నేడో.. రేపో పోలీసు బదిలీలు | tension on police transfers | Sakshi
Sakshi News home page

నేడో.. రేపో పోలీసు బదిలీలు

Published Wed, Nov 5 2014 3:03 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM

tension on police transfers

ఆదిలాబాద్ క్రైం : పోలీసు శాఖలో ఎప్పుడెప్పుడా అని ఊరిస్తున్న బదిలీలపై ఉత్కంఠ నెలకొంది. పది రోజులుగా జిల్లాలోని సీఐ, ఎస్సైలు కళ్లలో వత్తులేసుకొని మరీ ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే గతంలో జరిగిన బదిలీల్లా కాకుండా ఈసారి పూర్తిస్థాయిలో ప్రజాప్రతినిధులపైనే ఆధారపడి ఉంది. జిల్లాలో దీర్ఘకాలికంగా ఒకే చోట పాతుకుపోయిన పోలీసు అధికారులను బదిలీ చేయనున్నారు.

ఈ బదిలీలకు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గ ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. దీం ట్లో భాగంగానే జిల్లా వ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు వారికి అనుకూలమైన సీఐలను, ఎస్సైలను బదిలీపై తెచ్చుకునేందుకు నివే దికలు తయారు చేశారు.
 
నేడో.. రేపో ఉత్తర్వులు..
 జిల్లా పోలీసు శాఖలో బదిలీలు నేడో..రేపో విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు పోలీసు వర్గాల ద్వారా తెలుస్తోంది. ఎస్సైల బదిలీలు జరగాలంటే ఎస్పీ సంబంధిత ఎస్సైల బదిలీల జాబితా తయారు చేసి డీఐజీకి అప్పగించాల్సి ఉంటుంది. నివేదికను పరిశీలించిన అనతంరం డీఐజీ ఉత్తర్వులు జారీ చేస్తారు. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు శాఖలో బదిలీలు జరగడంతో కరీంనగర్ రేంజ్ డీఐజీ భీమానాయక్ సైతం బదిలీ అయ్యారు. దీంతో ప్రభుత్వం ఆ పోస్టులో ఇంత వరకు ఎవ రినీ నియమించలేదు.

 ప్రస్తుతం వరంగల్ రేంజ్ డీఐజీగా ఉన్న మల్లారెడ్డి సోమవారం కరీంనగర్ రేంజ్ ఇన్‌చార్జి డీఐజీగా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటికే బదిలీలకు సంబంధించిన నివేదికను ప్రజాప్రతినిధులు అందజేశారు. డీఐజీ సైతం బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో ఎస్సైల బదిలీలు బుధ, గురువారాల్లో జరిగే అవకాశాలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న 72 పోలీసు స్టేషన్‌లలో సుమారు 60 మంది ఎస్సైలు, 15 మంది సీఐలు బదిలీ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే సీఐల బదిలీలకు సంబంధించి ఇంక ఉత్కంఠత కొనసాగుతూనే ఉంది. సీఐల బదిలీలు జరుగాలంటే ఐజీ నుంచి ఉత్తర్వులు రావాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం నూతనంగా ఐజీ బాద్యతలు చేపట్టిన నవీన్‌చంద్ ప్రజాప్రతినిధులు పంపిన నివేధికను పూర్తి స్థాయిలో పరిశీలించాల్సి ఉంటుంది. దీంతో సీఐల బదిలీలు కొంత ఆలస్యం అయ్యే అవకాశం లేకపోలేదు.

 రాజకీయ బదిలీలు..
 పోలీసు శాఖలో సీఐలు, ఎస్సైల బదిలీలు జరుగాలంటే ఐజీ, డీఐజీ, ఎస్పీల పర్యవేక్షణలో జరుగుతుంది. ఎలాంటి ఆరోపణలు లేకుండా.. శాంతిభద్రతల్లో రాజీపడని.. బాగా పనిచేసే వాళ్లకు ప్రాధాన్యం ఇచ్చి బదిలీలు చేపట్టేవారు. ఇందులో ప్రజాప్రతినిధుల జోక్యం అసలు ఉండేదికాదు. పోలీసు ఉన్నత అధికారులే అన్ని వివరాలు పూర్తి స్థాయిలో సేకరించి ఏ ప్రాంతానికి బదిలీ చేయాలనేది నిర్ణయించేవారు.

 విధుల్లో పారదర్శకత లేని పోలీసు అధికారులకు పనిష్మెంట్ కింద బదిలీ చేస్తే.. బాగా పనిచేసేవారికి గుర్తింపు పొందిన ప్రాంతానికి బదిలీ చేయడం సహజం. ఇది పోలీసు శాఖలో తరతరాలుగా కొనసాగుతుంది. కానీ ప్రస్తుతం ఈ బదిలీల్లో రాజకీయ జోక్యం చేరింది. ప్రజాప్రతినిధులు కోరుకున్నవారు.. కొందరు పోలీసు అధికారులు స్థానిక ఎమ్మెల్యేలకు మమూళ్లు ఇచ్చిన వారు.. వారికి ఇష్టమైన ప్రాంతానికి బదిలీ చేయించుకునేందుకు సిద్ధమయ్యారు. దీని వల్ల సామాన్య ప్రజలకు న్యాయం జరుగుతుందనే నమ్మకం పోతుంది.

 డబ్బులు పెట్టి బదిలీ అయిన అధికారులు తాము పెట్టిన డబ్బు లు ఎలా రాబట్టుకోవాలి అని చూస్తారే తప్ప.. ప్రజలకు నాణ్యమైన సేవలు అందించలనుకోరు. ఇలాంటి పరిస్థితుల్లో చిన్నచిన్న కేసుల్లో సైతం సీఐలు, ఎస్సైలు చేతివాటం ప్రదర్శించడం ఖాయంగా కనిపిస్తుంది. దీంతో పోలీసు స్టేషన్‌లో కేసు వేద్దామంటేనే భయపడాల్సిన పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే కేసుకు ఇంత లెక్కన డబ్బులు అడుగరని గ్యారంటీ లేదు కానుక.

 ప్రజాప్రతినిధుల చుట్టూ చక్కర్లు..
 పోలీసు శాఖలో బదిలీల జాతరకు తెరలేవడంతో పైరవీలు ఊపందుకున్నాయి. కోరుకున్న పోస్టింగ్ దక్కించుకునేందుకు ఎస్సైలు, సీఐలు ప్రజాప్రతినిధుల చుట్టు ప్రదక్షిణలు చేయడం గమనార్హం. మాట వినని అధికారులను సాగనంపి.. వారి స్థానంలో తమ విధేయులను నియమించుకోవాలని ఉద్దేశంతో బదిలీ ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేసీఆర్.. బదిలీల్లో ఎమ్మెల్యేలకు పెద్ద పీఠ వేస్తూ ఏళ్ల తరబడి పాతుకుపోయిన అధికారుల బదిలీలకు ప్రతిపాధనలు సిద్ధం చేయాలని ఆదేశాలు ఇచ్చాడు.

దీంతో పోలీసులకు.. ఇటు ప్రజాప్రతినిధులకు బేరం కుదిరింది. ఇప్పటికే పెద్ద ఎత్తున మూముళ్లు ఇచ్చి బదిలీ కోసం ఎదురు చూస్తున్న అధికారులతో పాటు... ఇంక డబ్బులు చెల్లించేందుకు కొందరు అధికారులు ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్నారు.

ఆదాయం ఎక్కువగా ఉన్న ప్రాంతంలోకి బదిలీ చేయించుకునేందుకు పెద్ద మొత్తంలో చెల్లించేందుకు పోలీసు అధికారులు ముందుకు వస్తుండడం శోచనీయం. ఇప్పటికే నివేదిక సిద్ధం చేసినా గతంలో ఇచ్చిన వారికంటే తాము రెండింతలు ఎక్కువ చెల్లిస్తామంటూ బేరాలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏదేమైన నూతన ప్రభుత్వంలో ఇటు ప్రజాప్రతినిధులకు, అటు పోలీసులకు భలే బేరం కుదిరిందని పలువురు విస్మయపోతున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement