ఐపీఎల్ పండగ
ఆతిథ్యమివ్వనున్న విశాఖ నగరం
మూడు మ్యాచులకు వేదిక
సిద్ధమవుతున్న వైఎస్సార్ స్టేడియం
విశాఖపట్నం: ఐపీఎల్ క్రికెట్ సందడి ప్రారంభం కానుంది. ఇందులో విశాఖ నగరం తనవంతు పాత్ర పోషించనుంది. ఐపిఎల్ టీ20 మూడు మ్యాచులకు వేదిక కానుంది. రానున్న సీజన్‌లోనే తొలి టెస్ట్ మ్యాచ్‌కు సిద్ధమవుతున్న వైఎస్‌ఆర్ స్టేడియానికి అప్పుడే పండుగ కళ వచ్చేసింది. అటు ప్రపంచకప్ పోటీలు ఊపందుకుంటుంటే విశాఖ ఐపిఎల్‌కు రెడీ అవుతోంది. వన్డేల్లో ఆతిథ్యజట్టుకు అచ్చివచ్చిన స్టేడియంగా పేరుపడ్డ వైఎస్‌ఆర్ ఏసిఏవీడీసీఏ స్టేడియంలో ఐపిఎల్‌కు మరోమారు వేదికగా నిలవనుంది.
గతంలో డెక్కన్ చార్జర్స్ ఫ్రాంచైజీ హోదాలో రెండు ఐపిఎల్ మ్యాచ్ లాడగా ఈసారి స్దానిక ఫ్రాంచైజీ హోదాలో సన్‌రైజర్స్ హైదరాబాద్ మూడు మ్యాచ్‌ల్ని ఆడనుంది. ఏప్రిల్ 8 నుంచి మే 24వరకు జరిగే ఈ సీజన్‌లో మొత్తంగా 60 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఎనిమిది జట్లు డబుల్ రౌండ్ రాబిన్ తర్వాత పాటు ప్లేఆఫ్ మ్యాచ్‌లు ఆడనున్నాయి.
కెప్టెన్‌గా శిఖర్ ధావన్...
ఇటీవల జరిగిన ఐపిఎల్ వేలంలో శిఖర్ ధావన్‌తో పాటు మరో పదముగ్గుర్ని స్దానిక ఫ్రాంచైజి తిరిగి సొంతం చేసుకోగా పదకొండు మంది ఆటగాళ్ళను వదులుకుంది. స్థానిక అంతర్జాతీయ ఆటగాడు వేణుగోపాలరావుని వదులుకోగా రికీబుయ్‌ను జట్టుకు తీసుకుంది. శిఖర్ ధావన్ జట్టుకు నాయకత్వం వహించనుండగా డేల్ స్టెయిన్, భువనేశ్వర్‌లు జట్టుకు ఆడనున్నారు.
లక్ష్మణ్ పర్యవేక్షణ
సన్‌రైజర్స్ జట్టును వివిఎస్ లక్ష్మణ్ మెంటర్‌గా పర్యవేక్షించనుండగా మాజీ డాషింగ్ బాట్స్‌మెన్ శ్రీకాంత్ సహకరించనున్నాడు. ప్రధాన కోచ్‌గా టామ్ మూడీ సేవలందిచనుండగా అత్యధిక టెస్ట్ వికెట్లు తీసిన ముత్తయ్యమురళీదరన్ బౌలింగ్ కోచ్‌గా విశాఖ రానున్నారు.
జట్టు సభ్యులు
శిఖర్ ధావన్, డేవిడ్ వార్నర్, మోర్గాన్, కేవిన్ పీటర్‌సన్, హనుమ విహారీ, కరణ్ శర్మ, లక్ష్మిశుక్లా, మోసెస్ హెరిక్, పద్మనాభన్ ప్రశాంత్, పర్వేజ్ రసూల్, రికీబుయ్ బ్యాట్ ఝళిపించనున్నారు. డేల్ స్టెయిన్, ఇషాంత్ శర్మ, కేన్ విలియమ్‌సన్, భువనేశ్వర్ కుమార్, చమా మిలింద్, ప్రవీణ్‌కుమార్, రవిబొపారా, ఆశిష్‌రెడ్డి,సిద్దార్దకౌల్ బంతితో చెలరేగిపోనున్నారు. నమన్ ఓజాతోపాటు లోకేష్ రాహుల్ వికెట్ల వెనుక నిలవనున్నారు.
ఇవీ మ్యాచ్‌లు...
గతంలో విశాఖ వేదికగా 2012లో డెక్కన్ చార్జర్స్‌తో చెన్నయ్ సూపర్ కింగ్స్, ముంబయ్ ఇండియన్స్ జట్లు ఆడగా ఈసారి సన్‌రైజర్స్‌తో రాజస్థాన్, ఢిల్లీ,కోల్‌కతా జట్లు ఆడనున్నాయి.
ఏప్రిల్- 16న రాజస్థాన్ రాయల్స్‌తో రాత్రి 8గంటలకు
ఏప్రిల్- 18న ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో సాయంత్రం నాలుగు గంటలకు
ఏప్రిల్ -22న కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో సాయంత్రం నాలుగు గంటలకు