కాళ్ల పీహెచ్‌సీలో చికిత్స పొందుతున్న విద్యార్థిని నందిని
కాళ్ల: కాళ్ల ఇంటిగ్రేటెడ్ బాలికల వసతిగృహంలో విద్యార్థినిలు అస్వస్థతకు గురయ్యారు. ఎప్పటిలానే శుక్రవారం ఉదయం హాస్టల్ నుంచి విద్యార్థినిలు హైస్కూల్‌కు వెళ్లారు. వీరిలో ఇద్దరు విద్యార్థినిలు కడుపునొప్పి, తలతిరగడం, తీవ్రమైన ఆయాసంతో ఊపిరి అందక ఇబ్బంది పడుతుండటంతో హైస్కూల్ ఉపాధ్యాయులు వారిని కాళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడి డాక్టర్ పరీక్షించి వీరిలో ఊపిరి అందక బాధపడుతున్న సీహెచ్ నందినిని మెరుగైన వైద్యం కోసం 108లో భీమవరం తరలించారు.
మరో విద్యార్థిని టి.స్వాతి బాగానే ఉండడంతో తిరిగి హాస్టల్‌కు పంపించారు. స్వాతిది చినగరువు, నందినిది భీమవరం స్వస్థలాలు. వీరు హాస్టల్లో ఉంటూ 7వ తరగతి చదువుతున్నారు. దీనిపై డాక్టర్ పి.మోహనను వివరణ కోరగా తాగునీటి వల్లే ఇబ్బంది వచ్చిందని తెలిపారు. రెండు రోజుల క్రితం కూడా ఒక విద్యార్థిని ఇదే సమస్యతో ఆస్పత్రికి వచ్చినట్టు డాక్టర్ చెప్పారు. ఫుడ్‌పాయిజనింగ్ అయితే వాంతులు అయ్యేవని, కలుషిత తాగునీరు వల్లే ఊపిరి అందక నందిని అనే విద్యార్థిని ఇబ్బంది పడుతోందని, మెరుగైన వైద్యం కోసం భీమవరం ప్రభుత్వాసుపత్రికి తరలించామని చెప్పారు.
విద్యార్థినులు అస్వస్థతకు గురికావడంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆందోళన చెందారు. దీనిపై వెంటనే స్పందించిన ఎంఈఓ దండు సీతారామరాజు హాస్టల్ పరిసరాలను, విద్యార్థులు తాగే మంచినీరు తాగి పరీక్షించారు. కాచిన నీరు విద్యార్థులకు అందిస్తున్నామని హాస్టల్ సిబ్బంది ఆయనకు చెప్పారు. హాస్టల్లో పారి«శుద్ధ్య, తాగునీటి సమస్య ఉందని ఎంఈఓ గ్రహించారు. దీనిపై మేట్రిన్ కుసుమను ప్రశ్నిచంగా ఎప్పటికప్పుడు మంచి ఆహారం అందిస్తున్నామని, ఎప్పటినుంచో మంచినీటి సమస్య ఉండటంతో కాచిన నీరు విద్యార్థినులకు అందిస్తున్నామని ఆమె స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment