బదిలీల కోసం పోలీస్ అధికారుల ఎదురుచూపులు
సాక్షి, గుంటూరు: బదిలీల కోసం పోలీస్ అధికారులు ఎదురుచూస్తున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడి ఐదు నెలలు పూర్తయినా బదిలీల ప్రక్రియ పూర్తికాకపోవడంతో అసంతృప్తితో ఉన్నారు. ఏ పోలీస్ అధికారిని ఎక్కడకు బదిలీ చేయాలో సూచిస్తూ అధికార పార్టీ ప్రజాప్రతినిధులు తమ తమ జాబితాలను నాలుగు నెలల క్రితమే ఉన్నతాధికారులకు అందజేశారు.
అన్ని ప్రభుత్వ శాఖల్లో ఈ నెల 22వ తేదీ నాటికి బదిలీలు పూర్తయినప్పటికీ పోలీస్‌శాఖలో మాత్రం ఆ ఊసే లేకుండా పోయింది. లూప్‌లైన్ పోస్టుల్లో ఉన్న అధికారులతోపాటు ఇతర పోస్టింగ్‌ల కోసం ఎదురుచూస్తున్న వారు నిరాశ చెందుతున్నారు.
ఇటీవల కొందరు సీఐలకు మాత్రం పదోన్నతులు కల్పించారు. సూపర్ న్యూమరీ పోస్టుల పేరుతో డీఎస్పీ స్థాయి కల్పించి పోస్టింగ్‌లు ఇచ్చారు. గ్రూప్-1కు ఎంపికైన 35 మంది నూతన డీఎస్పీలకు పోస్టింగ్‌లు ఇచ్చేందుకు బదిలీలు చేపడతారని భావించినా అవి కూడా జరగడం లేదు.
పోలీస్ ఉన్నతాధికారులు మాత్రం జిల్లాలోని సీఐ, ఎస్‌ఐల పనితీరు, పనిష్‌మెంట్, రివార్డులు ఆధారంగా ఓ జాబితా సిద్ధం చేసినట్టు తెలిసింది. అయితే ఈ జాబితా ఆధారంగా బదిలీలు జరుగుతాయా లేక టీడీపీ ప్రజాప్రతినిధులు ఇచ్చిన జాబితా ప్రకారం బదిలీలు చేస్తారా అనేది మాత్రం మిస్టరీగానే ఉన్నట్టు చెబుతున్నారు.
ఐపీఎస్‌ల విభజన పూర్తయ్యాకే బదిలీలు ?
ఐపీఎస్ అధికారుల విభజన పూర్తయ్యే వరకు పోలీస్‌శాఖలో బదిలీలు జరపకూడదని హోంశాఖ, డీజీపీలు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
గుంటూరు రేంజి ఐజీ పి.వి.సునీల్ కుమార్‌ను మార్చాలంటూ గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల టీడీపీ నేతలు పట్టుబడుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఐజీని బదిలీ చేసిన తరువాతే సీఐ, ఎస్‌ఐల బదిలీలు చేయాలని డీజీపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అంతకు ముందుగా పెండిగ్‌లో ఉన్న ఐపీఎస్‌ల విభజన పూర్తవ్వాలి.
గుంటూరు అర్బన్ ఎస్పీ రాజేష్‌కుమార్ తెలంగాణ ఆప్షన్ ఇవ్వడం, గుంటూరు అర్బన్ ను కమిషనరేట్‌గా మార్చనుండటంతో నగర కమిషనర్‌గా డీఐజీ స్థాయి అధికారి, ఇద్దరు డీసీపీలు రానున్నారు.
గతంలో జిల్లా ఎస్పీగా పనిచేసిన ఓ అధికారిని నగర కమిషనర్‌గా, అర్బన్‌ఎస్పీ రాజేష్‌కుమార్ తెలంగాణకు వెళ్తే రూరల్ ఎస్పీ రామకృష్ణను అర్బన్ డీసీపీగా, గతంలో జిల్లాలో డీఎస్పీగా పనిచేసి ప్రస్తుతం ఎస్పీగా పదోన్నతి పొందిన వ్యక్తిని రూరల్ ఎస్పీగా నియమించాలని జిల్లా టీడీపీ ముఖ్య నేతలు తీవ్ర స్థాయిలో పావులు కదుపుతున్నట్లు సమాచారం.
దీపం ఉండగానే..
బదిలీల కోసం కొందరు అధికారులు తరచూ టీడీపీ నాయకులను కలిసే పనిలో నిమగ్నమయ్యారు. ఎలాగూ బదిలీ తప్పదు. దీనికి ముందే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఉద్దేశంతో సిబ్బంది వసూళ్లకు పాల్పడుతున్నారని, నామమాత్రంగానే విధులు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి.
నిరీక్షణ
Published Wed, Nov 26 2014 1:25 AM | Last Updated on Tue, Aug 21 2018 7:26 PM
Advertisement
Advertisement