా ప్రజలు ఆయన తండ్రి ఎన్టీరామారావుపై ఉన్న అభిమానంతో రెండోసారి పట్టం కట్టారు. ఈసారైనా ప్రజల చేరదీస్తారని నమ్మారు. అయితే బాలకృష్ణ మాత్రం ఒకవైపే చూడండి..రెండోవైపు చూడకూ.. అన్న రీతిలో ఆయన వ్యవహారంలో ఎలాంటి మార్పురాలేదు. దీంతో ప్రజలు నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఉన్నారన్న సంగతి మరిచిపోయే పరిస్థితి నెలకుంది. అధికార కార్యక్రమాలే కాకుండా పార్టీ కార్యక్రమాలకు కూడా రావడంలేకపోవడంతో ప్రజలకే కాకుండా ఆపార్టీ కార్యకర్తల్లో కూడా తీవ్ర అసంతృప్తి నెలకొంది.
కార్తీక దీపోత్సవానికి ఏర్పాట్లు
ప్రజాసమస్యలపై ఏ ఒక్కసారి ఏ సమావేశాలకు హాజరుకాని ఎమ్మెల్యే ఈసారి హిందూపురంలో కార్తీక దీపోత్సవాన్ని కుటుంబ సభ్యులతో కలిసి నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. కార్తీక చివరి సోమవారం నాడు కార్తీక పూజలు, దీపాలు వెలిగించడానికి బాలకృష్ణ దంపతులతో పాటు కుటుంబసభ్యులందరూ వస్తున్నట్లు టీడీపీ నాయకులు చెబుతున్నారు. అయితే ప్రజల మాత్రం సమస్యలపై గళమెత్తి పేదల కుటుంబాల్లో వెలుగులు నింపాలని ప్రజలు కోరుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment