దాని వల్ల ఎటువంటి ఉపయోగం లేదు:యువీ
న్యూఢిల్లీ: యువరాజ్ సింగ్.. 2011 వరల్డ్ కప్ హీరో. గత కొంత కాలంగా టీమిండియా జట్టులో స్థానం కోల్పోయి పునరాగమనం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. ఈ క్రమంలోనే ఐపీఎల్ -8లో తన సత్తా చాటి జట్టులో తిరిగి స్థానం సంపాదించాలని ఆరాటుపడుతున్నాడు. అయితే వరుసగా టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై యువరాజ్ తండ్రి యోగ రాజ్ సంచలనం వ్యాఖ్యలు చేసి మీడియాలో పెద్ద చర్చకు తెరలేపాడు. ధోనీని రావణుడితో పోల్చిన తండ్రి వ్యాఖ్యలను యువరాజ్ మరోసారి ట్విట్టర్ ద్వారా ఖండించాడు. 'అటువంటి వ్యాఖ్యల వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. మీడియా ద్వారా ఆ అంశం మరింత పెద్దదిగా మారడం కూడా మంచిది కాదు. అంతకుముందు చెప్పినట్లుగానే ధోనీ నాయకత్వంలో ఆడటాన్ని ఎప్పుడూ ఎంజాయ్ చేస్తా' అని యువరాజ్ స్పష్టం చేశాడు. కొన్ని రోజుల క్రితం తండ్రిగా ప్రమోషన్ పొందిన ధోనీని స్వయంగా కలిసి అభినందనలు తెలపడానికి ఆతృతగా ఎదురు చూస్తున్నాన్నాడు.
'ధోనీ చేసిందేమీ లేదు. మీడియా వల్లే ధోనీ క్రికెట్ దేవుడయ్యాడు. మీడియా ధోనీని గొప్పగా చిత్రీకరించింది. ఇందుకు అతను అనర్హుడు' అని యోగ్రాజ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పడం ఇప్పుడు భారత క్రికెట్ లో హాట్ టాపిక్ గా మారాయి.