16కోట్లు పలికిన యువరాజ్
ఐపీఎల్ వేలంలో కోసం రికార్డు మొత్తం వెచ్చించిన ఢిల్లీ డేర్‌డెవిల్స్
ప్రపంచకప్‌లో చోటు దక్కకపోయినా... ఐపీఎల్‌లో మాత్రం యువరాజ్‌కు ‘రేటు’ పెరిగింది. గత ఏడాది రూ.14 కోట్లకు తీసుకున్న బెంగళూరు రాయల్ చాలెంజర్స్... తమకు భారమయ్యాడంటూ ఈ ఏడాది తప్పించింది. దీంతో సోమవారం బెంగళూరులో జరిగిన వేలంలోకి యువీ వచ్చాడు. ఏప్రిల్‌లో ప్రారంభం కానున్న ఐపీఎల్-8 సీజన్ కోసం జరిగిన వేలంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్ రికార్డు స్థాయిలో రూ.16 కోట్లు పెట్టి యువీని కొనుక్కుంది. ఐపీఎల్ చరిత్రలో ఒక సీజన్‌కు ఒక ఆటగాడికి ఇంత మొత్తం లభించడం ఇదే తొలిసారి. ఈ వేలంలో దినేశ్ కార్తీక్, శ్రీలంక ఆల్‌రౌండర్ మాథ్యూస్‌లకు కూడా భారీ మొత్తాలు లభించాయి.
ధోని వల్లే చోటు దక్కలేదు: యువీ తండ్రి
ప్రపంచకప్‌కు భారత జట్టులో యువరాజ్‌కు స్థానం దక్కకపోవడానికి కెప్టెన్ ధోనియే కారణమని... యువీ తండ్రి యోగ్‌రాజ్ సింగ్ ఆరోపించారు. ‘ప్రపంచంలోనే యువీ అత్యుత్తమ ఆల్‌రౌండర్ కాబట్టే ఐపీఎల్‌లో భారీగా డబ్బు ఇస్తున్నారు. అయితే ధోనికి యువీ అంటే ఇష్టం లేనందునే జట్టులోకి రానీయలేదు’ అని ఆయన ధ్వజమెత్తారు. అయితే దీనిని యువీ వెంటనే తోసిపుచ్చాడు. తనకు, ధోనికి సంబంధాలు బాగున్నాయని చెప్పాడు.