సాక్షి ప్రతినిధి, ఏలూరు : ఓ హోటల్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా ఏసీ మెకానిక్ నిండు ప్రాణం పోయింది. ఓ ప్రజాప్రతినిధి అనుచరుడు రంగంలోకి దిగి రూ.రెండున్నర లక్షలకు ఖరీదు కట్టి సెటిల్ చేసిన వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీస్ కేసు వరకు వెళ్లకుండా, విషయం బయటకు పొక్కకుండా పంచాయతీ చేసినందుకు సదరు దళారి రూ.లక్ష దండుకున్నట్టు తెలుస్తోంది. తండ్రి లేని నలుగురు ఆడపిల్లల కుటుంబానికి ఏకైక దిక్కైన ఓ పేదవాడి మృత్యువాతపై రాబందుల్లా వాలి కాసులు దండుకున్న దారుణ వ్యవహారం పూర్వాపరాలిలా ఉన్నాయి. ఏలూరు ఆర్‌ఆర్ పేట సమీపంలోని ఓ హోటల్ రెస్టారెంట్‌లో ఈ నెల 18న రాత్రి ఏసీలు పాడవడంతో కత్తేపువీధికి చెందిన మెకానిక్ (21)ను పిలిపించారు. ఏసీలు బాగు చేస్తుండగా కరెంట్ షాక్‌తో ఆ యువకుడు అక్కడికక్కడే చనిపోయాడు. విషయం తెలిసి అతడి డి బంధువులు అర్ధరాత్రి అక్కడకు చేరుకున్నారు. హోటల్ నిర్వాహకులు నిర్లక్ష్యం..
మెయిన్ స్విచ్ ఆఫ్ చేయకపోవడం వల్లే తమ బిడ్డ చనిపోయాడని వాపోయారు. 3నెలల కిందటే యువకుడి తండ్రి మరణించాడని, నలుగురు ఆడపిల్లలున్న ఆ కుటుంబానికి అతనొక్కడే ఆధారమని చెప్పారు. దీంతో విషయం ఎటు తిరిగి ఎటొస్తుందోనని భావించిన యాజమాన్యం నగరంలోని ఓ ప్రజాప్రతి నిధి అనుచరుడిని రంగంలోకి దింపింది. సదరు వ్యక్తి హోటల్ యాజమాని తరఫున వకాల్తా పుచ్చుకుని ‘పోయిన ప్రాణం ఎటూ తిరిగి రాదు. పోలీస్‌స్టేష న్‌లో కేసు పెట్టినా ఒరిగేదేమీ లేదు. రూ.రెండున్నర లక్షలు ఇప్పిస్తా తీసుకోండి’ అని దబాయించి వ్యవహారాన్ని సెటిల్ చేశాడు. ఇందుకుగాను ఆ ప్రజాప్రతినిధి అనుచరుడికి హోటల్ యాజమాన్యం రూ.లక్ష ముట్టజెప్పినట్టు తెలుస్తోంది. ఇంత జరిగితే నగరంలో పోలీసులేం చేస్తున్నారన్నదే ప్రశ్నార్థకంగా మారింది.
ప్రాణం ఖరీదు రూ.రెండున్నర లక్షలు
Published Fri, Aug 28 2015 1:09 AM | Last Updated on Sun, Sep 3 2017 8:14 AM
Advertisement