నిడదవోలు రూరల్: పగలనక, రేయనక కష్టించి పండించిన ధాన్యాన్ని అమ్మి తెచ్చిన సొమ్మును కళ్లెదుటే అగ్నికీలలు ఆహుతి చేస్తుంటే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో కన్నీరుమున్నీరైంది ఓ కౌలు రైతు కుటుంబం. ఈ దయనీయ ఘటన శెట్టిపేటలో సోమవారం అర్ధరాత్రి జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామంలో రెండు పోర్షన్ల తాటాకింట్లో పాఠంశెట్టి వెంకట్రావు కుటుంబంతోపాటు అతని ఇద్దరు కుమారులు వీరవెంకట సత్యనారాయణ, రామకృష్ణ కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. కూలీనాలి చేసుకుని జీవించే వీరంతా రాత్రి పడుకున్న తరువాత విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ వల్ల ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
ఇల్లంతా వ్యాపించాయి. క్షణాల్లో దుస్తులు, నిత్యవసర వస్తువులు, వంటసామగ్రి కాలిబూడిదయ్యాయి. దుస్తుల పెట్టెలో భద్రపరిచిన పంట డబ్బు రూ.80 వేలు కాలిపోయింది. నిడదవోలు అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. మొత్తం రూ.2.50 లక్షల ఆస్తినష్టం వాటిల్లినట్లు అగ్నిమాపకాధికారి జె.శ్రీనివాసరెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment