యువరాజ్ కనీస ధర రూ. 2 కోట్లు
ముంబై: ఐపీఎల్-8 కోసం ఫిబ్రవరి 16న బెంగళూరులో వేలం నిర్వహించనున్నారు. భారత క్రికెటర్ యువరాజ్ సింగ్ ఈ వేలంలో తన కనీస ధరను రూ. 2 కోట్లుగా నిర్ణయించుకున్నాడు. కెవిన్ పీటర్సన్, దినేశ్ కార్తీక్‌లతో పాటు గతంలో ఎన్నడూ ఐపీఎల్ ఆడని హషీం ఆమ్లా కూడా రూ. 2 కోట్ల కనీస ధర జాబితాలో ఉన్నాడు. ఇయాన్ మోర్గాన్, ఇర్ఫాన్ పఠాన్, మైక్ హస్సీ, మాథ్యూస్, దిల్షాన్, శామ్యూల్స్, వైట్ తమ కనీస ధరను రూ. 1.50 కోట్లుగా పెట్టుకున్నారు.
ఆరోన్ ఫించ్, రవి బొపారా, జహీర్‌ఖాన్‌లు తమ కనీస ధరను రూ. 1 కోటిగా నిర్ణయించుకోగా, మురళీ విజయ్ రూ. 50 లక్షల కనీస ధరతో వేలంకు సిద్ధమయ్యాడు. ఆటగాళ్ల విడుదల అనంతరం ప్రస్తుతం అత్యధికంగా బెంగళూరు వద్ద రూ. 21 కోట్లు, అత్యల్పంగా చెన్నై వద్ద రూ. 5 కోట్లు ఉన్నాయి. అయితే గత సీజన్‌లో వేలం కోసం ఫ్రాంచైజీలకు గరిష్టం గా అనుమతించిన మొత్తాన్ని మరో రూ. 3 కోట్లు పెంచుతూ గవర్నింగ్ కౌన్సిల్ నిర్ణయం తీసుకోవడంతో జట్లకు వెసులుబాటు కలగనుంది.