హెచ్‌ఐవీ బాధిత బాలికకు అండగా...
మండపేట : తాను చేయని తప్పుకు బలై కానిరోగం బారిన పడి అయినవారికి బారమైన ఓ బాలికకు మండపేట పోలీసులు అండగా నిలిచారు. ఆమెకు ఓ గూడు, ఆసరా చూపారు. మండపేట మండలం మారేడుబాకకు చెందిన ఒకబాలిక తల్లిదండ్రులను ఆమె చిన్నతనంలోనే హెచ్‌ఐవీ భూతం కబళించింది. అదే వ్యాధితో ఆమె తన సోదరిని కూడా కోల్పోయింది. తల్లిదండ్రుల ద్వారా సంక్రమించిన ఆప్రాణాంతక వ్యాధితో ఆమె కూడా బాధపడుతోంది. ఆమె బంధువులందరూ నిరుపేదలే కావడంతో ఆమెకు ఆశ్రయం కరవైంది.
స్థానికుల చొరవతో ఆమె ఏడేళ్లుగా పట్టణంలోని ఒక హాస్టల్‌లో ఉంటూ ఇంటర్మీడియట్ ఒకేషనల్ కోర్సు పూర్తిచేసింది. ఇప్పుడు ఆమె వయస్సు 17 సంవత్సరాలు. ఆమెను హాస్టల్‌లో కొనసాగించేందుకు నిబంధనలు ఒప్పుకోవంటూ ఇటీవల హాస్టల్ అధికారులు ఆమెను బయటకు పంపేశారు. దాంతో ఆమె తన పెదనాన్న, మేనత్తల పంచకు చేరింది. వారి ఆర్థిక పరిస్థితి కూడా అంతంతమాత్రమే కావడంతో ఎవరు ఆమెను సంరక్షించాలనే విషయమై వివాదం తలెత్తింది. దాంతో ఇరు కుటుంబాల వారు సోమవారం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. బంధువులు ఆమెను స్టేషన్ బయటే వదలిపెట్టి వెళ్లిపోయారు. విషయం ఆరా తీసిన మండపేట ఎస్సై క్రాంతికుమార్ ఆమె దీనావస్థను చూసి చలించిపోయారు.
తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ సరిగా మాట్లాడలేకపోతున్న ఆమె సంరక్షణ బాధ్యతలను ఏదైనా సంస్థకు అప్పగించాలని భావించారు. విషయాన్ని మండపేట సీఐ విజయారావు దృష్టికి తీసుకువెళ్లారు. స్త్రీ, శిశుసంక్షేమశాఖ అధికారులతో పాటు పలుశాఖల అధికారులతో ఏస్సై, సీఐ మాట్లాడారు. చివరకు రావులపాలెంలోని ఫారా స్వచ్ఛంద సంస్థ గురించి తెలియడంతో వారితో మాట్లాడారు. వారు ఆమెను సంరక్షించేందుకు అంగీకరించడంతో మంగళవారం మధ్యాహ్నం సీఐ విజయారావు, ఎస్సై క్రాంతికుమార్‌లు ఖర్చుల కోసం రూ. 1500 నగదు ఇచ్చి, ఏఎస్సై దేవరను తోడుగా ఇచ్చి ఆమెను రావులపాలెం పంపించారు. మండపేట పోలీసులు చూపిన చొరవను పలువురు పట్టణవాసులు అభినందించారు.
పౌష్టికాహారం రావులపాలెం పంపిస్తాం
మండపేటకు చెందిన ‘మేమున్నాం’ స్వచ్ఛంద సంస్థ ప్రతీ నెలా సుమారు 60 మంది హెచ్‌ఐవీ బాధిత చిన్నారులకు ఒక్కొక్కరికి రూ.500 విలువ చేసే పౌష్టికాహార కిట్లు పంపిణీ చేస్తోంది. అందులో భాగంగా మారేడుబాకకు చెందిన బాలికకు కూడా ప్రతీనెలా పౌష్టికాహారం అందజేస్తున్నారు. ప్రస్తుతం ఆమెను రావులపాలెం తరలించడంతో ఇకపై ప్రతీనెలా పౌష్టికాహారాన్ని అక్కడకు తీసుకువెళ్లి అందజేస్తామని సంస్థ వ్యవస్థాపకుడు బుంగా సంజయ్ తెలిపారు.