వేతనం పెంచారు.. అమలు పరిచారు..
సాక్షి, హైదరాబాద్: ఇద్దరూ ఒకే శాఖలో ఒకే రకమైన పనిచేస్తారు. కానీ ఒకరికి ఎక్కువ వేతనం.. మరొకరికి తక్కువ! వారు పోలీస్‌శాఖలో పనిచేసే కానిస్టేబుళ్లు.. హోంగార్డులు. పోలీసు కానిస్టేబుళ్ల తరహాలోనే హోంగార్డులు కూడా శాంతిభద్రతల పరిరక్షణకు పాటుపడతారు. అయితే పోలీసు కానిస్టేబుళ్లకు నెలకు రూ. 15,000 వరకు జీతంగా వస్తోంది. హోంగార్డులకు మాత్రం రోజుకు రూ. 200 చొప్పున నెలకు ఆరు వేల రూపాయలు మాత్రమే వేతనంగా వస్తుంది. హోంగార్డుల శ్రమను గుర్తించిన దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి 2009లో రోజుకు 120 రూపాయలుగా ఉన్న వేతనాన్ని రూ. 200కు పెంచారు. అయితే పెరిగిన నిత్యావసర ధరలను దృష్టిలో ఉంచుకుని వేతనాలను పెంచాల్సిందిగా రెండేళ్లుగా హోంగార్డులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
చివరికి గతేడాది నవంబర్‌లో హోంమంత్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డి రోజువారీ వేతనాన్ని రూ. 200 నుంచి రూ. 300కు పెంచుతున్నట్లు ప్రకటించారు. ఈ వేతనం త్వరలోనే అమల్లోకి వస్తుందని ప్రకటించారు. కానీ ఆ ప్రకటన ఇప్పటి వరకు వాస్తవ రూపం దాల్చలేదు. ప్రకటన చేసి తొమ్మిది నెలలు కావస్తున్నా హోంగార్డుల వేతనాల పెంపు ఫైలు ఆర్థికశాఖ చుట్టూనే తిరుగుతోంది. కొర్రీల మీద కొర్రీలు వేస్తూ అధికారులు ఫైలును తమ చుట్టూ తిప్పుకుంటున్నారని హోంగార్డుల నుంచి ఆవేదన వ్యక్తమవుతోంది.
హోంగార్డుల వేతనాన్ని రోజుకు 200 రూపాయల నుంచి 300 రూపాయలకు పెంచాలని నిర్ణయించిన హోంశాఖ గత నవంబర్‌లో సంబంధిత ఫైలును ఆర్థికశాఖకు పంపించింది. అలాగే డిసెంబర్ నుంచి మార్చి వరకు (ఆర్థిక సంవత్సరం ముగిసే వరకు) పెంచిన వేతనాలకు సరిపడా బడ్జెట్‌ను అదనంగా కేటాయించాలని కూడా ఆ ఫైలులో ఆర్థికశాఖను కోరింది. అయితే అదనపు నిధులు ఇవ్వటం సాధ్యం కాదని, వేతనాల పెంపును కొత్త ఆర్థిక సంవత్సరంలో అంటే ఈ ఏడాది ఏప్రిల్ నుంచి వర్తింపచేసేలా ప్రతిపాదనలు పంపాలని ఆర్థికశాఖ ఫైలును తిప్పిపంపింది. చేసేదేమీ లేక హోంశాఖ సంబంధిత ఫైలును కొత్త ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో పరిగణనలోకి తీసుకోవాల్సిందిగా ఆర్థికశాఖను కోరింది. అయినప్పటికీ ఆర్థికశాఖ కొత్త బడ్జెట్ ప్రతిపాదనల్లో హోంగార్డుల వేతనాల పెంపును పరిగణనలోకి తీసుకోలేదు.
హోంశాఖ పట్టువీడకుండా హోంగార్డుల వేతనాల పెంపు ఫైలును ఇటీవల మళ్లీ ఆర్థికశాఖకు పంపింది. దీన్ని పరిశీలించిన ఆర్థికశాఖ ఉన్నతాధికారులు మరో కొర్రీ వేశారు. హోంగార్డులుగా నియామకానికి అర్హతలు ఏమిటీ, వారి విధులేమిటీ వంటి వివరాలను తెలియజేయాలంటూ ఫైలును తిప్పిపంపారు. ఆర్థికశాఖ తీరుపట్ల హోంగార్డులతో పాటు హోంశాఖ ఉన్నతాధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. రోజుకు వంద రూపాయలు పెంచటానికి తొమ్మిది నెలలుగా ఆర్థికశాఖ ఏదో రూపంలో అడ్డుతగులుతుండటం విచిత్రంగా ఉందని, కనీసం మానవత్వం లేకుండా ఆర్థికశాఖ అధికారులు వ్యవహరిస్తున్నారని హోంగార్డులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్థికశాఖ 36 వేల మంది హోంగార్డుల కుటుంబాల జీవితాలతో చెలగాటం ఆడుతున్నట్లుందని హోంశాఖ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.