సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : మంచిర్యాల పోలీస్‌స్టేషన్.. జిల్లాలో అత్యంత క్రైం రేట్‌తోపాటు, కాసులు కురిపించే స్థానం ఇది. ఇక్కడ రెండేళ్లు పనిచేస్తే చాలనే భావన అందరిలోనూ ఉంది. జిల్లాలో పోలీసుల బదిలీలకు రంగం సిద్ధమవుతుండటంతో ఇలాంటి పోలీస్ స్టేషన్లలో పోస్టింగ్ కోసం కొందరు పెద్ద ఎత్తున పైరవీలు చేస్తున్నారు. గతంలో ఇక్కడ ఎస్‌ఐగా పనిచేసి పదోన్నతి పొందిన అధికారి తిరిగి ఈ మంచిర్యాల స్థానానికే వచ్చేందుకు స్థానిక ప్రజాప్రతినిధిని సంప్రదించినట్లు తెలుస్తోంది.
గతంలో తన చెప్పుచేతల్లో ఉన్న ఈ అధికారికి ఈ పోస్టింగ్ ఇప్పించుకునేందుకు ఆ నేత కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. జిల్లాలో పలువురు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ల బదిలీలకు ఆ శాఖ ఉన్నతాధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే బదిలీల జాబితాను పోలీసు ఉన్నతాధికారులు సిద్ధం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గణేశ్ నిమజ్జనం అనంతరం ఈ బదిలీ ఉత్తర్వులు వెలువడే అవకాశాలున్నాయి. దీంతో కాసులు కురిపించే ఇలాంటి స్థానాల కోసం కొందరు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.
మంచిర్యాలతోపాటు, ఆదిలాబాద్, నిర్మల్, బెల్లంపల్లి, కాగజ్‌నగర్, మందమర్రి వంటి చోట్ల పనిచేసేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. సాధారణంగా పశ్చిమ జిల్లాలో కంటే తూర్పు జిల్లాలోని పోస్టింగ్‌లపై అధికారులు మొగ్గుచూపుతున్నారు. సార్వత్రిక ఎన్నికల ముందు జిల్లాలో భారీగా పోలీసు బదిలీలు జరిగా యి. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో పనిచేస్తున్న వారిని కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలకు బదిలీ చేశారు. అలాగే ఆయా జిల్లాల్లో పనిచేస్తున్న అధికారులు జిల్లాకు వచ్చారు.
ఈ బదిలీల్లో కూడా అవకతవకలు జరిగాయనే అభిప్రాయం అప్పట్లో వ్యక్తమైంది. తాజాగా పోలీసు ఉన్నతాధికారులు మరోమారు బదిలీల ప్రక్రియకు శ్రీకారం చుట్టడంతో పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది. ఈసారి సుమారు 12 నుంచి 15 సీఐలకు స్థానచలనం కలిగే అవకాశాలున్నాయి. పనితీరు బాగాలేని ఎస్‌ఐలను కూడా బదిలీ వేటు వేయనున్నారు. జిల్లాలో 72 పోలీసు స్టేషన్‌లలో సుమారు 130 మంది ఎస్సైలు, 30 సీఐలు పనిచేస్తున్నారు.
ఈసారి కూడా నేతల కనుసన్నల్లోనే..
ఇప్పటివరకు జరిగిన పోలీసుల బదిలీలన్నీ దాదాపు ఖద్దరు కనుసన్నల్లోనే జరిగాయి. ప్రజాప్రతినిధులు తమ చెప్పుచేతల్లో ఉండే వారికే ఎస్‌ఐ, సీఐలుగా పోస్టింగ్‌లు ఇప్పించుకున్నారు. కొత్త సర్కారు కొలువుదీరాక జరగనున్న ఈ బదిలీలు కూడా ప్రజాప్రతినిధుల సిఫార్సులకే ప్రాధాన్యత దక్కే అవకాశాలున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తమ కనుసన్నల్లో పనిచేసే వారినే ఎస్‌ఐ, సీఐలుగా నియమించుకుంటేనే నేతలు స్థానికంగా పట్టు సాధించవచ్చు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆయా నియోజకవర్గాల పరిధిలోని ప్రజాప్రతినిధులు తమకు అనుకూలమైన అధికారులను నియమించుకునేందుకు మొగ్గుచూపుతున్నారు.
ఆ పోస్టింగ్‌ల కోసం పైరవీలు..!
Published Sun, Sep 7 2014 12:36 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM
Advertisement
Advertisement