పాము కాటుకు గుర్రం మందు | Horse medicine to treat if snake bite | Sakshi
Sakshi News home page

పాము కాటుకు గుర్రం మందు

Published Sun, May 17 2015 2:22 AM | Last Updated on Mon, Aug 20 2018 7:28 PM

పాము కాటుకు గుర్రం మందు - Sakshi

పాము కాటుకు గుర్రం మందు

 /// జి.రామచంద్రారెడ్డి - ఏపీ బ్యూరో:  ముల్లును ముల్లుతోనే తీయడం, వజ్రాన్ని వజ్రంతోనే కోయడం... అందరికీ తెలిసిన మాటే. అలాగే విషానికి విషమే విరుగుడు కూడా. పాము కరిస్తే దానికి విరుగుడుగా పాము విషమే మందు అన్నది కొంతమందికి తెలియొచ్చు. పాము కాటుకు విరుగుడు తయారు చేయడంలో గుర్రం పాత్ర ఎంతో కీలకమన్న విషయం మాత్రం ఎవరికీ తెలియకపోవచ్చు. ఒక్క పాము విషానికే కాదు, యాంటీ వీనంతో పాటు యాంటీ టీటీ, యాంటీ డీటీ వంటి ఎన్నో విషాలకు విరుగుడు గుర్రమే అన్నది వాస్తవం. యాంటీ స్నేక్ వీనం (పాము విషానికి విరుగుడు) గుర్రం నుంచే ఎందుకు తీస్తారు?
 
 గుర్రం నుంచే వీనం ఎందుకు తియ్యాలి?
 పాముకాటు విరుగుడుకు రక్తంలోని ప్లాస్మా ఎంతో కీలకం. పంది, కోతి, మనిషి నుంచి సేకరించే రక్తంలోని ప్లాస్మా నుంచి కూడా మందును తయారు చేయొచ్చు. కానీ అవి ఆశించిన ఫలితాలనివ్వవు. పైగా ఎక్కువ మోతాదులో తీసేందుకు సాధ్యం కాదు. పాముకాటు విరుగుడుకు అవసరమయ్యే వ్యాధి నిరోధక ప్లాస్మా గుర్రంలో మాత్రమే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. పైగా ఒక ఆరోగ్య కరమైన గుర్రం నుంచి నెలకు 7 లీటర్ల రక్తాన్ని సేకరించవచ్చు. గుర్రం రక్తంలో ప్లాస్మా ఎక్కువ. ఒక లీటర్ రక్తంలో 70 శాతం ప్లాస్మా ఉంటుంది. అదే మిగతా జీవుల నుంచి నెలకు 2 లీటర్ల రక్తం కూడా వృద్ధి కాదు. పైగా ప్లాస్మా శాతం తక్కువ. అందుకే పాముకాటు విషానికి విరుగుడుగా గుర్రాన్నే ఎంచుకున్నారు. పాము నుంచి సేకరించిన విషాన్ని గుర్రానికి ఎక్కించడం, గుర్రంలో విషానికి విరుగుడుగా ప్లాస్మా ఉత్పత్తి కావడం, ఆ ప్లాస్మా నుంచి యాంటీ వీనం తయారు చేయడం జరుగుతుంది.
 
 ఇరులా గిరిజనులు
 విరుగుడు సరే, పాము విషం సేకరించడం కూడా సులభమేమీ కాదు. విరుగుడుకు అవసరమైన విషాన్ని ఎక్కడ్నుంచి తెస్తారనేది మరో అంశం. తమిళనాడులో ‘ఇరులా’ అనే గిరిజన తెగ ఉంది. తమిళంలో ఇరుల్ అంటే చీకటి. ఇరులార్ అంటే చీకటిలో బతికే వాళ్లు. అందుకే వీరికి ఇరులా అని పేరొచ్చింది. తమిళనాడులోని ఈశాన్య ప్రాంతాల్లో వీరెక్కువగా ఉంటారు. ముఖ్యంగా విల్లుపురం, కంచీపురం, తిరువణ్ణామలై, చెంగల్‌పట్టు, తిరువల్లూర్ తదితర ప్రాంతాల్లో వీరు నివసిస్తారు. అటు కేరళ, ఇటు ఆంధ్రప్రదేశ్ (చిత్తూరు)లోనూ ఇరులా తెగ వారున్నారు. పాములు, ఎలుకలను పట్టుకోవడం వీరి వృత్తిలో భాగం. ఆడ మగా చిన్నా పెద్దా అందరూ విషపూరితమైన పాములను కూడా ఇట్టే పట్టేస్తారు. వీళ్లిప్పుడు ముఖ్యంగా నాలుగు రకాల పాముల విషం సేకరించి భారతదేశంలో ఉన్న నాలుగు కంపెనీలకు సరఫరా చేస్తున్నారు. ముఖ్యంగా కోబ్రా, రసెల్స్ వైపర్, క్రేట్, సాస్కేల్డ్ వైపర్ అనే నాలుగు రకాల అత్యంత విషమున్న పాములనుంచి విషాన్ని సేకరిస్తారు. ఈ సేకరణకు వన్యప్రాణి సంరక్షణా విభాగం లెసైన్సు ఉంటుంది.
 
 విషాన్ని గుర్రాలకు ఎక్కించి...
 సేకరించిన విషాన్ని 3 నుంచి 5 నెలల మధ్య కాలంలో డోసుల వారీగా ప్రతి వారానికి ఒకసారి గుర్రాలకు ఎక్కిస్తారు. దానికిగానూ 10 మిల్లీలీటర్ల విషాన్ని 1000 మిల్లీలీటర్ల రకరకాల మందులతో డైల్యూట్ చేస్తారు. విషం ఎక్కించిన రెండు నెలల్లో గుర్రం శరీరంలో విషానికి విరుగుడు చేసే రక్తం తయారవుతుంది. ఒక్కో గుర్రం నుంచి నెలకు 7 లీటర్ల రక్తాన్ని తీస్తే, అందులో నుంచి 4.9 లీటర్ల ప్లాస్మా వస్తుంది. ఒక్కో లీటర్ ప్లాస్మా నుంచి 10 మిల్లీ లీటర్లున్న 28 వయెల్స్ (ఇంజెక్షన్ బాటిల్) మందు తయారవుతుంది. ఒక ఆరోగ్యకరమైన గుర్రం నుంచి నెలకు 125 వయెల్స్ తయారు చేయొచ్చు.  
 
 రేస్‌కోర్స్ గుర్రాలు
 గత కొన్నేళ్ల క్రితం మలక్‌పేట రేస్ కోర్సు గుర్రాలను యాంటీ స్నేక్ వీనం తయారీకి తీసుకెళ్లేవారు. పరుగులో వేగం తగ్గినవి, ఆరోగ్యంగా ఉన్నా వయసు మీదపడుతున్న వాటిని ఇలా విక్రయించేవారు. ఒక్కో గుర్రం రూ.2 నుంచి రూ.5 లక్షల వరకూ ధర పలికేది. అయితే చాలినంత గుర్రాలు ఉండేవి కావు. దీంతో యాంటీస్నేక్ వీనం తయారీ కంపెనీలు సొంతంగా గుర్రాల పెంపకం యూనిట్లు ఏర్పాటు చేసుకోవడం మొదలెట్టాయి. మన రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లా కొత్తూరు వద్ద ఇలాంటి యూనిట్ ఉంది.
 
 ఏటా పాముకాటు మరణాలు... 1500
 *    మనదేశంలో ఏటా సుమారు 5 లక్షల మందికి పైగా పాముకాటుకు గురవుతూంటే అందులో 45000 వరకూ మృతి చెందుతున్నట్టు
     గణాంకాలు చెబుతున్నాయి.
 *    ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏటా సుమారు 1,000 నుంచి 1,500 మంది పాముకాటు మృతులు ఉంటున్నట్టు వెద్య ఆరోగ్యశాఖ అంచనా.
 *    పాము కాటు మరణాలు ఎక్కువగా రాత్రి పూటే సంభవిస్తున్నాయి. సకాలంలో ఆస్పత్రులకు రాలేక మృత్యువాత పడుతున్నారు.
 *    పాముకాటు బాధితులకు యాంటీ స్నేక్ వీనం ఇవ్వడం ఒకెత్తయితే.. ఆ విషం శరీరంలో బలంగా ఉన్నప్పుడు వెంటిలేటర్ సపోర్ట్ ఉండాలి. జిల్లా ఆస్పత్రులు, బోధనాసుపత్రుల్లో మినహా పీహెచ్‌సీ, సీహెచ్‌సీ, ఏరియా ఆస్పత్రుల్లో ఈ వసతి లేదు.
 
 నెల ఖర్చు భారీగానే... రూ. 5000
 ఒక గుర్రం నుంచి నెలకు 3 సార్లు అదీ 7 లీటర్లకు మించకుండా రక్తాన్ని సేకరించాలి. అంతకంటే ఎక్కువ తీస్తే గుర్రానికి ప్రమాదం. పైగా విషాన్ని ఎక్కించేప్పుడు గుర్రానికి మంచి పోషణ ఉండాలి. లేదంటే ప్లాస్మా ఉత్పత్తి తగ్గడమే కాకుండా, గుర్రం ఆరోగ్యం దెబ్బతింటుంది.
*  ఒక సంస్థ 600 గుర్రాలను పోషించాలంటే 10 ఎకరాల స్థలం ఉండాలి.
*  ఒక్కో గుర్రాన్ని పోషించేందుకు నెలకు రూ.5,000 ఖర్చు అవుతుంది.
*  25 గుర్రాలకు రూ.5 వేల లెక్కన నెలకు రూ.1.25 లక్షలు ఖర్చవుతుంది.
*  25 గుర్రాలను సంరక్షించేందుకు 10 మంది అవసరం. అంటే నెలకు ఒక్కొక్కరికి రూ.10 వేల
* చొప్పున 10 మందికి లక్ష రూపాయలు అవసరం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement